Feeds:
టపాలు
వ్యాఖ్యలు

జార్జి బుష్‌ తనను వైట్‌ హౌస్‌కు ఆహ్వానించారని, దేశ పరిస్థితిపై పరిపూర్ణంగా తనకు వెల్లడించేందుకు ఆయన హామీ ఇచ్చింనందుకు ఒబామా కృతజ్ఞతలను తెలియజేసారు. బుష్‌తో బైపార్టిసన్‌ స్పిరిట్‌తో కొంత కాలం పాటు దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కలసి పనిచేస్తానని ఆయన తెలిపారు. ‘బుష్‌ ఆహ్వానంపై తాను వైట్‌ హౌస్‌ సందర్శనలో బుష్‌తో తగినంత సమయం సంభాషిస్తానని ఒబామా తెలిపారు. జనవరి 20న పదవి చేపట్టగానే తాను ఆర్థిక వ్యవస్థను ఉత్తేజితం చేసేందుకు అనువైన ప్యాకేజిని మొట్టమొదట ప్రకటిస్తానని ఆయన తెలిపారు. ఇలాంటి ప్యాకేజిని సత్వరమే ప్రకటించకుండా అమెరికా కాంగ్రెస్‌ కాలక్షేపం చేసిందని ఆయన విమర్శించారు.  మనం తవ్వుకున్న గుంటలో మనం పడిపోయాము. ఈ గుంట నుండి వెలికి రావడం అంత తేలికైన పనికాదు. అయితే అమెరికా చాలా శక్తివంతమైన, సమర్ధవంతమైన దేశం. రాజకీయాలను, ముఠాతత్వాన్ని పక్కన బెడితే మనం ఈ గడ్డు పరిస్థితిని అధిగమించగలమని ఒబామా తెలిపారు. కైబినెట్‌ పదవులను ‘పధకం ప్రకారం త్వరలో’ పూర్తి చేయనున్నామని ఆయన తెలిపారు. పథకం ప్రకారం త్వరలో పూర్తి చేస్తాననడంలో నేను ‘పథకం’ ప్రకారంగా పనిచేయండంపైన, ‘వేగంగా’ పనిచేయడం పైన కేంద్రీకరిస్తున్నాను.  ఒబామా గెలుపు ప్రశంసిస్తూ ఇరాన్‌ అధ్యక్షుడు మహమ్మద్‌ అహ్మది నెజాద్‌ అభినందన లేఖను పంపారు. ఆ లేఖకు తగు విధంగా ప్రతిస్పందిస్తానని ఒబామా తెలిపారు. ఇరాన్‌ అణు దురాశలను ఆమోదించేది లేదని ఆయన తేల్చి చెప్పారు. అబ్రహామ్‌ లింకన్‌ రచనలను అధ్యయనం చేశానని, గత అధ్యక్షులతో మాట్లాడానని ఆయన తెలిపారు. ‘నాన్సీ రీగన్‌లా ఉప్పర మీటింగ్‌లతో (సీయన్సెస్‌)తో పొద్దుపుచ్చనని నేను అందరితో చెబుతున్నాన’ని ఒబామా ప్రకటించారు. ఆ తర్వాత నాలిక కరచుకొని రీగన్‌కు పోన్‌ చేసి ‘నిర్లక్ష్యంగా, అవమానకరంగా విమర్శించినందుకు క్షమించమ’ని ఒబామా కోరారు. ఆ తర్వాత రీగన్‌, ఒబామాలు చాలా ఆత్మీయంగా మాట్లాడు కున్నారని ఒబామా అధికార ప్రతినిధి స్టీఫెన్‌ కట్టర్‌ తెలిపారు.

సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే నంది అవార్డుల ప్రదానోత్సవం ఈ నెల 16న జరుగనుంది. తొలుత ఈ నెల 8న అవార్డుల ప్రదానం జరపాలని అనుకున్నప్పటికీ ఇప్పుడు తేదీ ఖరారైంది. హైద్రాబాద్ లోని ఎల్.బి. స్టేడియంలో ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా ఈ అవార్డుల ప్రదానం జరుగుతుందని ఎఫ్.డి.సి. వర్గాలు తెలిపాయి. అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా 2005, 2006 సంవత్సరాలకు గాను నంది అవార్డుల ప్రదానం జరుగుతుంది. కారణాంతరాల వల్ల 2002 తర్వాత ఆగిపోయిన ఎన్టీఆర్ జాతీయ అవార్డులను కూడా ఈ ఉత్సవంలో ప్రదానం చేస్తున్నారు. 2003, 2004, 2005, 2006 సంవత్సరాలకు సంబంధించి నాలుగేళ్లకూ ఒకేసారి అవార్డుల ప్రదానం జరుగుతుంది. 2003 సంవత్సరానికి సూపర్ స్టార్ కృష్ణ, 2004 సంవత్సరానికి ఇళయరాజా, 2005 సంవత్సరానికి కన్నడ నటుడు, రాజకీయవేత్త అంబరీష్, 2006సంవత్సరానికి వహిదీ రహమాన్ ఈ అవార్డులకు అందుకోనున్నారు. అలాగే దాదాసాహెబ్ ఫాల్కేతో సమానంగా భావించే రాష్ట్ర ప్రభుత్వ రఘుపతి వెంకయ్య అవార్డును 2005 సంవత్సరానికి ప్రముఖ కవి, దర్శక నిర్మాత, ‘మల్లెమాల’గా జగమెరిగిన ఎం.ఎస్.రెడ్డికి, 2006 సంవత్సరానికి గిన్నెస్ బుక్ ఆప్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్న సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డాక్టర్ డి.రామానాయుడుకు ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులతో పాటు, పరిశ్రమకు చెందిన ప్రముఖులంతా హాజరుకానున్నారు.

అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన బరాక్‌ ఒబామా ఆర్ధిక వ్యవస్థను చక్కదిద్దేందుకు నడుంకట్టారు. ఎకనామిక్స్ క్రైసెస్‌ను ఎదుర్కొనేందుకు 17మంది సభ్యులతో ఉన్నత స్థాయి సలహా మండలిని నియమించారు. చిన్నతరహా పరిశ్రమలకు చేయూత నివ్వవనున్నట్లు ఆయన తెలిపారు. ఇతేకాకుండా దేశంలోని మధ్యతరగతి ప్రజల స్థితిగతులను మెరుగుపర్చే దిశగా చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. దీంతో బిలియనీర్‌ వారన్‌ బఫెట్‌, గగూల్‌ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎరిక్‌ష్మీద్‌ మరికొంత మంది ప్రముఖులు ఈ కమిటీలో ఉన్నారు.

యువగర్జనపై ప్రజారాజ్యం పార్టీ అధికార ప్రతినిధి చేసిన విమర్శలు ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ విమర్శలకు ప్రతిగా ప్రతివిమర్శలతో ప్రజారాజ్యంపై దాడికి దిగారు దేశం నేతలు పార్టీ ఏర్పాటు జరిగిన అనతికాలంలోనే ఇతర పార్టీలు విమర్శించే స్థాయికి ప్రజారాజ్యం ఎదిగిందా పలువురు నిప్పులు చెరిగారు. తెలుగుదేశం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన యువగర్జనపై వివిధ పార్టీలు స్పందించాయి. ఇందులో భాగంగానే యువగర్జనను ప్రజారాజ్యం ఎద్దేవా చేసింది. గుంటూరులో ఆ పార్టీ హాహాకారాలు, ఆర్తనాదాలు చేసిందని అధికార ప్రతినిధిప్రభాక పరకాల ర్ విమర్శించారు. పీఆర్పీ వ్యాఖ్యలపై టీడీపీ ప్రతిదాడికి దిగింది. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌ తొత్తులా వ్యవహరిస్తోందంటూ విమర్శించింది. ప్రజారాజ్యం నేతలకు అప్పుడే అహంకారం తలకెక్కిందంటూ టీడీపీ నేత దాడివీరభద్రరావు మండిపడ్డారు. మరోవైపు బీజేపీ కూడా ప్రజారాజ్యంపై మండిపడుతోంది. పీఆర్పీతో పోత్తు కోసం వెంపర్లాడాల్సిన ఖర్మ బీజేపీకి పట్టలేదని ఆ పార్టీ సీనియర్ నేత విద్యాసాగర్ రావు తెలిపారు. పొత్తు కావాలంటే చిరంజీవే తమ దగ్గరకి రావాలి తప్ప తాము వెళ్లే పరిస్థితి రాదన్నారు. ప్రత్యేక తెలంగాణపై ప్రజారాజ్యం పార్టీకి స్పష్టమైన వైఖరి లేదంటూ ఆరోపించిన విద్యాసాగర్‌రావు టీడీపీపై కూడా విమర్శలు గుప్పించారు. రాబోయే ఎన్నికల్లో బిజెపి నిర్ణయాత్మకమైన పాత్ర పోషిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయ వాతావరణం వేడిగా మారుతోంది.

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన సందర్భంగా కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న ఏర్పాట్లు, నిర్వహిస్తున్న సమావేశాలపై జిల్లాకు చెందిన ఓ ఎంపీ కాంగ్రెస్‌ అధిష్ఠానానికి లేఖ రాసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. జగన్‌ను రాహుల్‌గాంధీతో పోలుస్తున్నారని, ఆయనకు కాంగ్రెస్‌ పార్టీలో ఏ పదవీ లేదని, పార్టీ నిబంధనలను ఉల్లంఘించి తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు రావడం సరికాదని ఆ ఎంపీ తన లేఖలో పేర్కొన్నట్లు సమాచారం.  జగన్‌ ఏదో ప్రారంభోత్సవానికి జిల్లాకు వస్తుంటే ఎంపీ, ఎమ్మెల్యేలుగా పనిచేసిన, పనిచేస్తున్న నాయకులు సైతం ఏర్పాట్లలో నిమగ్నమవడం దురదృష్టకరమని అంతకుముందే సదరు ఎంపీ కాకినాడ సమావేశంలో తన మనసులో మాట బయటపెట్టినట్లు చెప్పుకుంటున్నారు. జగన్‌ యువసేన అంటే పార్టీకి అనుబంధ సంస్థ కాదని, అలాంటిది జిల్లాలో జగన్‌ పర్యటనకు కాంగ్రెస్‌ నేతలు అంత ప్రాధాన్యత ఇవ్వడం ఎందుకంటూ ఆ ఎంపీ వ్యాఖ్యానించినట్లు పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది.  జగన్‌ ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొనేందుకు మార్గం సుగమమైనందునే జిల్లాలో 65 కిలోమీటర్ల మేర ఆయన ర్యాలీ ఏర్పాటు చేసినట్లు మరో వర్గం నేతలు పేర్కొంటున్నారు. అయితే జిల్లా నేతలు మాత్రం జగన్‌ పర్యటనతో యువతను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కన్పిస్తోంది.

హైతీ: హైతీ రాజధాని పోర్ట్‌-అ-ప్రిన్స్‌ సమీపంలో ఓ స్కూలు భవనం కూలిన దుర్ఘటనలో 50 మంది వరకు చిన్నారులు మృతిచెందారు. వందలమంది గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మూడంతస్థుల ఈ స్కూలు భవనం క్లాసులు జరుగుతుండగా కూలింది. అందులో ఎక్కువభాగం పక్కనే ఉన్న ఇళ్లపై పడటంతో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయం తెలిసి తల్లిదండ్రులు రోదిస్తూ ఆసుపత్రులకు పరుగుతీశారు. ఐక్యరాజ్యసమితి శాంతిసేనలు, ఇతరులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. అక్కడ వాతావరణం భూకంపం వచ్చిన అనంతరం పరిస్థితిలా ఉంది. ఎటుచూసినా శిధిలాలు, పిల్లల ఆర్తనాదాలు చూసేవారి గుండెను ద్రవింపజేస్తున్నాయి.

న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కం(గే సెక్స్‌)తో ఆరోగ్యానికి ఎటువంటి చేటు ఉండదని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. గేసెక్స్‌ వల్ల జననాంగాలకు హాని జరుగుతుందంటూ బీజేపీ సీనియర్‌ నేత బీపీ సింఘాల్‌ చేసిన వాదనతో కోర్టు ఏకీభవించలేదు. స్వలింగ సంపర్కంపై ఉన్న చట్టపరమైన ఆంక్షలను కొనసాగించాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. “పలు దేశాల్లో గే సెక్స్‌పై నిషేధం తొలగించారు. ఆ చర్య హానికరమని ఎవరూ చెప్పలేదు. స్వలింగ సంపర్కం మంచిది కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఎన్నడూ ప్రకటించలేదు” అని ప్రధాన న్యాయమూర్తి ఏపీ షా, న్యాయమూర్తి ఎస్‌.మురళీధర్‌తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. స్వలింగ సంపర్కుల హక్కుల కోసం ఉద్యమిస్తున్న కొందరు దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు విచారించింది. గే సెక్స్‌ నేరం కాదని ప్రకటించాలని వారు ఆ పిటిషన్లలో కోరారు. దీనిని బీజేపీ నేత సింఘాల్‌ వ్యతిరేకిస్తున్నారు.  ఓ వేళ పరస్పర అంగీ కారంపై ఇద్దరు గే సెక్స్‌కు సిద్ధపడినా.. వారిని అందుకు అనుమతించ రాదంటూ సింఘాల్‌ తరఫు న్యాయవాది హెచ్‌.వి.శర్మ చేసిన వాదనపై బెంచ్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. స్వలింగ సంపర్కం హానికరమని రుజువు చేసే సమాచారం ఏమైనా ఉందా? అని ప్రశ్నించింది. దీనికి సంబం«ధించి ఎటువంటి అధ్యయనమూ జరగలేదని శర్మ బదులిచ్చారు. గే సెక్స్‌తో లైంగిక వ్యాధులు ప్రబలే అవకాశాలు లేవనే వాదనను బలపరిచే రెండు అధ్యయనపత్రాలను గే హక్కుల ఉద్యమకారులు కోర్టు ముందుంచారు.

హైదరాబాద్‌ : దేశవ్యాప్తంగా వివిధ వార్తా పత్రికల పాఠకుల సంఖ్యను మదింపు వేసేందుకు మీడియా రీసెర్చ్‌ యూజర్‌ కౌన్సిల్‌ (ఎంఆర్‌యుసి) నిర్వహించే ఇండియన్‌ రీడర్‌షిప్‌ సర్వే (ఐఆర్‌ఎస్‌)లో తెలుగు ప్రజల అభిమానపత్రిక ఆంధ్రజ్యోతి రికార్డు సృష్టించింది. తెలుగుతో సహా దేశవ్యాప్తంగా దాదాపు అన్ని భాషాపత్రికల రీడర్‌ షిప్‌ తిరోగమనంలో ఉన్న సమయంలో ఆంధ్రజ్యోతి ఒక్కటే పాఠకుల సంఖ్యను గణనీయంగా పెంచుకున్నది.

ప్రాంతీయ భాషా పత్రికలకు సంబంధించి రీడర్‌షిప్‌ వృద్ధిలో దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలిచింది. వృద్ధి విషయంలో దక్షిణాదిలో మరే పత్రికా ఆంధ్రజ్యోతి దరిదాపుల్లో కూడా లేదు. వాస్తవానికి ఐఆర్‌ఎస్‌ 08- రౌండ్‌ 2 సర్వే వివరాల ప్రకారం తొలి రౌండ్‌తో పోలిస్తే దేశవ్యాప్తంగా పలు ప్రధాన దిన, వార, మాసపత్రికల పాఠకుల సంఖ్య భారీగా తగ్గింది. ప్రాంతీయ భాషా పత్రికల్లో ఈ ట్రెండ్‌ మరింత స్పష్టంగా ఉంది.

అయితే పాఠకుల మొక్కవోని అభిమానం కారణంగా ఆంధ్రజ్యోతి మాత్రం ఈ ట్రెండ్‌కు అతీతంగా నిలిచింది. నిర్బీతితో కూడిన వార్తా కథనాలు, నికార్సైన జర్నలిస్టు విలువలతో రాణిస్తున్న ఆంధ్రజ్యోతికి పాఠకులు పడుతున్న నీరాజనానికి ఇది తిరుగులేని రుజువు. తెలుగులో ఆంధ్రజ్యోతి ఆధిక్యతను, పెరుగుతున్న పాఠక జనాదరణను ఈ సర్వే స్పష్టంగా తెలియజేసింది.

ఐఆర్‌ఎస్‌ 08 తొలి రౌండ్‌తో పోలిస్తే రెండో రౌండ్‌ సర్వే ప్రకారం ఆంధ్రజ్యోతి పాఠకుల సంఖ్య 4,94,000 మేర పెరిగింది. తొలి రౌండ్‌లో 63,17,000 ఉన్న పాఠకుల సంఖ్య ఇప్పుడు 68,11,000 కు చేరింది. ఇదే సమయంలో తెలుగుతో సహా దేశవ్యాప్తంగా ప్రధాన ప్రాంతీయ భాషా పత్రికల రీడర్‌ షిప్‌ మాత్రం గణనీయంగా తగ్గింది.

ఐఆర్‌ఎస్‌-08 రౌండ్‌ 2 సర్వే వివరాలు

(పాఠకుల సంఖ్య లక్షల్లో )

పత్రికలు

ఐఆర్‌ఎస్‌ 08 రౌండ్‌ 1

ఐఆర్‌ఎస్‌ 08 రౌండ్‌ 2

పెరుగుదల/ తరుగుదల

ఆంధ్రజ్యోతి

63.17

68.11

+ 4.94

ఈనాడు

147.24

144.11

– 3.13

వార్త

66.48

63.46

– 3.02

ఆంధ్రభూమి

16.92

14.29

– 2.63

ఆంధ్రప్రభ

7.21

4.75

– 2.46

తెలుగులోనే మరో ప్రధాన పత్రిక ఈనాడు పాఠకుల సంఖ్య తొలి రౌండ్‌తో పోలిస్తే 3,13,000 మేర తగ్గింది. వార్త దినపత్రిక పాఠకుల సంఖ్య 3,02,000 తగ్గింది. హిందీ పత్రికలు దైనిక్‌ భాస్కర్‌, హిందుస్తాన్‌ను మినహాయిస్తే వివిధ భాషలకు చెందిన (ఇందులో కొన్ని హిందీ పత్రికలు కూడా ఉన్నాయి) 110 పత్రికల్లో కేవలం ఆంధ్రజ్యోతికి మాత్రమే గరిష్ఠ స్థాయిలో పాఠకుల సంఖ్య పెరిగింది.

ఈ 110 పత్రికల్లో అంతో ఇంతో రీడర్‌షిప్‌ పెరిగిన పత్రికలు కేవలం 20 మాత్రమే ఉన్నాయి. మిగితా 80 పత్రికలు తరుగుదలనే చవిచూశాయి. రీడర్‌ షిప్‌ పెరిగిన ఇరవై పత్రికల్లో నాలుగులక్షలపైబడి రీడర్‌షిప్‌ పెరిగిన పత్రికలు రెండే రెండు ఉన్నాయి. అందులో ఆంధ్రజ్యోతి అగ్రస్థానంలో ఉంది. మొత్తం 23 రాష్ట్రాల్లో 81 నగరాల్లో 2,54,913 మంది పాఠకులను ఈ ఐఆర్‌ఎస్‌ రౌండ్‌ 2 కోసం సర్వే చేసినట్టుగా మీడియా రీసెర్చ్‌ యూజర్‌ కౌన్సిల్‌ వెల్లడించింది.

హైదరాబాద్‌లోని ఓ ప్లాస్టిక్‌ గోడౌన్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. పాతబస్తీలోని బహదూర్‌పురాలో ఉన్న ప్లాస్టిక్‌ గోడౌన్‌లో అర్థరాత్రి ఒంటిగంట సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్లాస్టిక్‌ వస్తువులు కావటంతో మంటలు ఒక్కసారిగా పైకి లేచాయి. దీంతో గోడౌన్‌లోని స్టాకు పూర్తిగా కాలి బూడిదైంది. మూడు ఫైరింజన్ల సిబ్బంది గంటపాటు కష్టపడి మంటలను అదుపులోకి తెచ్చారు.

కడప: కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని మల్లేల మలుపు వద్ద ఓ సిమెంటులారీ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో తొండూరుకు చెందిన హరిశ్చంద్రారెడ్డి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ కింద ఇరుక్కుపోయిన క్లీనర్‌ను జేసీబీ ద్వారా బయటకు లాగి 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు.