Feeds:
టపాలు
వ్యాఖ్యలు

Archive for నవంబర్ 6th, 2008

తెలుగుదేశం పార్టీ అంత్యంత ప్రతిష్టాత్మక రీతిలో గుంటూరులో యువగర్జన నిర్వహించింది. ప్రజలు బ్రహ్మాండంగా తరలివచ్చారని తెలుగుదేశం నేతలు ఆనందంగా ఉన్నారు. ఇంతకుముందు ప్రజారాజ్యంపార్టీ తిరుపతిలో, కాంగ్రెస్ పార్టీ అనంతపురం, నెల్లూరులలో జరిపిన సభలను మించి జనసమీకరణ చేయాలన్న తమ లక్ష్యం నెరవేరిందని దేశం నేతలు ఉత్సాహంగా ఉన్నారు. జనం ఘనంగా వచ్చిన మాట వాస్తవమే. మిగిలిన పక్షాల నేతలు కూడా ఈ సభపై ఏ తరహా విశ్లేషణలు, వ్యాఖ్యలు చేసినా, జన అంచనాలను మాత్రం తక్కువ చేయడం లేదు. అంతవరకు బాగానే ఉంది. మరి ఇక తెలుగుదేశం పార్టీకి ఈ సభ నిర్వహణ ద్వారా ఎలాంటి ప్రయోజనాలు నెరవేరుతాయి? కచ్చితంగా తెలుగుదేశం శ్రేణులలో విశ్వాసం పెరుగుతుంది. అదికార కాంగ్రెస్ పార్టీ మీద, ప్రత్యేకించి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిపై పెద్దగా వ్యతిరేకత లేదని కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేస్తున్న సందర్భంలో, మరోపక్క చిరంజీవి సభలకు జనప్రవాహం వస్తుందని ప్రజారాజ్యంపార్టీ నేతలు సంభరపడుతున్న నేపధ్యంలో టిడిపి భారీ సభ నడపడం ద్వారా తన సత్తాను చాటుకుంది. తన క్యాడరు చెక్కు చెదరలేదని చెప్పడానికి టిడిపి ఈ ప్రయత్నాన్ని బాగానే వాడుకుంది. కాంగ్రెస్ కు తామే ప్రధాన ప్రత్యర్ధి అన్న భావన కల్పించడానికి, ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేఖత బాగానే ఉందని నిరూపించడానికి ఈ సభ ఉపకరిస్తుంది. అంతేకాదు తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు నాయకత్వ పటిమ మరోసారి రుజువు చేసుకున్నట్లయింది. కేవలం జన సమీకరణ ఒక్కటే విజయానికి సరిపోతుందా అన్నది ఓ ప్రశ్న. అన్ని పార్టీలు భారీ సభలు జరుపుతున్నాయి కదా అన్నసందేహం వెన్నంటే ఉంటుంది. సభల నిర్వహణ అయ్యే వ్యయప్రయాసల సంగతెలా ఉన్నా, వచ్చే ఎన్నికల రంగంలో ధీటుగా నిలబడి అధికారం చేపట్టడానికి సవాలు విసురగలిగిందన్న భావన అయితే వ్యక్తం అయింది. ఈ సభ ద్వారా ఇతర పక్షాలు అంటే టి.ఆర్.ఎస్., వామపక్షాలవారికి కూడా తెలుగుదేశం పార్టీ ఒక సంకేతాన్నిఇవ్వగలిగింది. తాను ఎంత బలంగా ఉన్నానో చెప్పగలిగింది. అంతేకాదు. ఎన్.టి.ఆర్.వారసులు తనతో ఉన్నారని చెప్పడం ద్వారా వారి, వారి అభిమానులను తనవైపు తిప్పుకోవడంలో టిడిపి సఫలమైనట్లే. అయితే ఇదే తరుణంలో కేంద్రమంత్రి ఎన్.టి.ఆర్.కుమార్తె పురంధరేశ్వరి బహిరంగ లేఖ రాయడం కాంగ్రెస్ ప్రతి వ్యూహంలో భాగమే. వీటన్నిటికి టిడిపి నేతలు జవాబు చెప్పారుగాని, ఎన్.టి.ఆర్ కుటుంబీకులంతా ఒకేవైపు లేరనడానికి ఆ లేఖ పనికివస్తుంది. ఇక ఉపన్యాసాలు చూస్తే బాలకృష్ణ ప్రసంగం ప్రజల్ని బాగానే ఆకట్టుకుందని చెప్పాలి. ప్రత్యేకించి తాను అన్ని కులాలవాడినని చెప్పడానికి చేసిన ప్రయత్నం బాగుంది. ఇంతవరకు సభ లక్ష్యం నెరవేరినట్లు కన్పించినా, ఇందులో కొన్ని బలహీనతలు కూడా బయటపడ్డాయని ఒప్పుకోకతప్పదు. ఒకప్పుడు ఒంటిచేత్తో పార్టీని, ప్రభుత్వాన్ని నడపగలరని పేరు తెచ్చుకున్న చంద్రబాబునాయుడు ఇప్పుడు హరికృష్ణ, బాలకృష్ణ, చివరికి జూనియర్ ఎన్.టి.ఆర్., కళ్యాణరామ్, తారకరత్న వంటి పిన్న వయస్కులపై ఆధారపడడానికి తాపత్రయపడ్డారన్న విమర్శకు ఆస్కారం ఇచ్చారు. ఇక హరికృష్ణ గతంలో చంద్రబాబుపై చేసిన విమర్శలను కూడా కాంగ్రెస్ పార్టీ విస్తారంగా ప్రచారం చేయడానికి సిద్దమైంది. వాటికి హరికృష్ణ జవాబు చెబుతారో లేదో తెలియదు. అంతేకాదు బాలకృష్ణ ఏ విమర్శపడితే ఆ విమర్శ చేయడానికి కుదరదు అన్నట్లుగా బాలకృష్ణ ఇంటిలో కొంతకాలం క్రితం జరిగిన కాల్పుల ఘటనను కాంగ్రెస్ విమర్శనాస్త్రంగా ఎక్కు పెట్టింది వారసత్వం వరంగా ఎక్కువకాలం చెల్లుబాటుకాదు. ప్రతిభ, సామర్ధ్యమే ఏ వ్యక్తికైనా గీటురాళ్ళు అని ఓ ప్రఖ్యాత రచయిత అంటారు. మరి ఈ కొటేషన్ మన రాజకీయాలకు వర్తిస్తుందా అన్నది ప్రశ్న.

Read Full Post »

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న అసమర్ధ విధానాలే ఎన్.డి.ఎను అధికారంలోకి తెస్తాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ అన్నారు. అధిక ధరలు, తీవ్రవాద సమస్యలతో ప్రజలు సుస్థిర ప్రభుత్వం, సమర్ధ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. తాము ఎవరితోనూ పొత్తుల కోసం వెంపర్లాడటంలేదని చిరంజీవి ప్రకటనను పరోక్షంగా ప్రస్తావించారు. బీజేపీ అగ్రనాయకుడు లాల్ క్రిష్ణ అద్వానీ చేపట్టిన విజయసంకల్పయాత్ర పోస్టర్ ను ఆయన  హైదరాబాద్‌లో విడుదల చేసారు. విజయసంకల్పయాత్ర సందర్బంగా ఈ నెల 13న సికింద్రాబాద్ లోని పేరెడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్టు దత్తాత్రేయ తెలిపారు.

Read Full Post »

రాష్ట్రంలోని  ప్రైవేట్‌ సెక్యూరిటీ సంస్థలన్నీ ఇక నుంచి పోలీసుల కనుసన్నల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఇందుకుగాను కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఓ ప్రత్యేక చట్టాన్ని తేనుందని ఆడిషినల్‍ డిజి ఎకే ఖాన్ తెలిపారు. ఎక్కడైతే ప్రయివేటు సెక్యూరిటీలు పనిచేస్తున్నాయో అక్కడ స్థానికంగా సెక్యురిటి భాధ్యతలు కూడా నిర్వహించాల్సివుంటుంది. ఇకనుంచి సెక్యూరిటి ఎజన్సీలలో నియమించే ప్రతి గార్డు బయోడేటా పోలీసులకు తెలియజేయాలి. సెక్యూరిటి ఎజన్సీలు తప్పకుండా పోలీసుల అనుమతి రిజిష్ట్రేషన్ ఉండాలని ఆడిషినల్‍ డిజిపి ఎకెఖాన్ తెలిపారు.

Read Full Post »

జాక్టో రెండుగా చీలింది. సమ్మె విరమణ జరిగి మూడు రోజులు కాకముందే జాక్టో చీలడం వెనక ప్రభుత్వ హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సమ్మె విరమణను వ్యతిరేకించిన యూటీఎఫ్‌, డీటిఎఫ్‌, తెలుగునాడు ఉపాధ్యాయ సంఘాలను మెజార్టీ సంఘాలు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి. 13 రోజుల సమ్మె వల్ల టీచర్లకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని ఈ మూడు సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. తమను కించపరిచే చర్యలకు పాల్పడినందునే ఆ సంఘాలను బహిష్కరించినట్లు మిగతా సంఘాలు నేతలు చెబుతున్నారు.

Read Full Post »

హైదరాబాద్‌: తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లోకెక్కే మార్కెటింగ్‌ మంత్రి మారెప్ప ఈరోజు సినిమా రంగంపై విరుచుకుపడ్డారు. యువగర్జన సభలో నందమూరి బాలకృష్ణ ప్రసంగాన్ని మారెప్ప విమర్శించారు. అసలు సి.. అంటే సిగ్గు, ని.. అంటే నిజాయతీ, మా.. అంటే మానవత్వం లేనిదే ‘సినిమా’ అని మారెప్ప వ్యాఖ్యానించారు.

Read Full Post »

హైదరాబాద్‌: యువగర్జన సభలో బాలకృష్ణ ప్రసంగంపై విద్యుత్తు శాఖ మంత్రి షబ్బీర్‌ అలీ విరుచుకుపడ్డారు. తొడలుగొట్టేందుకు రాజకీయాలంటే… మూడు గంటల సినిమా కాదని అన్నారు. సినిమాల్లోలాగా రాజకీయాల్లో పహిల్వాన్‌గిరీ చేయడం సాధ్యం కాదనీ, కాంగ్రెస్‌లో అటువంటి పహిల్వాన్లు ఎంతోమంది ఉన్నారని బాలకృష్ణనుద్దేశించి షబ్బీర్‌ వ్యాఖ్యానించారు. అవినీతి గురించి పదే పదే మాట్లాడుతున్న చంద్రబాబు… ఈ అంశంపై అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో మాట్లాడేందుకు సిద్ధమా? అని షబ్బీర్‌ ప్రశ్నించారు.

Read Full Post »

హైదరాబాద్‌: ఎంతోకాలంగా పార్టీ శ్రేణులు, ప్రభుత్వవర్గాలు ఎదురుచూస్తున్న గ్రేటర్‌ ఎన్నికలు వచ్చేశాయి. వచ్చే ఏడాది జనవరిలో గ్రేటర్‌ హైదరాబాద్‌కు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి వైఎస్‌ చెప్పారు. సికింద్రాబాద్‌, ముషీరాబాద్‌, కంటోన్మెంట్‌ కాంగ్రెస్‌ నేతలతో ముఖ్యమంత్రి ఈరోజు సాయంత్రం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గ్రేటర్‌ ఎన్నికల గురించి వైఎస్‌ సూచనప్రాయంగా వెల్లడించినట్లు తెలుస్తోంది.

Read Full Post »

హైదరాబాద్‌ స్టైలిష్‌ బ్యాట్స్‌మెన్ మరో రికార్డ్‌ సృష్టించాడు. కెరీర్‌లో వందో టెస్ట్‌ ఆడుతున్న తొలి తెలుగువాడిగా రికార్డ్‌ పుటల్లో నిలిచాడు. ఎందరో క్రికెటర్లకు సాధ్యం కాని శతకాల టెస్ట్‌ కలను నాగపూర్ మ్యాచ్‌ ద్వారా లక్ష్మణ్‌ సాకారం చేసుకుంటున్నాడు. వివిఎస్ అంటే వంగివరపు వెంకటసాయి లక్ష్మణ్ ఇది లక్ష్మణ్ పూర్తి పేరు. అయితే అభిమానులు మాత్రం వెరీవెరీస్పెషల్ లక్ష్మణ్‌గా పిలుచుకుంటారు. దీనికి కారణం లేకపోలేదు. ఈ హైదరాబాదీ బ్యాట్సమెన్ కొట్టే షాట్లు స్టైలిష్‌కు, టైమింగ్‌కు మారుపేరుగా విశ్లేషకులు చెబుతారు. నాగ్‌పూర్‌లో జరుగుతున్న మ్యాచ్‌తో లక్ష్మణ్ కెరీర్‌లో వంద టెస్టులు పూర్తి చేసుకుంటున్నాడు. దీంతో వంద టెస్టులు ఆడిన తొలి తెలుగువాడిగా చరిత్ర సృష్టించనున్నాడు. పన్నేండళ్ళ నుంచి భారత క్రికెట్‌కు సేవలందిస్తున్న లక్ష్మణ్‌ ఆసీస్‌తో ఆడిన ప్రతీసారీ కంగారూలకు తన బ్యాట్‌తో లక్ష్మణరేఖ గీశాడు. తాజాగా ఆసీస్‌తో జరిగిన మూడో టెస్టులో రెండో డబుల్ సెంచరీ సాధించాడు. భారత సీనియర్లలో ఒకడిగా వెలుగొందుతున్న లక్ష్మణ్‌ అందరికంటే ఎక్కువ ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. ఎప్పుడు వేటు వేయాల్సి వచ్చినలక్ష్మణ్‌నే బలిచేసేవారు. ఎన్ని సార్లు రాణించినా అతడికి జట్టులో సుస్థిరం కాలేదు. అయినప్పటికీ ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా బ్యాట్‌తోనే తన పని తాను చేసుకుపోయేవాడు. అందుకే అతడి కెరీర్‌లో మరుపురాని ఇన్నింగ్స్‌ ఎన్నో ఉన్నాయి. 2001లో కోల్‌కతా టెస్ట్‌లో ఆసీస్‌ పై రెండో ఇన్నింగ్స్‌లో 281 పరుగులతో భారత్‌కు అద్భుత విజయం అందించాడు. ఇక ప్రత్యర్థి జట్లును విపరీతంగా భయపెట్టే నెంబర్‌ వన్‌ ఆసీస్‌కు లక్ష్మణ్‌ అంటే భయం. అతడు అత్యధిక సగటు నమోదు చేసుకున్నది కంగారూలపైనే. అదే జోరును గవాస్కర్‌ బోర్డర్‌ సిరీస్‌లో కూడా కొనసాగిస్తున్నాడు. అందుకే ఆడుతున్న వందో టెస్ట్‌ అతడి కెరీర్‌లో మరో హైలెట్‌గా ఉండాలని ఆశిద్దాం.

Read Full Post »

చైల్డ్ అర్టిస్ గా గుర్తింపు తెచ్చుకుని ‘నువ్వేకావాలి’ చిత్రంలో హీరోగా మారి  లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుక్కున్న తరుణ్ ఇటీవల కాలంలో హీరోగా కొద్దిగా  వెన కబడ్డారు. తొలి సినిమా తర్వాత ‘నువ్వులేక నేను లేను’ వంటి రెండు మూడు హిట్లు కొట్టిన తరుణ్ కు ఆ తర్వాత సరైన బ్రేక్ రాలేదు. ఇటీవల ‘నవవసంతం’, ‘భలే దొంగలు’ చిత్రాలతో ఆయన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. అయితే ఇంకా ఓ డీసెంట్ హిట్ ఆయనకు దక్కాల్సి ఉంది. ‘శశిరేఖా పరిణయం’ చిత్రం అలాంటి సక్సెస్ నే అందిస్తుందని తరుణ్ ప్రస్తుతం ఆశాభావంతో ఊన్నారు. కృష్ణవంశీ దర్శకత్వంలో తరుణ్-జెనీలియా జంటగా రూపొందుతున్న ఈ చిత్రం దాదాపు నిర్మాణం పూర్తి చేసుకుంది. దీని తర్వాత సుప్రీం అధినేత రాజు హిర్వాణీ సినిమా కూడా తరుణ్ చేతిలో ఉన్నట్లు సమాచారం. తాజాగా తరుణ్ వ్యాపార రంగంలోకి కూడా అడుగుపెడుతున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల భోగట్టా. సొంతంగా ఓ పబ్ ను ఏర్పాటు చేసేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నారు. హైద్రాబాద్ లోని కెబిఆర్ పార్క్ సమీపంలో ఈ పబ్ ఏర్పాటు చేయనున్నారనీ, ఇందుకు తగిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది. నాలుగు రాళ్లు వెనుకేసుకునే సమయంలోనే ఇతర రంగాల్లో పెట్టుబడి ద్వారా ప్యూచర్ లో ఆర్ధికపరమైన భద్రతకు తరుణ్ ప్రయత్నించడం తెలివైన పనిగానే చెప్పాలి.

Read Full Post »

తీపి పదార్థలంటే మీ పిల్లలకు చాలా ఇష్టమా? అయితే ఎన్నో పోషకాలుండే యాపిల్ పండుతో బర్ఫీ చేయడం ఎలాగో చూడండి. పండగరోజుల్లో వచ్చే అతిధులకు, పిల్లలకు వడ్డించడానికి ఉపయోగపడే ఆరోగ్యకరమైన తీయని వంటకమిది. యాపిల్ పండు చెక్కు తీయకుండానే తినాలి. ఎందుకంటే ఫైపొరలోనే ఎంతో మంచి పోషకాలుంటాయి. కాబట్టి ఆచెక్కు తీయకుండానే వంటకం చేయవచ్చు. పంచదార బదులు బెల్లం కూడా వాడ వచ్చు. కావలసిన పదార్థాలు:  సన్నగా తరిగిన యాపిల్ పండు ముక్కలు ఒక కప్పు, కొబ్బరికోరు ఒకటిన్నర కప్పు, పంచదార రెండు కప్పులు, ఆకుపచ్చరంగు మూడు చుక్కలు, పాలు రెండు చెంచాలు, నిమ్మ రసం ఒక చెంచా, బాదం పప్పు పది.   తయారు చేసే విధానం:  ఒక పెద్ద పాత్ర తీసుకుని అందులో కొబ్బరితురుము, పంచదార కలిపి పొయ్యిమీద పెట్టి సన్నని సెగ మీద ఉడికించాలి. గరిటెతో కలుపుతూ ఉండాలి. లేకపోతే మాడిపోతుంది. ఐదూనిమిషాల తర్వాత యాపిల్ ముక్కలు, మూడు చుక్కల రంగు, పాలు కూడా అందులో వేయాలి. బాగా కలపండి. చిక్కబడే దాకా ఉడికించండి. చివరికి నిమ్మరసం వేసి పొయ్యిమీద నుంచి దించేయండి. ఒకప్లేటుకి నెయ్యిరాసి ఉడికించిన మిశ్రమాన్ని ప్లేటులో సమంగా పోయాలి. చిన్న ముక్కలుగా కోయాలి. ఒక్కో ముక్క మీద బాదం పప్పు పెట్టి ఒక గంట పాటు అలాగే ఉండ నీయాలి. బర్ఫీ సిద్దమవుతుంది.

Read Full Post »

Older Posts »