Feeds:
టపాలు
వ్యాఖ్యలు

Archive for అక్టోబర్, 2008

దీపావళి సందర్భంగా పూల మార్కెట్లు సందడిగా మారాయి. వరలక్ష్మీ వ్రతానికి నోములు కూడా తోడవ్వడం, వ్యాపారస్థులు తమ షాపులను పూలతో అలంకరిస్తుండడంతో పూలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. దీంతో మార్కెట్లో పూల ధరలు మూడింతలయ్యాయి. దసరాకు డబుల్ రేట్ పలికిన పూల ధరలు దీపావళికి ఒక్కసారిగా మూడింతలు ధర పలుకుతున్నాయి. రైతులనుంచి పూల దిగుమతి భారీగా తగ్గడం, పండుగల సీజన్ మొదలు కావడంతో దీపావళికి పూల డిమాండ్ భారీగా పెరిగింది. పూలను కొనేందుకు ప్రజలు ఎగబడుతుండడంతో వ్యాపారులు రేట్లను ట్రిపుల్ చేశారు. గతంలో కిలో బంతి పూలు 35 రూపాయలు పలుకగా ప్రస్తుతం 100రూపాయలకు చేరాయి. అటు చామంతి పూలు కిలో 60 నుంచి 180 రూపాయలయ్యాయి. ఇక మల్లెపూలు కిలో 150 రూపాయనుంచి 350 రూపాయలకు చేరింది. కనకాంబ్రాలు కిలో 300 రూపాయలనుంచి 500 రూపాయలకు పెరిగింది. పూల ధరలన్నీ ఆకాశాన్నంటుతుండగా పండుగకు పూల కొనుగోలు తప్పనిసరి కావడంతో ఎంతో కొంత కొనుగోలు చేయాల్సిందే కదా అంటున్నారు గ్రేటర్ వాసులు.మార్కెట్లో పూల షార్టేజ్ వున్నందునే పూల రేట్లు పెరిగాయని డబ్బులు అధికంగా చెల్లించి కొన్నందున తమ లాభం కూడా చూసుకొనేందుకే రేట్లను పెంచామంటున్నారు వ్యాపారులు. మొత్తంమీద కిలోల కొద్ది పూలను కొనుగోలు చేసి తమ షాపులను పూలమయం చేసే నగర వ్యాపారులు పెరిగిన పూల ధరలతో మునుపటి కంటే తక్కువగానే పూలను కొనుగోలు చేస్తున్నారు.

Read Full Post »

ఎవరైనా మనల్ని పండుగ ఏలా జరుపుకున్నారు అని అడిగితే ఘనంగా జరుపుకున్నాం అని బదులిస్తాం. అయితే ఆ పండుగ విశిష్టత ఏమిటని అడిగితే సరిగ్గా సమాధానం చెప్పలేము. కానీ, ప్రతి పండగకు దాని విశిష్టత తెలిసేలా సాధారణ ముగ్గు పిండితో కళాకండాలను సృష్టిస్తూ ఔరా అనిపించుకుంటోంది కావలికి చెందిన ఓ గృహిణి. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణం జనతాపేటలో దేవసేన నివాసం ఉంటోంది. గత పదిహేను సంవత్సరాలుగా ప్రతి పండుగకు ఆ పండుగ విశిష్టత తెలిసేలా ముగ్గులువేసి అందరి మన్ననలు అందుకుంటోంది. వేసేది ముగ్గుపిండితోనైనా అందులోని భావాలు మనసుకు హత్తుకునేలా ఉంటాయి. తన ముగ్గు ద్వారా దీపావళి ప్రతిష్టను తెలపడానికి ఆమె లక్ష్మీదేవి, నరకాసుర వధ వంటి ముగ్గులు వేసి దీపావళి ప్రాముఖ్యతను చాటి చెబుతున్నారు. పాశ్చాత్య వ్యామోహనికి లోనై మన భాష కట్టుబొట్టులకు దూరమవుతున్న నేటి యువతకు ఎంతో చరిత్రకలిగిన మన సంస్కృతి వైపు యువతను మార్చేందుకు ఓ చిన్న ప్రయత్నం చేసున్నానంటోంది దేవసేన.

Read Full Post »

జాక్టో నేతలతో ప్రభుత్వం జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ప్రభుత్వం ఇంకా దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోక పోవడంతో ఈరోజు నుంచి తమ ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని జాక్టో నేతలు హెచ్చరిస్తున్నారు. దీపావళి పర్వదినాన ప్రజలందరూ ఆనందంగా గడిపితే ఉపాద్యాయులు మాత్రం దీపావళి పండుగను విచారంగా జరుపుకుంటున్నారని జాక్టో నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.

Read Full Post »

(రాజ్యలక్ష్మి)

నా పేరు రాజ్యలక్ష్మి, మాది తెనాలి. మాకు అయిదుగురు అన్నయ్యలు. నేను ఒకతినే అమ్మాయిని. చిన్నప్పటినుంచి నన్ను అందరూ బాగా చూసుకున్నారు ఒక్కదాన్ని అని. నాకు 17 ఏళ్ళలో పెళ్ళి చేశారు. పెళ్ళయిన 6 నెలలకు హెచ్ఐవి వుందని తెలిసింది. మా హస్బెండ్‌కి పెళ్ళయిన కొత్తలో బాగా జ్వరం వస్తుంటే అనుమానం వచ్చి హాస్పిటల్‌కి తీసికెళ్ళి టెస్ట్ చేయిస్తే పాజిటివ్ అని వచ్చింది. తర్వాత నేను కూడా చేయించుకుంటే పాజిటివ్ అని వచ్చింది. అప్పటికి ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు. మామూలుగా చేయించాను. ఆ తర్వాత సంవత్సరానికి పాప పుట్టింది. పాపకి 3 ఏళ్ళు. పాపకి లేదు. డెలివరీ టైమ్‌లో నాకు, పాపకి డ్రాప్ వేసారు. పెళ్ళయినప్పటినుంచి మా అత్త మామలతో కలిసి లేడు. వాళ్ళకు నేను నచ్చలేదని నల్లగా వుంటానని, వాళ్ళ అబ్బాయికి నచ్చలేదని ఎప్పుడు ఏదో ఒకటి అంటూ వుండేది. అతను ఫర్నీచర్ వర్క్ చేస్తాడు విజయవాడలో. మా అత్త వాళ్ళుండేది విజయవాడలో. కొన్ని రోజులు మా హస్బెండ్ వాళ్ళ చుట్టాలింట్లో రెంట్ ఇచ్చి వున్నాం. వాళ్ళు కూడా ఏదో ఒకటి అంటుండేవాళ్ళు. మా డబ్బులతో మేం తింటున్నా కూడా. తర్వాత ఇట్లా పాజిటివ్ అని తెలిసిన తర్వాత మా అత్త నీవల్లే వచ్చిందని, మా అబ్బాయికి లేదు అని అనేది. ఇంటి ప్రక్కవాళ్ళందరికి కూడా ఇలాగే చెప్పింది. నాముందు అనలేదు గానీ మా అమ్మవాళ్ళు వెళితే మీ అమ్మాయివల్లనే వచ్చింది, మీ అమ్మాయి మంచిదికాదు అనేది. మా ఆయన, నేను 3 ఏళ్ళు బాగానే వున్నాం. ఒకసారి మా హస్బెండ్‌కి హెల్త్ ప్రాబ్లం వచ్చి మా దగ్గర అసలు మనీ లేకుంటే హాస్పిటల్‌కి చూయించడానికి అత్తగారింటికి తీసికెళ్ళాను. అప్పటినుంచి అక్కడే వున్నాడు.నేను అపుడపుడు వెళ్ళి చూస్తాను. అక్కడ నేను వుంటే నన్ను సరిగ్గా చూడరు. అతన్ని బాగానే చూస్తారు. మొదట్లో అతనిని కూడా సరిగ్గా చూడలేదు. తర్వాత బాగానే చూస్తున్నారు. అతన్ని వాళ్ళ అమ్మ ఇంట్లో దిగబెట్టినప్పటినుంచి నన్ను అనుమానించడం, ఎవ్వరితో మాట్లాడుతున్నావు? ఇట్లా బాగా టార్చర్ పెడుతున్నారు. అక్కడ మేము పనిచేసుకోలేమని అమ్మవాళ్ళు తెనాలిలో వుంటారు. అక్కడికి షిఫ్ట్ అయ్యాం. అమ్మవాళ్ళ సపోర్ట్ వుంటుంది, పాపని వాళ్ళు చూసుకుంటారు కదా అని తెనాలికి వెళ్ళిపోయాం. అతను విజయవాడలో వుండగా మీరు తెనాలి వచ్చేయండి అంటే రాను అన్నాడు. నీకు ఇష్టమైతే ఇక్కడికి రా. లేకపోతే లేదు. నేను రెండవపెళ్ళి చేసుకుంటాను నీవు రాకపోతే అని అంటున్నాడు. ఆ అమ్మాయికి ఎయిడ్స్ వచ్చినా సరే చేసుకుంటాడట. వాళ్ళ అమ్మ వాళ్ళు చూస్తున్నారట. రాకపోతే వదిలివేయండి ఆమె మంచిది కాదు, ఆమెకు హెచ్ఐవి గురించి అంతా తెలుసు అంటున్నారు. పెళ్ళి కాక ముందు అతనికి చెడు అలవాట్లు వున్నాయని చెప్పారు కాని దగ్గర సంబంధం అని చేసుకున్నాం. పెళ్ళయిన దగ్గరినుంచి ఎపుడూ అతనికి బాగుండేది కాదు. ఎప్పుడూ జ్వరం, పడుకొనే వుండేవాడు. ఇది నావల్ల వచ్చిందని చెప్పినందుకు అమ్మవాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఆయన విజయవాడలో, నేను తెనాలిలో వుంటున్నాం. పాప నాదగ్గరే వుంది. పాపను కూడా అడగడు. తీసుకొస్తే చూస్తాను,నేను తెనాలి రాను అంటున్నాడు.  మొదట్లో టెస్ట్ చేయించి నపుడు హెచ్ఐవి అని తెలిసి నాకు రావడం ఏంటి? నేను ఏం చేయలేదుకదా అని చాలా బాధపడ్డాను. అమ్మ, అన్నయ్యవాళ్ళ దగ్గర చాలా ఏడ్చాను. మా హస్బెండ్‌కు కూడా చెప్పలేదు. చచ్చిపోతానని అన్నాను. వాళ్ళే నాకు ధైర్యం యిచ్చి ఆయన దగ్గరినుంచి వచ్చేయ్ మేమే చూసుకుంటామని చెప్పారు. మా అత్తమ్మ నేను వెళ్ళితే అన్నం కూడా పెట్టదు. బైటనుంచి బైటే వచ్చేస్తాను. కనీసం మంచినీళ్ళు తాగుతావా అని కూడా అనదు. మా తల్లిదండ్రులు కూడా ఆయనవల్ల వచ్చిందా? నా వల్ల వచ్చిందా అని చూడలేదు. వున్నన్నాళ్ళు మంచిగా వుండండి అనేవాళ్ళు. ఈమధ్య కొత్తగా నీవల్లే వచ్చిందేమో అని అతను అంటున్నాడు. నేను డైవోర్స్ కి అప్లై చేద్దామనుకుంటున్నాను. ఇంత అనుమానించే వాడు రేపు నిజంగా మా అన్నలతో మాట్లాడినా సరే చాలాపెద్ద ఇష్యూ చేస్తాడు అతను. నేను అతనితో చెప్పాను నావల్లేగాని, ఎవ్వరివల్లేగాని అనుకో వచ్చింది. ఇంకొక అమ్మాయికి నష్టం కలిగించకు, అంటే నాకు తెలుసు ఏం చెయ్యాలో, నీవు చెప్తే వినే పరిస్థితిలో లేను. వస్తే విజయవాడ వచ్చెయ్ అంటాడు. ఇపుడు నాకు 20ఏళ్ళు. అతను ఎప్పుడూ జ్వరంతో వుండేవాడు. సి.డి కౌంట్ తగ్గిపోయింది. కొన్ని రోజులు అయితే ఎవ్వరినీ గుర్తు పట్టలేదు. ఇపుడు కొంచెం పికప్ అయ్యాడు. కాని తలపోటు తగ్గట్లేదు. నేను యాక్షన్ ఎయిడ్ లో ఆరు నెలలనుండి ఫీల్డ్ వర్క్ చేస్తున్నాను.  మాకు తెలిసిన కో-ఆర్డినేటర్ మా పాపకి న్యూట్రిషన్ ఇస్తున్నారు. తెనాలిలో యాక్షన్ ఎయిడ్ బాగా తెలుసు. కౌన్సిలర్స్, హెచ్ఐవి పాజిటివ్‌లను యాక్షన్ ఎయిడ్ దగ్గరికి మందులకోసం పంపిస్తారు. మా హస్బెండ్‌కు సిడి కౌంట్ తగ్గిపోయింది. మందులకోసం యాక్షన్ ఎయిడ్ దగ్గరికి వెళ్ళితే తెలిసింది వీళ్ళు ఇట్లా పాజిటివ్స్ తో పనిచేస్తారని. ఆరు నెలలనుంచి న్యూట్రిషన్ ఇస్తున్నారు. మా హస్బెండ్‌కు కూడా మెడికల్ సపోర్ట్ చేస్తారు. యాక్షన్ ఎయిడ్ వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారు. వాళ్ళు చెప్పినపుడు వింటాడు. మళ్ళీ వెళ్ళిన తరువాత మేడమ్ వాళ్ళు తెనాలి వచ్చేయమని అన్నారుకదా. అంటే మేడమ్ వాళ్ళ ముందు ‘ఊ’ కొడ్తాను, ఎవ్వరు చెప్పినా వినను. నీ ఇష్టమైతే రా అంటాడు. మెడిసిన్స్ కోసం వేలకు వేలు ఖర్చయ్యింది. అమ్మవాళ్ళు పెట్టిన బంగారం కూడా అమ్మేశాను. నా ఆరోగ్యం బాగానే వుంది. నేను మంచి డైట్ అంటే రైస్, టిఫిన్స్ తీసుకుంటాను. మెడిసిన్స్ ఏం వాడను నేను. ఈమధ్య అతనివల్ల హింస చాలా ఎక్కువయింది. అందుకే డైవర్స్ తీసుకుందామని అనుకుంటున్నాను.  మా అమ్మవాళ్ళింటి చుట్టుపక్కల అందరికీ తెలుసు, కాని ఎవ్వరూ నన్ను అడగలేదు. వాళ్ళు బాగానే మాట్లాడతారు. డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ అడిగితే ఎట్లా అని కాస్త భయపడతాను. కాని ఇంతవరకు ఎవ్వరూ అలా అడగలేదు. అమ్మ వాళ్ళది రెంట్ హౌస్ కాబట్టి ప్రాబ్లమ్. మా కాలనీలో చివరుండే ఇంటి వాళ్ళు మాత్రం ఒకసారి ఫోన్ చేసి నన్ను అడిగారు “ఏంది నీకు ఇట్లా వుందట కదా అని” మీకు ఎవ్వరు చెప్పారు అంటే మీ రోడ్డులో అందరికి తెలుసు కాకపోతే నీకు చెప్పట్లేదు. నీముందూ, వెనక చెప్పుకుంటున్నారు, నీకు, మీ హస్బెండ్‌కు వుందని అని అడిగారు. నేను ఏమీ అనలేకపోయాను.  మా అన్నయ్యలు, వదినలు కాని నన్ను దూరంగా పెట్టడం లేదు. వాళ్ళు నాకన్నా మా హస్బెండ్‌ను బాగా చూసుకునేవాళ్ళు. ఎపుడూ వీక్‌గా వుంటాడని ఫ్రూట్స్ అవి తెచ్చి పెట్టేవాళ్ళు. ఇపుడు అతను నాకు రావలసిన డబ్బులు ఇచ్చేయమను. మీవాళ్ళతో నాకేంటి అంటాడు. నన్ను విజయవాడ రమ్మని అంటాడు, నాకు తెనాలిలో జాబ్, రోజూ విజయవాడ వెళ్ళి రావాలంటే చాలా కష్టం. అతని ఫర్నీచర్ వర్క్ ఎక్కడయినా వుంటుంది కదా. అట్లా అంటే కూడా రాడు. ఇట్లా వుందని తెలిసి మా అమ్మవాళ్ళు గొడవచేస్తే చుట్టాలవాళ్ళు పాప పేరు మీద ఒక ఇల్లు కొన్నారు. పాపకు సపోర్ట్ వుంటుంది అనుకొన్నారు. అది 400/-రూ|| రెంట్‌కి ఇచ్చాం.ఆ అద్దెకూడా మా ఆయన తీసుకుంటున్నాడు. తెనాలిలో రెంట్ నేనే కట్టాలి. జరిగిన మూడు సంవత్సరాలు ఎట్లా వున్నాడో కాని ఈ అయిదు, ఆరు నెలల్లో చాలా మారిపోయాడు. ఎపుడూ చెయ్యికూడా చేసుకోనివాడు ఒక్కసారి చెంపమీద కొట్టాడు.  హెచ్ఐవి వుందని తెలిసి నన్ను మోసం చేసింది కాకుండా తెలిసి తెలిసి ఇంకొక అమ్మాయిని కావాలని పెళ్ళి చేసుకుని మోసం చేద్దామనుకుంటున్నాడు. ఇట్లా ఎవ్వరూ చెయ్యకూడదు. ఇంకొక అమ్మాయి లైఫ్ నాశనం చెయ్యకూడదు. తెలిసి తెలిసి మరొకరి జీవితం నాశనం చెయ్యకూడదు.  హెచ్ఐవి వచ్చినంత మాత్రాన లైఫ్ అయిపోలేదు. చనిపోదామనే నిర్ణయం కూడా తీసుకోవద్దు. మామూలుగా అందరిలాగా వుంటూ మంచి డైట్, మందులు తీసుకుంటే అందరిలా బతకొచ్చు. మనస్సులో ఏ ఫీలింగ్స్ పెట్టుకోకుండా సంతోషంగా వుంటే లైఫ్‌ని ఇంకా పొడిగించుకోవచ్చు.  నాకు మొదట్లో హెచ్ఐవి మీద అసలు అవగాహన లేదు. కౌన్సిలింగ్‌కి వచ్చినపుడు కౌన్సిలర్స్ చెప్పారు. అయిదు నిమిషాలు అంతే. కొన్ని రోజుల తర్వాత మా హస్బెండ్ చాలా సీరియస్ అయ్యాడు. బ్రతకడేమో అన్పించినపుడు యాక్షన్ ఎయిడ్ వాళ్ళు సహాయం చేశారు. ఏం ఫర్వాలేదని అతనికి మెడిసిన్స్ ఇప్పించి, నాకు జాబ్ ఇచ్చి ఎంతో సహాయం చేశారు.గవర్నమెంట్ హాస్పిటల్‌కి, కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్ళి పాజిటివ్ వున్నవాళ్ళ గురించి తెలుసుకొని, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫ్రెండ్లీగా మాట్లాడి అట్లా వాళ్ళకు కౌన్సిలింగ్ ఇస్తాం. కొంతమంది తమపట్ల ఎంతో వివక్ష వుందని బాధపడతారు. నేను పాజిటివ్స్ తో మాట్లాడి వాళ్ళకి ధైర్యమిస్తాను.

Read Full Post »

(రమణి)

నేను నల్గొండ జిల్లాలో పల్లెటూర్లో పుట్టాను. ఎడ్యుకేషన్ అంతా అక్కడే జరిగింది. ఒక అక్క, నేను ఇద్దరే అమ్మాయిలం. మా ఫాదర్ ఆర్మీలో చేసి రిటైర్ అయ్యారు. మా ఫ్యామిలీ అంతా అక్కడే సెటిల్ అయింది. అంతకుముందు అన్ని స్టేట్స్ తిరిగినాం. మా నాన్న ఎక్కడికి వెళ్ళితే అక్కడికి పోయాం. ఆరు ఏళ్ళనుంచి అక్కడే సెటిల్ అయ్యాం. నాకు 17 ఏళ్ళపుడు ఇంటర్ చేస్తున్నపుడు ఒకతను కాలేజీలో చూసి మా మామయ్యతో వచ్చాడు. ఈ అమ్మాయి బాగుంది. ఎవరమ్మాయి అనిచెప్పి ఈ అమ్మాయినిపెళ్ళి చేసుకోవాలను కుంటున్నాను అన్నాడు. మా అమ్మని వాళ్ళు వచ్చి అడిగారు. మా మమ్మీకి హార్ట్ ప్రాబ్లమ్ వుంది. ఆమెకేమైనా అయితే నాకు పెళ్ళి చేసేవాళ్ళు ఎవ్వరూ వుండరు అని పెళ్ళి చేసారు.మా హస్బెండ్ ఆర్‌టిసి లో డ్రైవర్. గవర్నమెంట్ జాబ్ వుంది. తెలిసిన అబ్బాయి వూరిలోని అబ్బాయి అని చేశారు. వూరులో వున్నపుడు చాలా మంచివాడుగానే తెలుసు అందరికి. ‘వాళ్ళకు ఆస్తి వుంది. అమ్మాయి ఫ్యూచర్ బాగుంటుంది’ అని నా పెళ్ళి చేశారు.  ఆయనకు హైదరాబాద్‌లో జాబ్ అని ఇక్కడికి రావలసి వచ్చింది. ఇక్కడికి వచ్చాక బేగంపేట్ ఉమెన్స్ కాలేజీలో డిగ్రీకోసం జాయిన్ అయ్యాను. మ్యారేజ్ అయిన ఆరు నెలలకి ప్రెగ్నెన్సీ అని తెలిసింది. ఆర్.టి.సి హాస్పిటల్లో చూపించుకొని అన్ని టెస్ట్ లతో పాటు హెచ్ఐవి టెస్ట్ కూడా రాశారు. నాకు హెచ్ఐవి టెస్ట్ కూడా చేయించారు. పెళ్ళయిన ఒక నెలకి చాలా ఫీవర్ వచ్చింది. అపుడు మా ఫ్యామిలి డాక్టర్ సూర్యాపేటలో టెస్ట్ చేయించారు. ఏం లేదని వచ్చింది. వీళ్ళు టైం పాస్ కోసం చేస్తున్నారు. చేసుకోని అని చెప్పి ఎంతో హ్యాపీగా స్కానింగ్ కి అన్ని బ్లడ్ టెస్ట్ లకి ఇచ్చాను. తరువాత అమ్మవాళ్ళు ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అని వూరు తీసుకెళ్ళారు. ఒక నెల అక్కడే వున్నాను. డైరెక్ట్ గా వూరినుంచి హాస్పిటల్ వచ్చి రిపోర్ట్స్ తీసుకున్నాను. వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడిగారు. ఈ అబ్బాయి మీకు చుట్టాలా? ఏదైనా రిస్క్ బిహేవియర్ వుందా? మీవారికుందా? మీకుందా? అని అడిగారు. ఏంలేదు ఎందుకేంటి ఇలాంటి డౌట్స్ వస్తున్నాయి అని రిపోర్ట్స్ తీసుకున్నాను. హెచ్ఐవి ఫస్ట్ రియాక్టర్ అని వుంది. ఇంటర్‌లో, డిగ్రీలో బి.పి.సి గ్రూప్ కానీ అంత అవగాహన లేదు. నాకు వస్తుందని అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఏంటోలే అని డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగాను. ఏంటి డాక్టర్ నాకు హెచ్ఐవి అని వచ్చింది నిజమేనా. నేను చూడ్డానికి మంచిగా వున్నాను. రాంగ్ రిపోర్ట్స్ కూడా అయి వుండొచ్చు అని డాక్టర్ అన్నాడు. నాకు హెచ్ఐవి వచ్చే ఛాన్స్ వుండదు. నేను ఇంతకు ముందు హెచ్ఐవి టెస్ట్ చేయించుకున్నాను. ఎపుడూ బ్లడ్ ట్రాన్స్‌మిషన్ కాని, ఇంజక్షన్ కాని తీసుకోలేదు. ఇంజక్షన్ అంటే భయం. ఎపుడూ వేయించుకోలేదు. నాకు ఎలాంటి రిస్క్ బిహేవియర్ కూడా లేదు. ఇది తప్పు అని గొడవచేసి ఏడ్చాను. మీ హస్బెండ్ వల్ల కూడా రావొచ్చుకదా అన్నాడు. ఆయనవల్ల ఎందుకు వస్తుంది. ఈ రిపోర్ట్ అంతా తప్పు అని మళ్ళీ వెంటనే బ్లడ్ టెస్ట్ కి ఇచ్చాను. తెల్లారి వచ్చి చూసుకున్నాను. మళ్ళీ అదే హెచ్ఐవి రియాక్టివ్ అని వచ్చింది. అపుడు నమ్మాల్సి వచ్చింది. అపుడు స్టార్ట్ అయింది దీనిగురించి వివరాలు ఎవరు ఇస్తారు అని నేను బుక్స్ కోసం చూశాను. 10వ తరగతిలో ఏదో పోర్షన్‌లో వుంటే అపుడు నేను ఇంట్రెస్ట్ గా చూడలేదు. ఇపుడు వెళ్ళి వేరే పిల్లలను అడిగి తీసుకుని చదివాను. అందులో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏం లేదు. నేను ప్రెగ్నెంట్‌గా వున్నాను. నా పిల్లలకు వస్తుందేమో, ఏం చేయాలో. 19 ఏళ్ళకే ప్రెగ్నెన్సీ, పైగా పాజిటివ్ అని తెలిసింది. మా హస్బెండ్‌ను గట్టిగా అడిగాను. ప్రస్తుతం నాకు ఎలాంటి రిస్క్ బిహేవియర్ లేదని చెప్పారు. నాలుగేళ్ళ బ్యాక్ ఏదో చేశారట, అపుడు చేస్తే ఇపుడు వస్తుందని తెలియదు. డిగ్రీ చదివారు గాని హెచ్ఐవి మీద అవగాహన లేదు. హెచ్ఐవి ఎలా వస్తుంది? ఏంటి? అని. హెచ్ఐవి సెక్స్ ద్వారా వస్తుందని తెలియదు. ఆయన నన్ను అడుగుతున్నారు ఇంకా ఎలా వస్తుంది నీకేమైనా తెలుసా? అని. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చాలా ఏడ్చాను. నేను ఇపుడు ప్రెగ్నెంట్‌గా వున్నాను. నా లైఫ్ అయిపోయింది. నేను ఏం చేయాలి అని ఏడ్చాను. సిటీలో నాలుగు హాస్పిటల్స్ వున్నాయి. వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళు చెబుతారు. బేబీని వుంచాలా? తీసేయాలా అని చెపుతారు అన్నాడు. నయాపూల్ జిఎంఎస్ కి పోయాను. కౌన్సిలర్స్ దగ్గరికి పోయి కలిశాను. మావారికి, నాకు పాజిటివ్ అని వచ్చింది. తరువాత ఏం చేయాలి. తను కౌన్సిలింగ్ ఎలా ఇచ్చిందంటే 50: 50 ఛాన్స్ వుండొచ్చు. కడుపులో వున్న బేబీకి ఎలా రాకుండా వుంటుంది హెచ్ఐవి. తల్లి బ్లడ్ కదా, వస్తుంది. పుట్టగానే చనిపోతుంది అని చెప్పారు. కౌన్సిలింగ్ సరిగ్గా ఇవ్వలేదు. అపుడు అబార్షన్, ఫ్యామిలీ ప్లానింగ్ కూడా చేయించుకున్నాను. 19 సంవత్సరాలకే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా అయి పోయింది. నేను చాలా బాధపడ్డాను. మా ఆయనతో మా కట్నం మాకు ఇచ్చేయ్యండి అని చెప్పి అమ్మ వాళ్ళింటికి పోయాను. అందరూ ఏదో ప్రాబ్లమ్ వుండి విడిపోయాం అనుకున్నారు. తార్నాకకు వెళ్ళినపుడు తెలిసింది నెట్వర్క్ ఆఫ్ పాజిటివ్స్ గురించి. వీళ్ళు మెడిసిన్స్ ఇస్తారు, ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అని వెళ్ళాను.నేను వెళ్ళేటప్పటికి అక్కడ సపోర్ట్ మీటింగ్ జరుగుతోంది. నేను అపుడు అక్కడ 100 మందిని చూశాను, పిల్లల్ని చూశాను, రకరకాల వాళ్ళను చూశాను. హెచ్ఐవి వచ్చిన పిల్లల్ని చూశాను. ఇంకా నయం నాకు పిల్లలు లేరు. వాళ్ళు వుండి వాళ్ళకు వచ్చివుంటే? ఇంకా కొంతమందికి భర్త కూడా లేడు. నాకు నయం మా హస్బెండ్ వున్నాడు. తరువాత మేడంతో మాట్లాడినాను. నేను చాలా ఆలోచించాను. మేడం కూడా చాలా చెప్పారు.  ఒక సంవత్సరం అయింది ఇక్కడికి వచ్చి. ఇపుడు నా భర్త నేను కలిసి వుంటున్నాం. ఇక్కడికి వచ్చాక హెచ్ఐవి గురించి చాలా నేర్చుకున్నా. నయాపూల్ హాస్పిటల్‌లో నాకు సరిగ్గా కౌన్సిలింగ్ ఇవ్వలేదు. హెచ్ఐవి గురించి చాలా తెలుసు కోవాలని వుండేది. జాబ్ చేయాలని ఆసక్తి లేదు. చనిపోయేవాళ్ళకు ఎందుకు అనుకునేదాన్ని. ఇన్ఫర్మేషన్ కోసం పిపిటిసి ట్రైనింగ్ కి వెళ్ళాను. అక్కడ ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ విన్నాను. నాకన్నా చిన్న వయస్సు వాళ్ళు వున్నారు. నేను ఎందుకు మావారికి దూరంగా వుండాలి. ఆయన ఇపుడు బాగానే వుంటున్నాడు. ఆయనకు ఇన్ఫెక్షన్స్ ఏం లేవు. సిడి కౌంట్ తగ్గింది. ఎ ఆర్ వి స్టార్ట్ చేస్తున్నారు. ఇపుడు బాగానే వున్నారు. నన్ను అత్తయ్యవాళ్ళు, అమ్మవాళ్ళు బాగా చూసుకుంటున్నారు. హెల్త్ కాపాడుకోండి అంటారు. హాస్పిటల్‌లో కూడా ఎవ్వరూ డిస్క్రిమినేషన్ చేయలేదు. నేను డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు చదివాను.  ట్రైనింగ్ అయ్యాక ఒ.ఆర్.డబ్ల్యు (Outreach Worker) గా చేశాను. జాబ్ ఇచ్చారు. నేను 300 మందికి కౌన్సిలింగ్ ఇచ్చాను. నేను ఇక్కడికి వచ్చి చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. హాస్పిటల్‌లో టైము వుండదు వాళ్ళు కౌన్సిలింగ్ సరిగ్గా ఇవ్వరు. నేను మూడు లేక నాలుగు ఫ్యామిలీలను కలిపాను. తరువాత వాళ్ళు వచ్చి మా హస్బెండ్ మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు అని అన్నారు.  ఇందులో ఎక్కువగా ఆడవాళ్ళే ఇన్ఫెక్ట్ అవుతున్నారు. చాలామంది 18-35 సంవత్సరాల మధ్యవాళ్ళే వున్నారు. మగవాళ్ళు కూడా కౌన్సిలింగ్ కి వస్తారు. కొంతమంది ఆడవాళ్ళు మొదట్లో కౌన్సిలింగ్ కి రారు. వాళ్ళు మూడు, నాలుగు సెషన్‌ల తర్వాత రావడం మొదలుపెడతారు. మేం చేసేది సోషల్ సర్వీస్. ఏ టైములో అయినా మేడం పిలిస్తే వచ్చి వర్క్ చేస్తాం. పండగలపుడు కూడా వస్తాం. మేము పటాన్చెరువు దగ్గర వుంటాం. ఈమధ్య డా|| బాలాంబను కలిశాను పిల్లల కోసం ప్రయత్నించాలని. కొంచెం వెయిట్ పెరిగాక రమ్మని చెప్పారు. నేను ఇపుడు హెల్తీగానే వున్నాను కాబట్టి వెయిట్ కూడా పెరిగాను.  మేం మంచి డైట్ తీసుకోవాలి. ఆయిల్ ఫుడ్ తీసుకోము. క్యారెట్, వెజిటబుల్స్, ఆకుకూరలు, ఉసిరి, వెల్లుల్లిపాయలు ఎక్కువగా వాడతాను. టిఫిన్ తినను. ఉదయం ఒక గ్లాసు పాలు, మొలకెత్తిన ధాన్యాలు తింటాను. ఎక్కువగా ఫ్రూట్స్, ఫ్రూట్ జూస్ తీసుకుంటాను.  మావద్దకు వచ్చే పాజిటివ్‌లకు గర్భం వుంటే దాని గురించి చెబుతాము. తరువాత వాళ్ళ నిర్ణయానికే వదిలేస్తాం. వాళ్ళ ఇష్టం వుంటే వుంచుకుంటారు, లేకపోతే తీసేస్తారు.  హెచ్ఐవి వచ్చినంత మాత్రాన ఏమీ జరిగిపోదు. మననుండి ఇతరులకు వ్యాపించకుండా చూసుకోవాలి. లైఫ్ అయిపోయింది అనుకోకుండా మనస్సులో ఎలాంటి ఆలోచనలు లేకుండా మంచి ఆహారం తింటూ, మంచి పనులు చేస్తూ వుంటే మనకి ఏం కాదు. ఇలా వుంటే మన జీవితకాలం ఇంకా 10-20 సంవత్సరాలు పెంచుకోవచ్చు. ఇది వచ్చింది అని తెలిసిన తరువాత అయినా మగవాళ్ళు మారితే బాగుండును. నాకు ఇప్పటివరకు జలుబు, చిన్న చిన్న జబ్బులు వచ్చాయి. ఎప్పుడూ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. హెచ్ఐవి/ ఎయిడ్స్ వచ్చినవాళ్ళకు ప్రివెన్షన్ ఇవ్వాలి. మేం ఎపుడైనా డాక్టర్ దగ్గరికి పోతే వాళ్ళకు చెపితే వాళ్ళు బాధపడి చాలా కేర్‌గా చూస్తారు. ఎక్కువగా హెచ్ఐవి సెక్స్ ట్రాన్స్‌ఫార్మ్ ద్వారా వస్తుంది. సిరంజీ, బ్లడ్‌ల వల్ల తక్కువ. మేం బైట ఎక్కువగా ఈ విషయాలు చెపుతాం. ఒకటికంటే ఎక్కువ సంబంధాలవల్ల, రక్తం కలుషితం కావడం వల్ల, సిరంజీల వల్ల, తల్లినుండి బిడ్డకి వస్తుంది. వాళ్ళకి సేవలు చేయడం ద్వారా రాదు. హాస్పిటల్స్ లో ఎవరైనా వుంటే గ్లౌష్లు వేసుకొని చేయండి. ఫస్ట్ ఎయిడ్ కిట్ గురించి వివరించి చెపుతాం. మా ఆఫీస్ చుట్టుపక్కల వాళ్ళందరికి తెలుసు ఇది పాజిటివ్ వాళ్ళ ఆఫీస్ అని. ఓనర్స్ చాలా మంచివాళ్ళు. ఇక్కడ పనిచేసేవాళ్ళందరం అక్కాచెల్లెళ్ళుగా వుంటాం. అపుడపుడు కోపం వస్తుంది. మేం మా ఇంట్లో కూడా చెపుతాం, ఇలా వున్నవారికి కోపం ఎక్కువ వుంటుంది అని.  నేను చెప్పేదేమంటే పెళ్ళి చేసేముందు పెద్దలు ఆలోచించాలి. అబ్బాయికి ఎలాంటి అలవాట్లు వున్నాయో విచారించి వాళ్ళకు హెచ్ఐవి టెస్ట్ చేసాకే పెళ్ళి చేయాలి అని అనుకుంటున్నాను. లేకుంటే వాళ్ళనుండి చిన్న వయస్సులో వున్నవాళ్ళు, వారి పిల్లలు హెచ్ఐవి / ఎయిడ్స్ బారిన పడతారు.

Read Full Post »

(జి.చంద్రమౌళి, కె.రాధిక)

నేడు భారత సమాజాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్యలలో బాలకార్మిక వ్యవస్థ ప్రధానమైనది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 60 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా మన సమాజంలో నేటికి బాలకార్మిక వ్యవస్థ కొనసాగడం దురదృష్టకరం. తల్లిదండ్రుల పేదరికం, నిరక్షరాస్యత ఒకవైపు, తక్కువ వేతనాలతో ఎక్కువ పని చేయించుకోవచ్చుననీ యాజమాన్య దోపిడి పెరిగిపోవడం బాల కార్మిక వ్యవస్థ పుట్టడానికి దోహదం చేస్తున్నాయి. నేటికి మన దేశ జనాభాలో 30 శాతం మంది దారిద్య్రరేఖకు దిగువన ఉన్నట్లు అనధికారిక అంచనాలు. రెక్కాడితేగాని డొక్కాడని అభాగ్యులు బాలకార్మికులు.  చిట్టిచేతుల చిన్నారులు తల్లిదండ్రుల బీదరికం కారణంగా కుటుంబానికి ఆర్థికంగా మద్దతునివ్వడం కొరకు బాల కార్మికులుగా మారుతున్నారు. మన సమాజ నిర్మాతలైన బాలలు ఆడుతూ పాడుతూ స్వేచ్ఛగా చదువుకునే పరిస్థితులు లేకపోవడం, తల్లిదండ్రుల పెంపకంలో లోపాలు, దోపిడి, వివక్ష, కుల అణచివేత, లింగ అణచివేత, చెడు స్నేహాలు, అశక్తత, ఇలా అనేక కారణాల వలన బాలలు పని మనుషులుగా, బాల నేరస్థులుగా, సెక్స్వర్కర్లుగా మార్చబడి, దోపిడికి గురిఅవుతు బాల కార్మికులుగా రూపుదాల్చుతున్నారు. పేదరికం వలన బాల కార్మిక వ్యవస్థ, బాల కార్మిక వ్యవస్థ వలన నిరక్షరాస్యత, నిరక్షరాస్యత వలన పేదరికం ఇలా ఒకదాని ఆధారంగా మరొకటి చక్రబంధమై పెరుగుతున్నది. 1996 యునిసెఫ్ నివేదిక పేర్కొన్న సంగతిని ప్రభుత్వాలు, ప్రజలు గుర్తించుకోవాలి. ఈ దేశ చిన్నారులు ఎదుర్కొంటున్న సమస్య కేవలం బాలకార్మిక వ్యవస్థ ఒకటి మాత్రమే కాదు. బాలకార్మిక వ్యవస్థలో బాల్యం కుమిలిపోతున్నది. దీనితో పాటుగా వీధి బాలల పేరిట బాట తప్పిన బాల్యం వీధులలో రోదిస్తుంది. దురదృష్టవశాత్తు ‘ఎవరికి పుట్టిన బిడ్డ ఎక్కెక్కి ఏడ్చింది’ అన్నట్లుగా బాలకార్మికుల ఆక్రందనలను పట్టించుకునే మనసు సమాజానికి కరువైంది. ఒక లక్ష్యం, ఒక గమ్యం అన్నింటిని మించి ఒక ఆధారం, ఆలంబన లేక తెగిన గాలిపటాలలా జీవిస్తున్నారు.  పిల్లలు పనిచేయటం అన్నది మనం నైతికంగా సమ్మతించలేని విషయం. వారు విద్య నేర్చుకోవాలి, ఆటలాడుకోవాలి. పిల్లలు సృజనాత్మకమైన మరుపురాని బాల్యాన్ని గడపాలి. మనదేశంలో బాల కార్మికులు అధిక సంఖ్యలో వుండడానికి ప్రధాన కారణం దారిద్య్రం. సమాజంలో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి వున్న వర్గాల పిల్లలు బాల కార్మికులుగా మారుతున్నారు. బాలకార్మికులు ఏ వ్యాపకం లేకుండా, రేపన్న ఆలోచన రానీయకుండా జీవితాన్ని సాగిస్తున్నారంటే వారి శ్రమశక్తి, మేధోసంపద వృధా అవుతుంది. తల్లిదండ్రుల ప్రేమానురాగాలకు దూరమై చదువు సంధ్యలు లేక, అనారోగ్య పరిస్థితులలో దేశ సంపదను వృద్ధి చేస్తూ కుటుంబాలకు అండగా వుండే బాలలు ఏం కోల్పోతున్నారో ఆలోచిస్తే ఈ సామాజిక వ్యవస్థ అసలు స్వరూపం బాధ్యతారాహిత్యం బహిర్గతమవుతుంది. 2003 సంవత్సరానికి మెగసేసే అవార్డు గ్రహీత ఆచార్య “శాంతాసిన్హా” అన్నట్లు బడిలో కాకుండా బాలలు ఎక్కడున్నా కార్మికులే వున్నా విస్తృత నిర్వచనం బాలల పరిస్థితిని స్పష్టం చేస్తుంది.  బాలకార్మిక వ్యవస్థ- స్వరూపం: వ్యవసాయం, పశువులు, మేకలు, గొర్రెలు కాయడం, ఇంటి పనులు చేయడం, హోటళ్ళు, రెస్టారెంట్లు, దాబాలలో కిరాణా హోల్సేల్ వ్యాపారాలు, మోటారు మెకానిజం, పత్తి, పొగాకు, మత్స్య పరిశ్రమ, గనులు, అగ్గిపెట్టెల తయారీ, బాణాసంచా పరిశ్రమ, బీడీ పరిశ్రమ, రత్నాలను పాలిష్ చేసేందుకు, పలకలను తయారు చేయడానికి, రాళ్ళు కొట్టించడం, సిమెంట్ తయారీ, నిర్మాణ పరిశ్రమ, మందుగుండు సామాగ్రి, తాళాలు తయారు చేసే సంస్థలలో, అద్దాల కర్మాగారంలోను, రైల్వే శాఖలోను, ఓడ రేవులలోను, తివాచీల, నేత పరిశ్రమలోను, సబ్బుల తయారీ పరిశ్రమ ఇలా అనేక రూపాల్లో చాలా రంగాలకు బాలకార్మిక వ్యవస్థ విస్తరించింది. వారి శారీరక, మానసిక ఆరోగ్యాలకు హానికరమైన పరిస్థితుల్లో బాలకార్మికులు పని చేస్తున్నారు. బాల బాలికలు నిర్భందంగా వివిధ శాఖల పనులలోకి నెట్టబడుతున్నారు.  14 సంవత్సరాలలోపు వయస్సు కలిగి వుండి పనిచేసే వారిని బాల కార్మికులుగా గుర్తించడం జరిగింది. అంతర్జాతీయ శ్రామిక కార్యాలయం పనిలో చేరేవారి వయస్సు విషయంలో ఆమోదించిన తీర్మానం ప్రకారం 15 సంవత్సరాల వయస్సు నిండిన వారు మాత్రమే శ్రామికులుగా పనిచేయడానికి అర్హులు. ఐక్యరాజ్యసమితి 1989వ సంవత్సరంలో బాలల హక్కుల కన్వెన్షన్ను గుర్తించి 18 సంవత్సరాలలోపు వ్యక్తులందరిని బాలలుగా పరిగణించడం జరుగుతుంది. కాని నేడు బాలలు వారి ఆనందమైన, తీపి జ్ఞాపకాల బాల్యాన్ని అనుభవించకముందే బాల కార్మిక వ్యవస్థ వారి సంపూర్ణమైన బాల్యాన్ని వివిధ రంగాలలో మింగివేయడం జరుగుతుంది.  బాల కార్మికులు – గణాంకాలు: ప్రపంచంలోని పది దేశాలలో ఎక్కువగా బాలకార్మికులు పడరాని కష్టాలు ఎదుర్కొంటున్నారు. పది దేశాల జాబితాలో సూడాన్, ఉగాండా, కాంగో దేశాలు మొదటి స్థానాలను ఆక్రమించినాయి. అలాగే భారతదేశంలో బాల కార్మికుల సంఖ్య ఎక్కువగానే వుంది. బాల కార్మిక వ్యవస్థలో భారతదేశం 6 వ స్థానంలో వుంది. మన దేశంలో 2001 వ సంవత్సరంలో నిర్వహించిన జనాభా లెక్కల ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల వయస్సు కలిగి వుండి బాల కార్మికులుగా పనిచేస్తున్న వీరి సంఖ్య 12.6 మిలియన్లు. బెల్జియం దేశంలోని దేశ జనాభా కంటే మన దేశంలోని బాల కార్మికుల సంఖ్య అధికం. మన దేశంలోని బాల కార్మికులలో సగం కంటే ఎక్కువ మంది అనగా దాదాపు 6.7 మిలియన్ల బాలకార్మికులు ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4.23 లక్షల మంది బాల కార్మికులు ఉన్నట్లు ప్రభుత్వం జూన్, 2005 లో ప్రకటించింది. అయితే ఈ సంఖ్యకు రెట్టింపు బాల కార్మికులు మన రాష్ట్రంలో ఉన్నట్లు అనధికారిక గణాంకాలు సూచిస్తున్నాయి.  ఐక్యరాజ్య బాలల నిధి (యునిసెఫ్) ప్రకారం ప్రపంచంలో 24.60 కోట్లు మంది బాలకార్మికులున్నారు. 1999 సంవత్సరంలో యునిసెఫ్ లెక్కల ప్రకారం మన దేశంలో 4.40 కోట్ల మంది బాలకార్మికులున్నారు. బాల కార్మికులు లేని దేశమంటూ లేదు! ప్రపంచంలో ప్రతి సంవత్సరం పని సంబంధమైన ప్రమాదాల్లో 22 వేల మంది బాల కార్మికులు దుర్మరణం చెందుతున్నారు. బాల కార్మికులు అసంఘటిత రంగంలో అత్యధిక సంఖ్యలో ఉన్నారు. బాల కార్మికుల్లో ఎక్కువ మంది నిరక్షరాస్యులే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాల కార్మికుల సంఖ్యకు సంబంధించి నేటి వరకు సమగ్ర సర్వే నిర్వహించిన దాఖలాలు లేవు. మనదేశంలో ఇళ్ళలో పనిచేసే బాలకార్మికుల సంఖ్య 14 లక్షలకు పైగా వుంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాద్లోనే ఇళ్ళలో పనిచేసే బాలకార్మికుల సంఖ్య దాదాపు 1.50 లక్షల వరకు వుండవచ్చునని అంచనా. ఈ గణాంక వివరాలన్నీ పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి.  బాలల హక్కులపై ఐక్యరాజ్యసమితి విధానం: ఐక్యరాజ్య సమితి రూపొందించిన బాలల హక్కుల ఒడంబడికలో ప్రకరణ (1) ప్రకారం 18 సంవత్సరాలలోపు ఉన్న ప్రతి ఒక్కరు బాలలే. 1959 నవంబరు 29 న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ బాలల హక్కులపై ప్రకటన చేస్తూ అంతర్జాతీయ మానవహక్కులను అంతర్భాగంగా గుర్తించింది. 1979 సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి “అంతర్జాతీయ బాలల సంవత్సరం” గా ప్రకటించింది. ప్రతి పిల్లవాడికి జీవించి, అభివృద్ధి చెందే హక్కును సహజ హక్కుగా ఒప్పందం ప్రకటించింది. అలాగే బాలల ఆరోగ్య, విద్య హక్కులను అతి ముఖ్యమైన హక్కులుగా గుర్తించింది. 1989 లో ఐక్యరాజ్యసమితి బాలల హక్కులపై ఒక అంతర్జాతీయ ఒడంబడికను రూపొందించింది. 1992 డిసెంబరు 11 న ఈ ఒప్పందాన్ని భారత ప్రభుత్వం ఆమోదించింది. బాలల రక్షణ ప్రకటన (1979) బాల నేరస్తుల పట్ల పాటించవలసిన ఐక్యరాజ్యసమితి ప్రమాణాలు, నిబంధనలు ప్రపంచంలోని అన్ని మూలల్లోను నివసిస్తున్న పిల్లలకు జాతి, మత, వర్గ,లింగ భేదం లేకుండా సమానమైన రక్షణ, సంక్షేమం కావాలనే మానవాళి ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నాయి. వాటన్నింటికి కొనసాగింపుగానే 1989 ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ బాలల హక్కుల ఒడంబడిక ముందుకు వచ్చింది.  1992 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి ఆమోదించిన బాలల హక్కుల ఒప్పందం “విద్యను పొందటం బాలల హక్కు”, విద్యను అందించడం ప్రభుత్వాల బాధ్యత అని 28 ప్రకరణలో స్పష్టంగాను పేర్కొంది. విశ్వజనీన మానవ హక్కుల ప్రకటన(1948) లో మానవులందరికి సంబంధించిన హక్కులను పరిరక్షించడం జరిగింది. దీనిలో కొన్ని నిబంధనలు ప్రత్యేకంగా పిల్లలు, వారి విద్యకు సంబంధించినవి. నిబంధన 26లో ప్రతి ఒక్కరికి విద్య హక్కు వుందని పేర్కొనడం జరిగింది. బాలల హక్కుల 6 వ నిబంధనలో బాలల సమగ్ర మూర్తిమత్వ అభివృద్ధికి వారికి ప్రేమ, అనురాగం, సదవగాహన అందించడం అవసరమని పేర్కొనడమైంది.  బాలల హక్కులు- భారత రాజ్యాంగ రక్షణలుః చిన్నారుల పట్ల సమాజానికి బృహత్తర బాధ్యత ఉన్నదన్న విషయాన్ని భారత రాజ్యాంగం నొక్కి చెప్పింది. రాజ్యాంగంలోని 24 వ ఆర్టికల్ ప్రకారం 14 సంవత్సరాల లోపు బాల బాలికలను కర్మాగారాలు, గనులు లాంటి ప్రమాదకర ప్రదేశాలలో కార్మికులుగా నియమించరాదు. రాజ్యాంగంలోని 45 అధికరణం 14 సంవత్సరాలలోపు బాల బాలికలకు సార్వత్రిక నిర్భంద ఉచిత విద్యావకాశాలు కల్పించింది. ప్రభుత్వం ఈ అధినియమును మార్పుచేసి 86 వ రాజ్యాంగ సవరణ ప్రకారం 6-14 సంవత్సరాలలోపు బాలల నిర్భంధ ప్రాథమిక విద్యను 21 (ఎ) ఆర్టికల్ ప్రకారం “ప్రాథమిక హక్కు”గా మార్చడం జరిగింది. ఆర్టికల్ 23 ప్రకారం వెట్టి చాకిరి, స్త్రీ, శిశువులను నిర్భందంగా అవమానకర పనులకు ప్రోత్సహించడం నిషేధించడం జరిగింది. 1975 సంవత్సరంలో వెట్టి చాకిరి నిరోధక చట్టాన్ని పార్లమెంటు చేసింది.  మన దేశంలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం పరిశ్రమల చట్టం 1881 , బాలల చట్టం 1933, బాలల ఉద్యోగ కల్పన చట్టం 1938, కర్మాగారాల చట్టం 1948, ప్లాంటేషన్ కార్మిక చట్టం 1951, గనుల చట్టం 1952, మోటారు రవాణా కార్మిక చట్టం 1961, ఫ్యాక్టరీ చట్టం 1982 భారత రాజ్యాంగంపై చట్టాలను రూపొందించడం జరిగింది. 1901 లో గనుల చట్టం, 1990 సంవత్సరం తరువాత ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కొరకు వివిధ చట్టాలు రావడం జరిగినాయి. మన రాష్ట్రం మరో అడుగు ముందుకేసి బడికి వెళ్ళని బడి ఈడు (6-14) వయస్సున్న పిల్లలంతా బాల కార్మికులేనని ప్రకటించడం మంచి పరిణామం. కేంద్ర ప్రభుత్వం విధానాలను, చట్టాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తూ విజన్ 2020 డాక్యుమెంట్లో బాలల విద్యా హక్కు మనందరి బాధ్యతగా డిసెంబర్ 1999 లో ప్రకటించింది.  ఆర్టికల్ 15: మహిళలు, బాలల సంక్షేమానికి ప్రత్యేక చట్టాలు చేయవచ్చు. ఆర్టికల్ 23(1): బాలలను అమ్మడం, కొనడం, భిక్షాటన చేయించడం, నిర్భంధ చాకిరీలు నిషేదితం. ప్రకరణం 30 (సి): లేత వయస్సు పిల్లలను అపహస్యం కాకుండా చూడాలని, ఆర్థిక అవసరంతో తమ వయస్సుకి, శక్తికి మించిన పనుల్లో నిమగ్నం కాకుండా చూసే బాధ్యత ప్రభుత్వంపై వుంది. ప్రకరణం 39 (ఎఫ్): బాలలు స్వేచ్ఛాయుత, గౌరవప్రద పరిస్థితుల్లో ఆరోగ్యవంతంగా పెరగడానికి తగినన్ని అవకాశాలు, సౌకర్యాలు కల్పించి, బాల్యాన్ని కామపీడన నుంచి, నైతిక, భౌతిక నిర్లక్ష్యాల నుంచి ప్రభుత్వం బాలలను రక్షించాలి. ప్రకరణం 47: బాలలకు పౌష్టికాహారం, మెరుగైన జీవనాన్ని, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాలి.  బాలలకు రక్షణ కల్పిస్తూ భారతీయ శిక్షాస్మృతిలో ఐ.పి.సి. 361, ఐ.పి.సి 363-ఎ, ఐ.పి.సి 366, బాలలకు రక్షణ కల్పించింది. భారత ప్రభుత్వం బాలల కోసం కొన్ని చెప్పుకోదగిన చట్టాలు చేసింది. వానిలో బాలల ఆరోగ్యం, విద్య విషయాలలో వివిధ రాష్ట్రాలలో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలు ఒక నిర్దిష్ట వయోపరిమితి వరకు ప్రాథమిక ఉచిత విద్యను కల్పిస్తున్నాయి. భారత రాజ్యాంగం ఆదేశిక సూత్రాలలో ప్రసాదించిన నిర్భంద ఉచిత ప్రాథమిక విద్య విధానం నేటికి అమలు కాలేదు. మాతా, శిశు సంక్షేమం పేరిట ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖ ఉన్నప్పటికి పెద్దగా సాధించింది ఏమి లేదు. ప్రస్తుతం అమలులో ఉన్న బాలకార్మిక చట్టం 1986 ను అనుసరించి మనదేశంలో బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా నిషేధించడం జరగలేదు. ఈ సంవత్సరం (2006) ఆగస్టు 1 వ తేది నుండి పనులను బాలకార్మికుల చేత చేయించరాదని భారత ప్రభుత్వ కార్మిక మంత్రిత్వశాఖ ఆదేశాలను జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం బాలకార్మికులను ఇళ్ళల్లో పని చేయడానికి నియమించుకోరాదు. ఈ నిషేధపు ఉత్తర్వులు 2006 అక్టోబర్ 10 వ తేది నుండి అమలులోకి వచ్చాయి.  బాలకార్మిక వ్యవస్థ – అమలు తీరు: – బాలకార్మికుల చట్టాలను ఉల్లంఘిస్తున్న యాజమానులను శిక్షించే యంత్రాంగం పటిష్టంగా లేదు. – ప్రభుత్వం చట్టాలను రూపొందించడం వరకే తమ బాధ్యత తీరిపోయిందని వ్యవహరిస్తుంది. – రాజకీయ పక్షాలు బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనను శక్తిమేరకు కృషి చేయడం లేదు. – యాజమానులు బాలకార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్నారు. – సమాజం బాలల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. – ప్రసార సాధనాలు ప్రజలలో సరియైన అవగాహన కల్పించలేక పోతున్నాయి. – అధికారులు బాలకార్మిక చట్టాలను అమలుపర్చడంలో సరియైన శ్రద్ధ కనపర్చడం లేదు. – బాల కార్మికులు చట్టాన్ని ఎన్నో సంస్థలు, ఫ్యాక్టరీలు ఉల్లంఘిస్తున్నా పట్టించుకునే యంత్రాంగం సక్రమంగా లేదు. కార్మిక సంఘాలు సహితం ఈ అంశాన్ని పట్టించుకోకపోవడం అన్యాయం.  “పనిచేయడానికి రెండు చేతులున్నాయి, తినడానికి ఒక నోరుంది” అని బాలలు తమ పొట్ట తామే నింపుకుంటూ కుటుంబానికి అదనపు ఆదాయాన్ని సమకూర్చిపెట్టే ఆదాయవనరులు అవుతున్నారు. అందమైన బాల్యాన్ని కోల్పోయి, విద్య గ్రంథాలకు దూరమై, పలక బలపం పట్టవలసిన చేతులు పార పలుగు పట్టుకుంటూ బరువైన పనులు చేస్తూ అనారోగ్యం, ఆకలిమంటలతో అసహాయ స్థితిలో పనిచేస్తున్న బాలలను ఏ చట్టాలు పరిరక్షించలేకపోతున్నాయి. అమ్మ ఒడిలో, బడిలో చేర్చలేకపోతున్నాయి. ప్రభుత్వాలు బాలకార్మిక చట్టాలను కఠినంగా అమలుచేసి బాలకార్మికుల సౌకర్యార్థం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి, బాల కార్మికుల పునరావాసానికి ప్రత్యేక పథకాలను రూపొందించి, వారి విద్య, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అన్ని రాజకీయ పక్షాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు బాల కార్మిక చట్టాలను ఆచరణలో పెడితే బాలల స్థితిగతులు మెరుగుపడే అవకాశం వుంది. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం సాధ్యమవుతుంది.  బాలకార్మికుల నిర్మూలనకు సూచనలు: బాల కార్మిక వ్యవస్థని నిషేధించినంత మాత్రాన, దానంతటదే రద్దు కాదు. ఇది బాలల సమస్య, ఒక సామాజిక రుగ్మత. ఈ చిన్నారులు సంఘ వ్యతిరేక శక్తులుగా మారి మొత్తం సమాజానికే సమస్యగా మారుతున్నారు. బాల కార్మికులను సమాజం ఉపేక్షిస్తున్న మాట యదార్థమే అయినా చిన్నారుల చీకటి బతుకులలో వెలుగు రేఖలు నింపే ప్రయత్నాలు మరిన్ని సమాజం, ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు బాధ్యత వహించాలి. బాలల హక్కుల పరిరక్షణ ఏ ఒక్కరితోనూ సాధించబడదు. ఇది అందరి బాధ్యతగా గుర్తించినప్పుడే సాధ్యమవుతుంది. – సామాజిక పరంగా, హక్కుల పరంగా బాలల అభివృద్ధి సంరక్షణ కోసం ఉన్న శాసనాలను సమీక్షించి మార్పులు చేయడం. – బాలల హక్కుల పరిరక్షణ కోసం కావల్సిన వనరులు బడ్జెట్లో ప్రతిపాదించి అమలు చేయడం. – ప్రజలను చైతన్యపరిచే కృత్యాలను, కార్యక్రమాలను ప్రోత్సహించడం – పిల్లలకు మంచి పరికరాలు, వసతులు ఉన్న పాఠశాలలను అందుబాటులోకి తేవటం. – బాలల హక్కుల పరిరక్షణకు పర్యవేక్షకులను నియమించి, ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం. – ప్రభుత్వేతర సంస్థల సేవలను ప్రోత్సహించడం – ప్రసార మాధ్యమాల ద్వారా పిల్లలను చాకిరికి గురి చేయటంలోని నిర్దయతను, కౄరత్వాన్ని తెలియజేయాలి. – ప్రభుత్వేతర సంస్థలకు ప్రోత్సాహం ఇవ్వాలి.వృత్తి నైపుణ్యతలో, ఆర్థిక విషయాల్లో, సంస్థాపరమైన, సిబ్బంది వస్తు పరికరాల విషయంలో ప్రభుత్వేతర సంస్థలకు చేదోడు వాదోడుగా ప్రభుత్వం ప్రోత్సాహం కల్పించాలి. – బాల శ్రామికులకు మరిన్ని పునరావాస పథకాలు కల్పించాలి. వారికి విద్యను, వృత్తి నైపుణ్యంలో శిక్షణను అందుబాటు లోకి తీసుకురావాలి. – పిల్లల శారీరక, మానసిక, ఆరోగ్యాలను కాపాడటం తల్లిదండ్రులు తన కనీస బాధ్యతగా గుర్తించడం. – తల్లిదండ్రులు తమ జీవనం కోసం పిల్లల జీవితాన్ని పణంగా పెట్టకపోవడం, – తల్లిదండ్రులు పిల్లల ద్వారా పొందే స్వల్ప ఆదాయాన్ని ఆశించకుండా వుండడం. – సమాజం ప్రభుత్వంలో నిర్వహించే చైతన్య కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేయడం. – ప్రజలు ప్రభుత్వం రూపొందించే చట్టాలను, విధానాలను, గౌరవించి, ప్రోత్సహించడం. – ప్రజలు కూడా భాగస్వాములు కావటం అత్యావశ్యకం. పిల్లల చాకిరి నిర్మూలనకు ప్రధానంగా ప్రేరణ సమాజం నుంచే రావాలి. – ఉపాధ్యాయులు పాఠశాల వాతావరణాన్ని ఆకర్షణీయంగా చేసి, బడి నమోదుకు ప్రోత్సహించడం. – ఉపాధ్యాయులు ఔత్సాహికముగా, నిబద్ధతతో బాలల సమస్యల పట్ల సమాజంలో స్పందన స్ఫురింపచేయాలి.  చిన్నారులకు బంగారు బాటలను నిర్మించుదాం: ఆట పాటలతో చదువుతో హాయిగా గడిచిపోయే అవకాశాలను, సౌకర్యాలను బాలబాలికలకు కల్పించాలి. అప్పుడే బాలకార్మిక వ్యవస్థ బలహీనపడుతుంది. బాల కార్మిక వ్యవస్థను విముక్తి చేయడానికి ప్రభుత్వం, పౌర సమాజం బాధ్యత వహించాలి. శ్రమలో మసిమాడిన పసి మొగ్గలకు రక్షక కవచాన్నివ్వాలి. ఆరోగ్యం, వినోదం, విజ్ఞానం కలిగిన బాలల సమాజాన్ని మనం నిర్మిస్తే, రేపది గొప్ప సమాజంగా రూపాంతరం చెందుతుంది. బాలల స్వేచ్ఛను బాలలకిద్దాం. బాలల సౌకర్యాలను బాలలకిద్దాం. బాలల హక్కులకు రక్షణ కల్పిద్దాం. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం. పశువుల మందలను కాపాడిన చిట్టి చేతులే మానవ సమాజాన్ని కాపాడగలరని నిరూపిద్దాం. పునాదులు లేని సౌధాలు కుప్పకూలిపోతాయి. పునాదులను విస్మరించి గాలిలో నిర్మించుకున్న అందమైన భవనాలు శిథిలమైపోతాయి. సమాజ నిర్మాణానికి ఈ సత్యం వర్తిస్తుంది. సమాజ నిర్మాణానికి పునాది బాలలు. బాలలు బంగారు కాంతులతో విలసిల్లినపుడే సమాజం వెలుగు పూలు పూయిస్తుంది.  “పిల్లల పట్ల ప్రపంచం చూపించే ప్రేమానురాగాలు, విశ్వాసాలకు మించిన పవిత్ర అంశం మరొకటి లేదు. పిల్లల హక్కులను పరిరక్షిస్తూ, ఆ హక్కులను గౌరవిస్తూ, వారి సంక్షేమాన్ని రక్షిస్తూ పిల్లల జీవితాలు భయమన్నది ఎరుగక, కొరతన్నది తెలియక శాంతియుతంగా ఎదిగేందుకు నిర్వర్తించే కర్తవ్యాన్ని మించిన కర్తవ్యం మరొకటి లేదు” – కోఫి అన్నన్ (ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్)  కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో అభివృద్ధి ఫలితాలు అందరికి అందాలన్న సంకల్పంతో అడుగులు వేస్తోంది. బాలకార్మిక వ్యవస్థ చట్ట పరిధిని మరింత విస్తృత పరుస్తూ, బాల కార్మిక చట్టాలు బలంగా అమలయ్యేందుకు ప్రభుత్వం కృషి చేయాలి. మానవ విలువలతో ముడిపడిన చట్టాల విషయంలో సమాజం సహకారం అందించనిదే లక్ష్యాలను సాధించడం సాధ్యమయ్యే విషయం కాదు. సమాజం, ప్రభుత్వ సహకారాలతో బాలల భావి జీవితాలలో వెలుగు కాంతులను విస్తరింప చేయడానికి నడుం బిగించి బాలకార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం. చిన్నారి భవితకు బంగారు బాటలు వేద్దాం.  పిల్లల సంక్షేమ బాధ్యత సమాజానిది, ప్రభుత్వానిది. వనరుల కేటాయింపులో పిల్లల అవసరాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. భారతదేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చి 56 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా బాలల సమస్యలపై ఒక జాతీయ విధానాన్ని మన ప్రభుత్వాలు రూపొందించలేకపోయాయి. బాలల సమస్య దేశ భవిష్యత్తు సమస్య. కొత్త చట్టాలు రూపొందించటంతో బాటు ఉన్న చట్టాలను పటిష్టంగా అమలు పరచాలి. బాలల ఆరోగ్యం, విద్య దేశాభివృద్ధికి అత్యంత కీలకమైనవి.  బాలల బాల్యం బడిలోనే, బాలల భవిష్యత్తు బడితోనే!  ఈ సమాజ కళ్యాణ కార్యక్రమంలో సమాజంలోనే అందరూ భాగస్వాములు కావాలి! చేదోడు, వాదోడు అందించాలి.

Read Full Post »

సెకండ్ సెక్స్

(పి. సత్యవతి)

“పురుషుడెపుడూ తన ఆధిక్యతను నిలబెట్టుకోడానికే ప్రయత్నిస్తాడు. తన ప్రాముఖ్యతను నమ్మి కాపాడుకోడానికే యత్నిస్తాడు. తన సహచరితో సమానత్వాన్ని అంగీకరించలేడు. ఆమె శక్తియుక్తులపై నమ్మకం లేనట్లు తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తాడు. ఇదెట్లా వుంటుందంటే, చిరకాలంగా అణచివుంచబడిన వర్గం, తమను అణచివేతకు గురిచేసిన వర్గంతో ఘర్షించినట్లు వుంటుంది. అణచబడ్డ వర్గం తన సహజ హక్కుల్ని అడుగుతున్నపుడు, సహజంగా అణచివేతదారులు తమ ఆధిక్యతను కాపాడుకోడానికి వీలైనంతగా ప్రయత్నిస్తారు. స్త్రీత్వం అంటూ తనకి ఆపాదింపబడ్డ గుణాలను ఆమె నిలిపి వుంచుకోవాలనుకున్నంత కాలం పురుషుడామెను అలా వుంచడానికే కృషి చేస్తాడు. ఈ విషవలయాన్ని ఛేదించడం చాలా కష్టం. ఎందుకంటే వీరిద్దరు కూడా ఏక కాలంలో రెండు పాత్రల్ని పోషిస్తున్నారు కనుక. ఆమెను అదుపులో వుంచే నిరంతర ప్రయత్నంలో అతను కూడా ఒక రకంగా పీడితుడే అవుతున్నాడు. స్వతంత్రంలేనివాడు. హాయిగా వుండలేనివాడు. ఇందులో ఎవరూ స్వతంత్ర జీవులు కారు. స్వతంత్రం కల ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక అంగీకారం కుదరడం సులువు… ఘర్షణ వల్ల వొరిగేదేమీలేదని వాళ్ళకి తెలుసు. అసలు ఈ మొత్తం వ్యవహారం సంక్లిష్టం కావడానికి కారణం ప్రత్యర్ధులిద్దరూ ఒకరికొకరు సహకరించటమే… అంటే స్త్రీలింకా ఆధీనులుగా వుండడానికీ పురుషులింకా తమ ఆధిక్యతని కాపాడుకోటానికి ప్రయత్నించడం. అయినా మళ్ళీ ఇద్దరూ తమ తమ అసౌకర్యాలకి రెండోవారిని నిందిస్తూ వుంటారు. స్త్రీ పురుషులు ఒకరినొకరు ఈ విధంగా నిందించుకుంటూ వుండడానికి కారణం వారిలోని అల్ప స్వభావమే. పురుషుడెప్పుడూ తన స్త్రీలో తన నీడని చూసుకోవాలనుకుంటాడు. ఆమెలో తన ఆధిపత్యాన్ని, పురుషత్వాన్ని చూసుకుంటాడు. అయితే ఇంకొక విధంగా అతనూ ఒక బానిసే. ఇందులో అతను సాధించే విజయం స్త్రీల చపలచిత్తం మీద ఆధారపడి వుంటుంది. తనెప్పుడూ ముఖ్యమైన వ్యక్తిగా, ఆమెకన్నా అధికుడిగా వున్నట్లు భావిస్తాడు. అలా నటిస్తాడు. ఆమెకూడా అతని ఆధిక్యాన్ని అంగీకరిస్తున్నట్లు నటిస్తూ వుంటుంది. స్త్రీలంటే వుండే భయమే వారిపట్ల ప్రతికూలతకి కారణం. స్త్రీలగురించి మాట్లాడడానికీ, వారిని తప్పుద్రోవ పట్టించడానికి చాలా సమయాన్ని వెచ్చిస్తాడు. కానీ స్త్రీలను విముక్తం చెయ్యడం ద్వారానే తను విముక్తి పొందుతానని తెలుసుకోడు. అతను భయపడే విషయం అదే. అందుకే స్త్రీలను గురించిన భ్రాంతి భావనలను కాపాడుతూ వుంటాడు. ఇది ఆమెను మభ్య పెట్టడమేనని చాలా మంది పురుషులకు తెలుసు.  “ స్త్రీగా వుండడం ఎంత దురదృష్టం. ఆ విషయం తెలుసుకోకుండా వుండడమే ఆ దురదృష్టం” అంటాడు కీర్క్ గార్డ్.  చాలాకాలం ఈ “తెలుసుకోకుండా వుండడమనే దురదృష్టాన్ని దాచిపెట్ట”టం జరిగింది. ఉదాహరణకి, స్త్రీలకి అదివరకుండే గార్డియన్లను తీసివేశారు. కానీ వారి బదులు ‘రక్షకుల’ను నియమించారు. ఈ రక్షకులకి గార్డియన్స్కుండే అధికారాలన్నీ ఇచ్చారు. ఇదికూడా” స్త్రీల భద్రత” కోసమే!  ఉద్యోగం చెయ్యకుండా ఇంట్లో వుంచటం కూడా ఆమె సుఖసంతోషాల కోసమేనట! ఇక గృహిణీత్వం మీదా, మాతృత్వం మీద ఎంత భావుకతని కవితావేశాన్ని వెదజల్లారో తెలీనిది కాదు. ఈవిధంగా ఆమె స్వేచ్ఛా స్వతంత్రాలను కోల్పోయి, “ స్త్రీత్వం” అనే తప్పుడు సంపద సాధించింది. ఈ పన్నాగం ఒక ప్రసిద్ధ కవి పురుషులకిచ్చిన సలహాలో స్పష్టమౌతుంది. చూడండి ఆయనిలా అంటాడు- “ ఆమెకి మహారాణివి నువ్వు అని చెబుతూ బానిసలా చూడు” చాలామంది పురుషులలాగే ‘స్త్రీలు చాలా అదృష్టవంతులు’ అని నమ్మింపజూస్తారు. ఇదెలా వుంటుందంటే, అమెరికన్ సాంఘిక శాస్త్రవేత్తలు కొందరు ‘నిమ్నవర్గ లాభాల’ గురించి మాట్లాడినట్లు, నిమ్న వర్గాలు అనుభవించే సుఖాలగురించన్నమాట. ఫ్రాన్స్లో కూడా ఇలాంటి వాదనే ఒకటుంది. కార్మికులకి నిత్య జీవితంలో నటించే అవసరం లేదట!… ప్రతి దేశంలోనూ కూడా మొదటినుంచీ తక్కువ అదృష్టవంతుల్ని చూసి మెరుగైన జీవితం గడిపేవారు ఈర్ష్యపడటం (ఆశ్చర్యకరమైన విషయమైనా) వుంది, పెట్టుబడిదార్లు, వలసపాలకులు, పురుషాధికులు ఎప్పుడూ అందరికన్నా ఒక మెట్టుపైన వుండడానికే చూస్తారు. పీడితులలో పీడకులు చూసే ‘కాంప్లిసిటి’ కన్న స్త్రీలలో పురుషులకు దొరికేది ఎక్కువ. అందుకే వాళ్ళు “స్త్రీలు స్వచ్ఛందంగానే ఆధీన స్థితిని కోరుకుంటున్నార”ని సిగ్గులేకుండా చెబుతారు. అసలు మొదటినించీ స్త్రీలు నడచివచ్చిన దారి, ఎటువంటి సాహస చర్యలకూ తిరుగుబాట్లకూ ఆస్కారం లేనిది. ఆమె శిక్షణ అటువంటిది. ఆమె తల్లితండ్రులతో సహ యావత్ సమాజమూ ఆమెకు ప్రేమా ఆరాధనా, త్యాగమూ వంటి గుణాలను వైభవీకరించి చెబుతుంది. కానీ ఆమె భర్త గానీ సంతానంగానీ వీటినంతగా పాటించరు. అధీనతలోనే ఆమె ఆనందం వున్నదని నమ్మిస్తారు. మొదటినుంచీ తన బాధ్యత తనను తీసుకోనీకుండా పెంచి, ఇతరులనించీ రక్షణ, శ్రద్ధ ఆశించేలా చేసింది ఎవరు? అందుకు ప్రోత్సహించింది ఎవరు? అందుకే పరస్పర నిందారోపణలు. “ నువ్వు అసమర్దురాలివి, నీకేం తెలీదు” అని అతను “ అలా చేసింది నువ్వే” అని ఆమె. ఎవరూ తమ బాధ్యతని అంగీకరించరు. తన పెత్తనాన్ని కొనసాగించుకోడానికి పురుషుడు వేసుకునే ముసుగూ, తన పిరికితనాన్ని కప్పిపుచ్చు కోటానికి ఆమె వేసుకునే ముసుగూ! అట్లా నిరంతర సంఘర్షణ! తనకు సిద్ధాంతపరంగా లభించిన సమానత్వాన్ని గురించి ఆమె మాట్లాడితే, ప్రస్తుతం సమాజంలో నెలకొన్న అసమానత గురించి అతను మాట్లాడతాడు. ఇచ్చిపుచ్చుకోడం అనే విషయానికి అర్థం లేకుండా పోతుంది. తన సర్వస్వాన్నీ అతనికే ధారపోశానని ఆమె, తన సర్వస్వం ఆమెకే అర్పించానని అతడూ! రాజకీయ ఆర్ధిక శాస్త్రంలోని ఒక ముఖ్య సూత్రాన్ని స్త్రీలు గుర్తుపెట్టుకోవాలి. సరుకుల విలువ కొనేవారిని బట్టి నిర్ణయింపబడుతుంది గానీ అమ్మేవారిని బట్టికాదు. ఆమె విలువ వెలకట్టలేనిదని చెప్పి ఆమెను మోసం చెయ్యడం జరిగింది. నిజానికి పురుషునికి ఆమె ఒక వినోదం, ఒక విలాసం, ఒక తోడు, ఒక అవసరంలేని వరం. కానీ ఆమె ఉనికికే అతను సార్ధకత, ఆమె జీవన సారం. ఈ అసమానత వారి జీవన విధానంలోనే అర్ధమౌతుంది. తను ఏమాత్రం ప్రేమించని స్త్రీని జీవితాంతం భరించి పోషించాల్సిన పురుషుడు తను బలైపోయినట్లు భావిస్తాడు. అయితే తన జీవితాన్నే పణంగా పెట్టి అతన్ని పెళ్ళాడిన ఆమెను వదిలేస్తే ఆమె బలైపోతుంది. ఈ దుస్థితి వ్యక్తుల వలన సంభవించింది కాదు, ఇద్దరూ కూడా తలపడలేని మరొక శక్తి వలన ఏర్పడినది. స్త్రీలు పరాన్న జీవుల వలె మరొకరికి అతుక్కుని బ్రతికినంతవరకు వారు మరొకరికి భారమే. వారు తమ జీవశక్తిని స్వయంగా సంపాదించు కోగలగాలి. స్వంతంగా ప్రపంచాన్ని ఎదుర్కుని తమని తాము నిలబెట్టుకోగలగాలి. అప్పుడే ఆమె అధీనత మాయమౌతుంది. దానితో పాటే పురుషుని అధీనత కూడా… ఈ కొత్త పరిస్థితి ఇద్దర్నీ విముక్తుల్ని చేస్తుంది.  ఇటువంటి ఒక కొత్త లోకాన్ని సోవియట్ యూనియన్ వాగ్దానం చేసింది, మొగపిల్లలతో సమానంగా అదే వాతావరణంలో పెరిగి, వారితో సమానంగా అదే వాతావరణంలో, అదే వేతనంతో స్త్రీలు పనిచేస్తారు. స్త్రీలకి లైంగిక స్వేచ్ఛ, ఉద్యోగం చేసుకునే స్వేచ్ఛ వుంటాయి. వివాహం ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక స్నేహ ఒడంబడికలా వుంటుంది. ఏ ఒకరికి రెండోవారితో కలిసి జీవించడం కష్టమనిపించినప్పుడు వారికి విడిపోయే హక్కు వుంటుంది. మాతృత్వం స్త్రీల ఇష్టంపై ఆధారపడి వుంటుంది. కుటుంబ నియంత్రణ, గర్భస్రావం చట్టబద్దమౌతాయి. వివాహబంధంలోని సంతానంతో సమానమైన హక్కులు వివాహేతర సంతానానికి కూడా వుంటాయి. రాజ్యం స్త్రీలకు ప్రసవానంతర సెలవు ఇవ్వడమే కాక పిల్లల బాధ్యత కూడా వహిస్తుంది.  అయితే చట్టాలు మార్చినంత మాత్రాన స్త్రీ పురుష సమానత్వం సిద్ధించినట్లేనా? కొంతమంది నిరాశావాదులు ‘స్త్రీలెప్పుడూ స్త్రీలే’ అంటారు. స్త్రీలు తమ ‘స్త్రీత్వా’న్ని కోల్పోతే, పురుషుల వలె కాక రాక్షసుల వలె తయారవుతారని మరికొందరు వాదిస్తారు. స్త్రీలు తమ సహజ గుణాలను కోల్పోతారట! మానవ సమాజంలో ఏదీ సహజసిద్ధం కాదు. స్త్రీలు కూడా నాగరికతాభివృద్ధి క్రమంలో తయారుకాబడినవారే! ఆమెను మలచడంలో ఇతరుల ప్రమేయమే మూలకారణం. స్త్రీలు తమ హార్మోన్ల వల్ల కానీ సహజాతాల వల్ల కానీ “స్త్రీత్వా”న్ని పొందలేదు. స్త్రీ విముక్తి సాధించాలంటే ఆమె ఉనికిని ఆమె స్థిర పరచుకోవాలి. స్త్రీ పురుషులిద్దరూ ఒకరినొకరు స్వతంత్ర వ్యక్తులుగా గుర్తించాలి. ఇందువలన పరస్పర సహకారం, స్నేహం పెరుగుతుంది. అలాగే కాంక్ష, ప్రేమ, కలలు, సాహసాలు, వాటి వాటి అర్ధాలను కోల్పోవు. అంతేకాక, మానవజాతిలోని ఒక సగానికున్న బానిసత్వాన్ని, తద్వారా సమాజంలో నెలకొని వున్న ద్వంద్వ నీతినీ, నిర్మూలించినప్పుడు, మానవ దంపతుల నిజమైన రూపాన్ని మనం దర్శించగలం. సూటి అయిన, సహజమైన, అవసరమైన మానవసంబంధాన్ని మనం స్త్రీ పురుష సంబంధంలో చూడవచ్చు.  మార్క్స్ చెప్పినట్లు, స్త్రీ పురుష సంబంధం అనేది మనిషికీ మనిషికీ వుండే సహజ సంబంధం కావాలి. స్త్రీ పురుషుల మధ్య సౌభ్రాతృత్వాన్ని (సిమోన్ brotherhood అనే మాట వాడుతుంది) సాధించాలి.  “అరవై సంవత్సరాల క్రింద వ్రాసిన ఈ పుస్తకం ఇప్పుడు ఎందుకు చదవాలని” అడిగేవారిని సిమోన్ అడిగే ప్రశ్న ఈ సౌభ్రాతృత్వంను సాధించటానికి ఇప్పటి స్త్రీ పురుషులు చేస్తున్న కృషి ఏమిటి? ఎంతవరకు సాధించారు? నేటి సమాజంలో స్త్రీ పురుష సంబంధాలెలా వున్నాయి?

Read Full Post »

(కె.వి.ఎన్.ఎల్. ప్రసన్న కుమారి)

సకల ‘లోకాల’ను ఒక్క ఇల్లుగా చేసి వసుదైక కుటుంబంగా (లా); గ్లోబల్ విలేజి ఏర్పాటు గ్లోబలీకరణ పేరిట ఓ విశ్వ కుటీరాన్ని నిర్మించడం లక్ష్యంగా, అట్టహాసంగా బయలుదేరిన గ్లోబలైజేషన్ ఆ లక్ష్యాన్ని సాధించలేకపోగా దేశాలను, కుటుంబాల్ని చిన్నాభిన్నం చేస్తోంది. సమాజాలను, జాతులను, మతాన్ని, ప్రాంతాల్ని, ఆఖరకు ఒక ఇంట్లో కలిసి జీవించే రక్త సంబంధీకులకు, భార్యా భర్తలమధ్య, స్నేహితుల మధ్య కూడా గ్లోబల్ గారడీ చిచ్చు పెడుతోంది – ఈ స్థితిని స్త్రీలే తిప్పి కొట్టాలి బలంగా.  ఉదాహరణకు: పాతికేళ్ళుగా ప్రభుత్వ సర్వీసులో పనిచేసే అన్నకు పదివేలు కూడా నెలజీతంరాని నేటి (దు)స్థితిలో – ఎం.సి.ఎ, ఐ.టి. టెక్నాలజీ చేసిన చిన్న తమ్ముడు నెలకు 40 వేలు సంపాదిస్తున్నాడు – ఇంట్లో ప్రత్యక్షంగా – పరోక్షంగా ఆధిపత్య పోరు-ఆర్థిక పోరు, ఇదే రీతిలో భార్యాభర్తల మధ్య… నేడు నెలకొంది. లక్షల్లో జీతాలు జీవితాల్నే దెబ్బతీస్తున్నాయి. మరోవైపు మెర్జర్స్ అండ్ ఎక్విజిషన్స్ పేరుతో (విలీనాలు – స్వాధీనాల) పేరిట కార్పోరేట్ సంస్థల కౌగిళ్ళలోకి కొన్ని సంస్థలు మార్పిళ్ళు- వేల, లక్షల సంఖ్యలో ఉద్యోగాల కోత, కార్మికులు వీధి పాలు… మన హైదరాబాద్లో ఐడిపిఎల్, హెచ్ఎంటి, ఆల్విన్, ఇలా లిస్ట్ రాస్తే 80 కి పైగా పెద్ద కంపెనీల లిస్ట్ తయారు అవుతుంది. హైటెక్ పాలకుల పాలనాఫలాలే పై సంస్థల మూతకు కారణం… అభివృద్ధి రేటును పెంచడం కోసం ఉత్పత్తి రంగాన్ని శాసిస్తున్న గ్లోబల్ మార్కెట్, మహిళలపై క్రమంగా మోయరాని భారాన్ని మోపుతోంది. ఉదాః- వస్త్ర పరిశ్రమలో వేతనంపై పనిచేసే మహిళలు వారానికి 56 గంటలు పనిచేయగా, వేతనాలు (ఒ.టి లేకుండా) వారానికి మరో 31 గంటలు పనిచేయాల్సిన స్థితి. మొత్తం పనిగంటలు 87 గంటలు. ఇక కాల్ సెంటర్స్, ప్రైవేట్ సంస్థల్లో, కార్పోరేట్ సంస్థల్లో పనిచేసే వారి గురించి చెప్పనక్కర్లేదు. ఆరోగ్యం, అందం, ఆలోచన ఆవిరి చేసే కాల్సెంటర్ ఉద్యోగాలొక మాయాజాలం.  గ్లోబలైజేషన్ అనర్థాలు… దేశదేశాన్ని చిన్నాభిన్నం చేస్తోంది అనడానికి థాయ్లాండ్, ఉత్తరకొరియా, ఫిలిప్ఫైన్స్, ఇండోనేషియా, అర్జంటైనా లాంటి దేశాల స్థితి చాలు ఉదహరించడానికి.  త్రాగటానికి మంచినీళ్ళులేని గ్రామాల్లో సైతం పెప్సి, కోకాకోలాలు దొరుకుతున్నాయి ఈరోజు… దేశంలో ఆరు కోట్ల టన్నుల ఆహారధాన్యం గోదాముల్లో మగ్గుతోంది… మరో పక్క ఆకలిచావులు సంభవిస్తున్నాయి. ప్రపంచబ్యాంక్ ప్రయోగశాలలో రైతుల ఆత్మహత్యలు జరగని రోజు ‘ దేశం’ పాలనలో ఉందా? సిగ్గుచేటు. మీటింగుల్లో మేధాపాట్కర్ అన్నట్లు “దేశాన్ని రక్షిద్దాం, దేశాన్ని నిర్మిద్దాం” మాటలు బాగానే వున్నాయి. కాని… మనల్ని మనం రక్షించుకునే స్థితే లేదుకదా!! వేధింపులు- లైంగిక దాడులు సెల్ఫోను పుణ్యమా అని, ఎస్ఎంఎస్, ప్రేమసందేశాల మాటున వేధింపులు- వెకిలిచేష్టలు… ముఖ్యంగా మహిళలపై – విద్యార్థులపై జరిగే సైబర్దాడిని ఏ ఐ.టి. సంస్థ నిరోధిస్తుంది? ఏ చట్టం కాపాడాలి? వ్యవసాయక పనులు లేక… రోజు కూలీలుగా, అడ్డాలపై నిలబడిన మహిళలకు… ఏ ఇందిరమ్మ పథకం ఉద్దరిస్తుందో రాజశేఖరులకే తెలియాలి… గ్రామీణ భారతం ముఖ్యంగా కుటీర పరిశ్రమలు, చేతివృత్తులు బాగా దెబ్బతిన్నాయి ఈ 16 సంవత్సరాల్లో.  చేనేత పరిశ్రమ పురాతన వేదాల కంటే ప్రాచీనమైనది – క్రీ.పూ 4000 సంవత్సరాల క్రితమే “చేమగ్గం” పై వస్త్రాలు తయారు చేయుపద్దతి వున్నది – హరప్పా, మొహంజదారో, ఈజిప్టులోని పిరమిడ్లను త్రవ్వకాలు జరిపినపుడు ‘చే’ మగ్గంపై వస్త్రాలు తయారు చేయు పద్ధతికి సంబంధించిన ఆధారాలు వెల్లడైనాయి. వ్యవసాయ రంగం తరువాత చేనేత రంగం 2వ స్థానంలో వుంది – దేశంలో 38, 90,576, మగ్గాలు వుండగా, గ్రామీణ ప్రాంతంలో 32,80,087 మగ్గాలు… పని చేసి ఎందరికో ఉపాధి కల్పిస్తున్నాయి. దాదాపు 124 లక్షల మందికి జీవనోపాధి కల్గిస్తున్నాయి. కాని గ్లోబల్ దెబ్బకు బాగా నష్టపోయింది- వ్యవసాయరంగం- చేనేతరంగం- ఈ రంగాల ద్వారా పురుషునితో బాటు స్త్రీలూ ఇబ్బందులు పడుతున్నారు కదా!! ఆర్ధాకళ్ళలో అలమటిస్తున్నారు కదా! తల్లిదండ్రి ఎంతో కష్టపడి కాలేజ్కి పంపే ఆధునిక బాలికలు (గాళ్స్) ఈ ప్రపంచీకరణ మార్కెట్ మాయాజాలంలో… మీడియా మాయాజాలంలో వాస్తవాల్ని విస్మరిస్తున్నారు… పబ్లు, పిజ్జాలు… బార్లు, నైట్ పార్టీలు… లిప్స్టిక్లు… నెయిల్పాలిష్లు… పెర్ఫ్యూమ్లు, పార్టీవేర్లకై, వెడ్డింగ్ వేర్లకై పరుగులెత్తే పడతులంతా, ప్రాజెక్టులకు వ్యతిరేకంగా పోరాటం చేసే ఆదివాసి మహిళల చైతన్యం ముందు తమ స్థితి, తమ భవిష్యత్ గురించి ఆలోచించాల్సిన తరుణంలో వున్నాం. గిరిజన హక్కుల కోసం పోరాడిన ఓ అల్లూరి, ఓ బిర్సాముండా, ఓ… కొమరంభీం, ఓ సిద్దు, ఓ కాను, తమ్మన్నదొరల జీవితాన్ని అధ్యయనం చేయాలి… మేథాపాట్కర్, ఆరుంధతీరాయ్, వందనాశివ, లాంటి వారి చైతన్యాన్ని మహిళలంతా అందుకోవాలి… స్ఫూర్తినొంది పోరాటం చేయాలి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటే ఒక్క రైతాంగం మాత్రమే దెబ్బతినదు… వ్యవసాయంతో పాటు యితర వృత్తులు చేసుకుంటూ జీవనాధారం పొందే వారుకూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారిలో సగం మంది స్త్రీలూ వుంటారు కదా!! మిడిల్ క్లాస్, సెమీ మిడిల్ క్లాస్ అదృశ్యమైనాయి. ఈ ప్రపంచీకరణవల్ల కవి గోరేటి వెంకన్న రాసిన “పల్లె కన్నీరు పెడుతోంది” అన్న పాట మొత్తం గ్రామీణ వ్యవసాయక దేశం, (భారతం) ఎలా ఛిద్రమైపోయిందో!! గ్లోబలైజేషన్ రక్కసి దారుణాల్ని చక్కగా పాటలో రాసారు. ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ, విధానాలతో చేతివృత్తులన్నీ సర్వనాశనం అవుతున్నాయి. ప్రత్యేకించి మహిళల భాగస్వామ్యంతో నడిచే చేతివృత్తులు, మన రాష్ట్రంలో రెండుకోట్ల మంది చేతివృత్త్తిదారులు ఉన్నారు. నేత, గీత, గొర్రెలు, మేకలు పెంపకందార్లు, మత్స్యకారులు, రజకులు, క్షౌరకులు, వాయిద్యకారులు (మేళం), కుమ్మరి, కమ్మరి, కంచారి, కంసాలి, వడ్రంగి, శిల్పి, ఆరెకటిక, వడ్డెర, రాయి, మట్టిపని (ఉప్పరిపని), దర్జీ, గాండ్ల, వెదురు, మేదర, తట్టల వృత్తులు, బుట్టల అల్లకం, అద్దకం లేసులు, పూసలు, నులక, కాటికాపరి, వీరుగాక, బుడిగ జంగాలు, చిందుభాగోతులు, దాసర్లు, జంగాలు, యక్షులు, ఇతర సాంస్కృతిక సంచార వృత్తులవారు వున్నారు. బహుళజాతి సంస్థలకు మోకరిల్లే ప్రభుత్వాలు పేదల్ని, కాల్చుకుతింటున్నాయి. అధిక ధరల జీవన విధానానికి తొట్టి తొలుత బలికాబడేది స్త్రీలేకదా!! ఇంటిపని, వంటపని, పిల్లల పెంపకం, భర్తను, ఇంట్లో పెద్దల్ని ఉదయం నుండి రాత్రిదాకా సంరక్షణ చేసే స్త్రీ ఆధునిక పద్మవ్యూహాన్ని చేధించే అభినవ అభిమన్యురాలు… ఇది అతిశయోక్తి కాదు – వాస్తవం.  1991 – భారతదేశంలో నూతన ఆర్థిక విధానాలను అమలు పరచడం ద్వారా చేతి వృత్తులలో సైతం పెట్టుబడిదారులు… ప్రవేశించి వృత్తిదారులకు పనిలేకుండా చేస్తున్నారు. 2010 నాటికే నేడు మనం నిత్యం చూస్తున్నట్లుగా అడ్డామీద కూలీలు మాదిరిగా డాక్టర్లు, ఇంజనీర్లు, ఎం.సి.ఏ లు చేసిన కంప్యూటర్ ఘనాపాటీలు, లాయర్లు, సైంటిస్ట్లు నిలబడి పనికోసం ఎదురుచూచే స్థితి రానున్నది- ఓ హెచ్చరికగా మేధావులు ఈ అంశాన్ని గమనంలో తీసుకోవాలి. 1936లో ఒకసారి, 1995లో మరోసారి మధ్యనిషేధం అమలు – దాన్ని విఫలం చేసిన పాలకుల పన్నాగాలు, స్త్రీల జీవనస్థితిపై ప్రభావం అందరికి తెలిసిందే కదా!! మంచినీళ్ళకు కొదవ కాని, మగువల కన్నీటికి కొదువలేదు ఈ మద్యపానం వల్ల. ఆంధ్రరాష్ట్రం గర్వించదగ్గ మహిళా చైతన్య పోరాటం ‘సారా’ వ్యతిరేకోద్యమం పురిటి గడ్డ నెల్లూరులోని దూబగుంట గ్రామంలో రోశమ్మ ఇంటి ముందే రెండు బెల్టుషాపులు ఏర్పడినాయి… ఇది మహిళా చైతన్యాన్ని వెక్కిరించినట్లుగా వుందికదా. అలాగే బాక్సైట్ త్రవ్వకాలు జరుపుతోంది రాష్ట్ర ప్రభుత్వం. దీనివల్ల అడవులు, అడవీ సంపద నాశనం అవుతాయి. కాఫీ తోటలు, పంటపొలాలు, దెబ్బతింటాయి. ఆదివాసీ గిరిజనుల జీవనం దుర్భరం అవుతుంది. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ పేరు ఏదైతేనేమి దాని దుష్ఫ్రభావాలకు నిత్యం గురి కాబడేది మహిళలే కదా!! ఏంగిల్స్ చెప్పినట్లు స్త్రీలే అత్యధికంగా దోపిడీకి గురి అయ్యేది అన్నది అక్షరసత్యం.  1. నిత్యావసర వస్తువులు అధిక ధరలకు విక్రయం వల్ల కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. దానివల్ల స్త్రీలకు సరైన పోషణ, ఆహార పదార్థాలు లభించవు. ప్రభుత్వాల నియంత్రణ లేని మార్కెట్ వ్యవస్థలో ప్రతి సరుకూ అధిక ధరలకే విక్రయాలు.  2. స్త్రీని భోగ వస్తువుగా, మార్కెట్ ఎకానమీ పెంచే వాణిజ్యంలో వ్యాపార వస్తువుగా చిత్రణ. దీన్ని వ్యతిరేకించాలి. ఫలితంగా వరకట్న చావులకు పోటీగా, మహిళలపై అత్యాచారాలు, హత్యలు పెరిగాయి.  3. ఉచిత విద్యుత్, ఉచిత బియ్యం ఇచ్చే పాలకులు… ఉచితంగా నీళ్ళు ఎందు కివ్వరు!! నీటిపై వ్యాపారం చేయుట, 60 ఏళ్ళ స్వరాజ్యానికి సిగ్గుచేటు. పుట్టేబిడ్డపై ఈరోజు12 వేలు అప్పు వుండబోతోందని ఆర్థికవేత్తలంటున్నారు.  ఎడిబి బ్యాంక్ ఆధ్వర్యంలో ఇటీవల మాదాపూర్లో జరిగిన సదస్సులో రెండున్నర వేల మంది ప్రతినిధులు, 70 మందిదాకా ఆసియా అభివృద్ధి బ్యాంక్ డైరెక్టర్లు, 62 దేశాలనుండి అట్టహాసంగా వచ్చి సభలు పెట్టారు- పేదల్ని, పీడితుల్ని ఎలా దోచుకోవాలో మల్లగుల్లాలు పడ్డారు కాని.. సంక్షేమం గురించి ఒక్క ప్రకటనైనా బైటకొచ్చిందా? యీ స్థితినే స్త్రీలు అర్థం చేసుకొని తిరగబడాలి. నూతన ఆర్థిక సంస్కరణలపై లాంగ్ మార్చ్ చేయాలి…  4. హైటెక్ ఇంటర్నెట్ సంస్కృతిలో ముక్కుపచ్చలారని బాలురు, జీవితం అంటే తెలియని టీనేజర్స్ బాలికలు… ప్రేమ, కామం, ముసుగులో విచ్చలవిడితనానికి, వికృత చర్యలకు సిద్ధపడి వావి వరసలు వయస్సును విస్మరించి, అనేక అనర్థాలకు పాల్పడుతున్నారు. ఈ లైంగిక హింసపై స్త్రీలు తిరగబడాలి…  5. మహిళల్ని ఏమాత్రం ఆలోచించనీయని వ్యాపార, వాణిజ్య, మీడియా వర్గాలు.. మధ్యతరగతి వార్ని భ్రమల్లోకి తీసుకెళ్ళి విలాసవంతమైన జీవనం కోసం అడ్డ దారులు తొక్కిస్తోంది యీ ప్రపంచీకరణ.  6. ఫ్యాషన్ ప్రపంచం, అందాల పోటీలు, పాశ్చాత్య నాగరికతపై మధ్యతరగతి మగువల మోజుపెరిగి అనేక అనర్థాలకు గురి అవుతున్నారు. ఈ కుటుంబ వ్యవస్థ, మధ్యతరగతి వ్యవస్థ, చిన్నాభిన్నానికి ప్రపంచీకరణే కారణం.  అరవై ఏళ్ళ భారత స్వాతంత్య్ర ప్రజాస్వామ్య పాలనలో 17 సంవత్సరాలు ప్రధానిగా ఓ మహిళ రాజ్యపాలన చేసింది. (ఇందిరా గాంధీ). ఒక డజను మంది మహిళలు ముఖ్యమంత్రులుగా పనిచేసి రాష్ట్రాల్ని ఏలినారు… ఏలుతున్నారు. మహిళా సాధికారత, స్వేచ్ఛ, సమాన వేతనాలు, సమన్యాయాలు… స్త్రీలపై జరిగే హింసను అరికట్టడంలో ఘోరంగా విఫలమైనాము. 1963లోనే యు.పి. గద్దెనెక్కిన నాటి సుచేతా కృపలానీ, ఒరిస్సాను పాలించిన నందినీ శతపధి, గోవాను పాలించిన శశికళ కాకోద్కర్, ‘అస్సాం’ను పాలించిన ఎస్.ఎ. తైమూర్, తమిళనాడునేలిన నాటి జానకీ రామచంద్రన్, నిన్నటి జయలలితలు, పంజాబ్ నేలిన రాజీందర్ కౌర్ భట్టాల్, యు.పి. నేలిన కుమారి మాయావతి, రబ్రీదేవి (బీహార్), సుష్మాస్వరాజ్, షీలా దీక్షిత్లు (ఢిల్లీ), ఉమాభారతి (ఎమ్.పి), వసుంధరా రాజే (రాజస్థాన్), ఇలా చెప్పుకొంటే గొప్పే కానీ స్త్రీలకు ఒరిగిందేమిటి??  సంపూర్ణ మధ్యనిషేధం, సమాన వేతనం, (పురుషునితో) అందరికీ విద్య, ఉపాధి, వరకట్న నిషేధం, (ఖచ్చితంగా అమలు చేయాలి), లైంగిక హింసకు పాల్పడిన వారిపై శిక్ష, భూపంపిణి, అందరికీ ఇల్లు, చౌకదుకాణాల్లో నిత్యావసర వస్తువులపై ధరల కంట్రోల్, స్త్రీని విలాస వస్తువుగా, చూపే సకల మీడియాపై నిత్యపోరాటం, కాలేజీల్లో రాగింగ్కు వ్యతిరేకంగా ఉద్యమించడం, ఈవ్ టీజింగ్కు వ్యతిరేకంగా సంఘటిత మహిళా పోరాట ఉద్యమం – గ్రామీణ మహిళల ఉపాధి, విద్య, వైద్య, సదుపాయాలు, సంవత్సరకాలమంతా పని కల్పించే ఉపాధి కార్యక్రమాలకై అన్ని వర్గాల స్త్రీలు.. ఏకమై ముఖ్యంగా ప్రపంచీకరణ పద్ధతులపై , పీడనపై పెద్ద ఎత్తున ద్వితీయ స్వాతంత్య్ర సంగ్రామం లాంటి మహోద్యమం నిర్మించాలి. అప్పుడే స్త్రీ జాతికి విముక్తి, సౌఖ్యం లభిస్తాయి. విశ్వసుందరులు, అందాలపోటీల కిరీట ధారుణులు, కార్పోరేట్ సంస్థల్లో పనిచేసే హైటెక్ సొసైటీ స్త్రీలు, బహుళ జాతి సంస్థలకు వాణిజ్య మార్కెట్కు అంగాంగ ప్రదర్శనలిచ్చే అతివలు కారాదు మనకు ఆదర్శం.  ఓ విమలారణదివే, ఓ సుశీలా గోపాలన్, ఓ… సంధ్య, ఓ.. నిర్మలక్క, ఓ స్నేహలతారెడ్డి, ఓ మల్లు స్వరాజ్యం… లాంటి మహిళామణులు కావాలి మనకు ఆదర్శం. నిరంతర చైతన్యపూరితంగా మన సమస్యలపై మనమే పోరాడాలి. ప్రపంచీకరణ విధానాల్ని తిప్పి కొట్టాలి.

Read Full Post »

(లక్కిరెడ్డి సత్తయ్య, గోడిశాల చంద్రమౌళి, గుగులోతు జాంబు)

కొన్ని శతాబ్దాలుగా భారత సమాజంలో స్త్రీలకు, పురుషులకు సమానమైన అంతస్థు, హక్కులు లభించడం లేదు. పురుషులకు ఉన్న స్వేచ్ఛ స్వాతంత్య్రాలు స్త్రీలకు లోపించడమే కాకుండా, స్త్రీలు వారి జీవితంలో గృహ కృత్యాలకు మాత్రమే అంకితమైనది. అంతేకాక భారత స్త్రీలు అనేక అన్యాయాలకు, అరాచకాలకు గురి అయ్యారు. శాస్త్రీయ సాంకేతిక విజ్ఞానం అభివృద్ధి చెందడం వల్లే పారిశ్రామికాభివృద్ధి జరిగి స్త్రీలు, పురుషులతో పాటు సమానంగా ప్రబలడం కొరకు, స్త్రీలకూ సామాజిక న్యాయాన్ని చేకూర్చడం కోసం సరియైన అంతస్థు ప్రసాదించడం కోసం గత 150 సంవత్సరాల నుండి కృషి జరుగుతూనే వుంది. అనాది కాలంనుండి నేటి ఆధునిక కాలం వరకూ అన్యాయాలను, అక్రమాలను అరికట్టి స్త్రీలకు న్యాయం చేకూరేటట్టు శాసనాలను కూడా రూపొందించి, అవి అమలు జరిగేటట్లు కృషి చేస్తూనే ఉన్నారు. సాంఘిక నిర్మితిలో మార్పు తీసుకొని రావాలంటే శాసనాల ద్వారానే సాధ్యమవుతుందని ‘రేనడే’ అభిప్రాయపడ్డారు.  భారతీయ మహిళకు పురుషుడితో సమానమైన అంతస్థు, హోదా కలగజేయడానికి వివాహ వ్యవస్థలో వంశపారంపర్యంగా హక్కులలో, ఆస్థి సంక్రమణలోను స్త్రీల స్థితిగతులను పటిష్టం చేయడానికి సమాజంలో ఆమెపట్ల జరిగే హింస నుండి రక్షణ ఏర్పరచడానికి ప్రభుత్వం ఎన్నో శాసనాలను చేసింది. వాటిలో ముఖ్యమైనవి.  మహిళా ఆర్థిక చట్టాలుః 1.కర్మాగారాల చట్టం-1948 2.కనీస వేతనాల చట్టం 1948 3.సమాన పారితోషిక చట్టం-1976 4.వ్యవసాయ కార్మిక చట్టం -1951 5.వెట్టిచాకిరి నిర్మూలన చట్టం-1976  రక్షణ చట్టాలుః 1. నేర శిక్షాస్మృతి చట్టం -1973 2. భారతీయ శిక్షాస్మృతి క్రింది న్యాయవాది వృత్తి హక్కు -1923 3.గర్భస్థ శిశు నిర్ధారణ నిరోధక చట్టం -1994  సామాజిక చట్టాలుః 1. కుటుంబ న్యాయస్థానాల చట్టం – 1984 2. భారత వారసత్వ చట్టం – 1925, 3. వైద్యంతో గర్భం తొలగింపు చట్టం – 1971 4. అక్రమ తొలగింపు నిరోధక చట్టం -1956 5. ప్రసూతి ప్రయోజన చట్టం -1961 6. వరకట్న నిషేధ చట్టం – 1961 7. మహిళలను అగౌరవ పరచడాన్ని నిరోధించే చట్టం – 1987 8. సతీ సహగమన నిషేద చట్టం -1987 పై చట్టాలన్నింటితో పాటు ఇటీవల కాలంలో కుటుంబ హింస నుండి రక్షణ కల్పించే చట్టం 2005 అమలుకై ఒక పరిశీలన.  గృహహింస చట్టం 2005 – ఆవిర్భావముః గృహ హింస నుండి మహిళలకు రక్షణ కల్పించే ప్రత్యేక చట్టం అవసరం వుందని మహిళా సంస్థలు ఎప్పటినుంచో పోరాటం కొనసాగిస్తున్నాయి. 1994 లో మహిళా కమీషన్, 1999లో లాయర్సు కలెక్టివ్ ఉమెన్స్‌ రైట్స్ ఇవిషియటివ్ సంస్థలు గృహ హింస నిరోధక చట్టం 2001 ని ప్రతిపాదించాయి. ఆ ప్రతిపాదనకు కొన్ని మార్పులు చేసి ప్రభుత్వము 2002 లో గృహ హింస నుండి మహిళల రక్షణ చట్టం – 2001 తయారు చేసింది. కాని ఈ చట్టం ఎవరికి సంతృప్తి కలిగించలేదు. ఎందుకంటే సెక్షన్ -4 ప్రకారం ఆత్మరక్షణ కోసం పురుషుడు హింసకు దిగితే ఆ చట్టం అతడిని శిక్షించడం జరగదు అంటే మహిళలను ఇష్టం వచ్చినట్లు హింసించి ఆత్మరక్షణ కోసమై హింసించానని తప్పించుకొనే అవకాశం పురుషుడికి వుంటుందన్న మాట. ఎవరిని సంతృప్తి పరచలేని ఈ బిల్లును మొక్కుబడిగా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి మహిళలకు రక్షణ నిచ్చేశామని ప్రభుత్వం చేతులు దుల్పుకుంది. గృహ హింస చట్టం – 2001 కి వ్యతిరేకంగా మహిళా సంఘాలు కొత్త బిల్లు కోసం పోరాటం ఆరంభించాయి. యుపిఏ ప్రభుత్వం ఏజెండాలో ఈ బిల్లు కూడా వుండటంతో 2006 ఆగస్టున పార్లమెంట్ ఆమోదంతో సెప్టెంబరు 13 న రాష్ట్రపతి రాజముద్ర ఆమోదం పొందిన గృహ హింస చట్టం – 2005 భారతీయ మహిళా ఉద్యమ చరిత్రలో మైలురాయి. స్వేచ్ఛ కోసం గౌరవ ప్రదమైన మనుగడ కోసం, పీడనం నుండి విముక్తి కోసం, దీర్ఘకాలంగా తపిస్తున్న భారతీయ స్త్రీకి ఎంతో కొంత ఊరట, ఉపశమనం లభిస్తున్న గృహ హింస చట్టం – 2005 దేశ వ్యాప్తంగా అమలులోకి వచ్చింది. కుటుంబ విలువల మాటున తిరుగులేని పెత్తనం చెలాయించడానికి పురుష అహంకారులకు ఇకపై కుదరదు. గృహ హింస బాధితులు ఫిర్యాదు చేయడానికి, కోర్టులను ఆశ్రయించడానికి, రక్షణను పొందడానికి అమలైన కొన్ని వ్యవస్థలు నేటినుంచి అందుబాటులో వుంటాయి. ఫిర్యాదు చేసిన తరువాత కూడా రక్షణలను అతిక్రమించిన సందర్భాలలో నిందితులకు ఏడాది జైలు శిక్ష, రూ|| 20,000/- జరిమానా విధిస్తారు. చట్టబద్దముగా హక్కుదారులైనా కాకపోయినా నివసిస్తున్న ఇంటినుండి బాధిత స్త్రీలను వెళ్ళగొట్టడం కుదరదు. ఈ చట్టం అందించే రక్షణ కేవలం భార్యలకు మాత్రమే కాదు. వివాహ బంధం లేకుండా కలిసి జీవిస్తున్న మహిళ, తల్లి, సోదరి వితంతువుగా కుటుంబంతో వుంటున్న మహిళ, కూతురు, దత్తత సంతానం, ఉమ్మడి కుటుంబంలో ఏదో ఒక వరస బంధువులందరు గృహ హింస చట్టం -2005 నుండి రక్షణ పొందుతారు. కొత్త చట్టం ప్రకారం గృహ హింస అంటే కేవలం భౌతికంగా హింసించడం మాత్రమే కాదు. మహిళలపై మాటల ద్వారా కాని, భౌతికంగా గాని, లైంగికంగా గాని, మౌఖికంగా గాని, మానసికంగా గాని, ఆర్థిక పరంగా గాని, మహిళలు వేధించిన, అలా బెదిరించినా గృహ హింసలో భాగమే అవుతుంది. ఈ రకంగా ఈ చట్టం మహిళలపై జరిగే వేధింపులు, హింసలకు సంబంధించిన పరిధిని, నిర్వచనాలను ఘననీయంగా విస్తృత పరిచింది. దీని వెనుక జాతీయ మహిళా సంఘాలు, ప్రజాస్వామిక వాదులు నిర్వహించిన కృషి ఎంతో గొప్పది. భారతదేశంలో వివాహిత స్త్రీలలో మూడింట రెండువంతుల మంది కుటుంబ హింస బాధితులేనని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక తెలియజేస్తుంది.  గృహ హింస నిరోధం – బాధ్యతః గృహ హింస నిరోధ చట్టం అమలు బాధ్యతను ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమ శాఖకు బాధ్యతలు అప్పగిస్తూ తాజాగా జి.ఓ.నెం.22 ను విడుదల చేసింది. ప్రాజెక్టు డైరెక్టర్లను రక్షణ అధికారులుగా నియమించింది. రక్షణ అధికారులతో పాటు తను సర్వీసు అందించేందుకు జిల్లాల వారిగా పలు స్వచ్ఛంద సంస్థలను గుర్తిస్తారు. మహిళలు గృహ హింసకు గురైనట్లయితే పోలీసులను సంప్రదించవల్సిన అవసరం లేదు. గృహ హింసకు గురైన మహిళలు తమకు దగ్గరలో ఉన్న స్వచ్ఛంద సంస్థలకు వెళ్ళి ఫిర్యాదు చేయాలి. స్వచ్ఛంద సంస్థలు ఆయా మహిళ ఫిర్యాదులను రక్షణ అధికారులకు (ప్రాజెక్టు డైరెక్టర్లు) సమర్పిస్తారు.మహిళలు ఫిర్యాదు చేసిన అంశాలపై రక్షణ అధికారులు విచారణ చేసి తుది నివేదికను జిల్లా మేజిస్ట్రేట్‌కు సమర్పిస్తారు. మేజిస్ట్రేట్ ఆ నివేదికలను పరిశీలించి, ఇచ్చిన తీర్పు ప్రకారం పోలీసులు గృహ హింసకు పాల్పడిన సంబంధితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.  యునిసెఫ్ 199 రిపోర్టు ప్రకారం వివిధ దేశాలలో గృహ హింసకు లోనవుతున్న వివరాలుః 15 నుండి 49 సంవత్సరాల మధ్య వయస్సున్న వివాహిత మహిళలలో నూటికి 70 మంది భౌతిక హింసతో లైంగిక దౌర్జన్యాలకు గురవుతున్నారని ఐక్యరాజ్య సమితి జనాభా నిధి సంస్థ చేసిన అధ్యయనంలో తేలింది. ప్రతి ఐదుగురు మహిళలలో ఒకరు తమ జీవిత కాలంలో కనీసం ఒక్కసారి అత్యాచారానికో, బలాత్కారానికో గురవుతున్నారని ప్రతి ముగ్గురిలో ఒక్కరు, భౌతిక హింసకు లోనవుతున్నారని అన్ని సందర్భాలలో కుటుంబ సభ్యులలో, దగ్గరి బంధువులలో నేరస్తులుగా ఉన్నారని ఆ నివేదిక చెబుతున్నది. నాలుగు గోడల మధ్య స్త్రీని హింసపెట్టడం కేవలం మన దేశానికి మాత్రమే పరిమితం కాదు.  కెనడాః 16 ఏళ్ళ వయస్సు నుండి 23 శాతం మహిళలు హింసకు గురవుతున్నారు.  జపాన్: 59 శాతం మంది భర్త అత్యాచారాలను అనుభవిస్తున్నారు.  న్యూజిలాండ్: 20 శాతం మంది ఏదో సమయంలో గృహ హింస అనుభవించినవారే.  ఇంగ్లాండ్: ఏదో సమయంలో భర్త భౌతిక హింసకు 25 శాతం గురి అవుతున్నారు.  అమెరికాః 28 శాతం భౌతిక హింసకు గురి అవుతున్నారు.  భారతదేశం: ఏదో ఒక సమయంలో భార్యను భౌతికంగా హింసించినట్లు 45 శాతం పైగా భర్తలు ఒప్పుకున్నారు.  ఈస్టోనియాః పెరిగే వయస్సుతో పాటు తమపై హింస పెరుగుతుందని మహిళల అభిప్రాయం. 65 ఏళ్ళ పైనున్న వారిలో 52 శాతం మంది ఇంకా హింసను అనుభవిస్తు న్నారు.  ఈ గృహ హింసల కారణంగా ఆమెరికాలో ఏటా 1230 కోట్ల డాలర్ల ఉత్పాదకత దెబ్బతింటున్నది. ఆస్ట్రేలియాలో ఆ నష్టం 630 కోట్ల డాలర్లదాకా ఉన్నది. భారతదేశం లాంటి మూడవ ప్రపంచ దేశాలలో ఈ అణచివేత పీడన మరింత హెచ్చుస్థాయిలో, తీవ్ర రూపాలలో వుంటున్నాయి. ఆర్థికంగా స్వావలంబకులైన స్త్రీలకు కూడా వేరే స్థాయిలో ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్న స్వీయ ఆర్జన, ఆస్తి లేని స్త్రీల విషయంలో వివిధ రూపాలలో హింస అధికంగా కనిపిస్తున్నది. కేరళలో ఆస్థిపరులైన స్త్రీలలో కేవలం 7 శాతం, ఆస్తులు లేని వారిలో 49 శాతం కుటుంబ హింస కనిపిస్తుంది. పిల్లలను నిర్లక్ష్యం చెయ్యడం, చెప్పకుండా బయటకు పోవడం, భర్త లేదా జీవిత భాగస్వామితో వాదనకు దిగడం, సెక్స్‌లో పాల్గొనడానికి నిరాకరించడం, వంట సరిగా లేదా సకాలంలో వండకపోవడం, వేరే మగవాళ్ళతో మాట్లాడడం ఈ కారణంతోనే తాము ఆడవాళ్ళను కొడతామని భారతదేశంతో సహ పది దేశాలలోని పురుషులు చెప్పిన అభిప్రాయాలను ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రస్తావించింది. ఇలాంటి బాధలను అనుభవిస్తున్న స్త్రీలకోసం మరియు జనాభాలో సగం స్త్రీలే కాబట్టి దేశంలో ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడుతారో అక్కడ సుఖ సంతోషాలు వుంటాయనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం గృహ హింస చట్టం -2005 అమలులోకి తీసుకు వచ్చింది. ఈ చట్టం వలన కుటుంబంలో అణగారిపోయే మహిళల వేదన అరణ్య రోదన కాకుండా కొంత చట్టం కొన్ని కిటికీలు తెరిచింది తప్ప అది మొత్తంగా గృహాలలో పరిస్థితి మారలేదు. సమాజంలో మహిళల కున్న సమస్యలన్ని ఒక చట్టంతోనే పరిష్కరించడం సాధ్యం కానిపని అని భారత ప్రథమ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఏనాడో స్పష్టీకరించినా పట్టించుకున్న నాథుడే లేడు. సమస్య మూలాలలోకి వెళ్ళని అసంబద్ధమైన వైఖరి వల్లనే వెట్టిచాకిరి రద్దు, బాలకార్మికుల నిషేదం, బాల్య వివాహాల నిరోధకచట్టం లాంటి ఎన్నో అక్కరకు రానివిగా భ్రష్టుపడు తున్నాయి. స్త్రీ శిశు సంక్షేమం కోసం తెచ్చిన ప్రత్యేక శాసనాలది అవే వ్యథ. వరకట్నాన్ని నిషేధిస్తూ 1961 లోని కేంద్రం చట్టం చేసినా నేటికి వరకట్న పిశాచం అవిచ్ఛిన్నంగానే కొనసాగుతున్నది. దశాబ్దం క్రితం లింగనిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం తెచ్చాక తగ్గుముఖం పట్టాల్సిన భ్రూణ హత్యలు ఇంతలంతలయ్యాయి. గృహ హింసను నిరోధించేందుకు మరొకటి చట్టాలు చేయడమే స్త్రీ జనోద్ధరణగా నేతలు, భుజకీర్తులు తరుముకుంటున్నారు.  శాసనాలు తీర్మాణాలతోనే స్త్రీల స్థితిగతులు బాగుపడిపోవు. విద్య, ఆర్థిక రంగాలలో, అభ్యున్నతి సాధించి భిన్న వర్గాల, వనితల సర్వశక్తి సంపన్నులయ్యేలా చేసే బహుముఖ వ్యూహం నేడు అవసరం. అమ్మాయిలకు చదివే ప్రగతి సాధనం అయ్యేలా ప్రణాళికలను పరిపుష్టికరించడం కీలకం. ఇలాంటి చట్టాలు కాదు. ప్రభుత్వాలు, ప్రభుత్వేతర సంస్థలు సమానత్వానికి సంబంధించిన విలువలను, ఆదర్శాలను విస్తృతంగా ప్రచారం చేయడం అవసరం. ముఖ్యంగా సినిమాలు, టెలివిజన్ వంటి ప్రభావశీల, వినోద సాధనాలు మహిళలపై సమాజానికి తప్పుడు అవగాహన కలిగించడానికి ప్రయత్నించకుండా ఉదాత్తంగా వ్యవహరించాలి. ఆధునిక వినియోగ సంస్కృతి వరకట్న దురాచారాన్ని మరింత తీవ్రతరం చేస్తుందని, అవధులు లేని లాభాపేక్ష మనుషులలో సున్నితత్వాన్ని అపహరిస్తుంది. స్త్రీలను వస్తువుగా పరిగణించే సంస్కృతి అభివృద్దిగా పరిగణ పొందుతున్నది. ఇవన్నీ ఒకవైపు స్త్రీలపై హింస అవకాశాలను పెంచుతున్నప్పుడు చట్టాన్ని అమలుచేసే వారికి మాత్రం చిత్తశుద్ధి నూరుపాళ్ళు వుంటుందని ఆశించలేము.  చదువుకోవడం దగ్గరనుండి ఉద్యోగాల్లో, ఉద్యమాల్లో, పదవులలో స్థానం పొందడం దాకా స్త్రీలు తమ పుట్టింటితో, అత్తవారింటితో పోరాడవలసి రావడం నేటి వాస్తవం. ఉద్యోగాలు చేసి ఊళ్ళేలుతున్న మహిళ కూడా నాలుగు గోడల మధ్య అనాధే అవుతుంది. ఈ పరిస్థితి పోగొట్టడానికి ఈ చట్టం ఉపకరణం. క్రియాశీల మహిళా ఉద్యమాలు ఈ విజయం సాధించడానికి మూడు దశాబ్దాల కాలం పట్టింది. పెరుగుతున్న స్త్రీ విద్య, సాధికారత స్పృహల ఫలితం ఇది. ఈ గెలుపును సార్ధకం చేసుకుంటూ ఇటువంటి మరిన్ని విజయాలు సాధించే దిశగా మహిళాలోకం చైతన్యం వైపు పురోగమించాలి.  గృహహింస రక్షణ చట్టం: వాడుకోవడమెలా…. కాపాడుకోవడమెలా… “నాకు ఇద్దరు పిల్లలు. నా భర్త ఇల్లు గడవడానికి డబ్బులివ్వడు. అతన్ని జైల్లో పెట్టినంత మాత్రాన నా ఇల్లు గడవదు కదా అని కోర్టుకెళ్ళడానికి వెనకాడుతున్నా”.  “నా వయస్సు 75 సంవత్సరాలు. నా పేరునున్న పొలం రాసిచ్చేవరకు నా కొడుకు ఊరుకోలా. తీరా రాసిచ్చినాక ఇప్పుడు నా తిండికి, మందులకయ్యే ఖర్చు భరించడానికి కూడా ఏడిపించుకు తింటున్నాడు. ఈ వయస్సులో ఇవర్ని దేహీ అని అడగను?”  “నేను నాల్గవ తరగతి చదువుతున్నా. మా నాన్న రాత్రిపూట తప్పతాగి వచ్చి నన్ను, మా తమ్ముణ్ణి, మా అమ్మని చితకబాదుతూ వుంటాడు. కమిలిన దెబ్బలతో బడికెళ్ళాలంటే సిగ్గేస్తుంది…”  ఆలకించాలే గాని ఇట్లా వింటూ పోతే కట్టలు తెంచుకుని ప్రవాహంలా విరుచుకుపడతాయి సమస్యలు మనపైన. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారాలుంటాయో లేదో తెలీదుగాని అందుకు జరగాల్సిన ప్రయత్నం మటుకూ ఎప్పుడూ జరుగుతూనే వుంది. అటువంటి ప్రయత్నాలు బాధితులు, మహిళా సంఘాలు, ప్రజాస్వామిక వాదులు చేయబట్టే “మహిళా గృహ హింస రక్షణ చట్టం, 2005”. ఈ ఏడాది అక్టోబరు 26న అమల్లోకి వచ్చింది. ఈ చట్టాన్ని అమలుపరిచే విధానంలోనూ, అది కల్పించే ఉపశమనాలలోనూ కొత్తదనం చాలా వుంది. దీనిని సరిగ్గా అర్థం చేసుకొని వినియోగించుకుంటే గృహహింసకు గురయ్యే స్త్రీలకు బాగా మేలు చేయగలదు.  గృహ హింసను నేరంగా పరిగణించి, ఆ నేరానికి పాల్పడే వారిని శిక్షించే చట్టం ప్రస్తుతం అమలులో వుంది. అది భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 498 ఎ. అయితే ఆ చట్టం బాధపెట్టిన వాడిని శిక్షిస్తుందే తప్ప బాధితురాలికి ఉపశమనం ఇవ్వదు. నివారణకూ ఉపయోగపడదు. నేరం జరిగిపోయిన తరువాత శిక్షించడానికే తప్ప నేరం జరగకుండా నివారించడానికి ఉపయోగపడదు. ఆ లోటును గుర్తించి, మరింత విస్తృత ప్రాతిపదికన గృహహింస నుండి రక్షణ కల్పించే చట్టం కావాలని మహిళా ఉద్యమం చేసిన డిమాండు ఈ చట్టానికి దారితీసింది.  ఈ చట్టంలో ‘బాధితులు’ అంటే ఎవరు? ఈ చట్టం కేవలం వేధింపులకు గురయ్యే భార్యలకే కాదు ఒక కుటుంబంలోని స్త్రీలందరికీ వర్తిస్తుంది. అంటే అక్కా, చెల్లి, తల్లి, రక్తసంబంధం, వివాహం, దత్తత మొదలైన బాంధవ్యాల వల్ల ఒక కుటుంబంలో సభ్యులైన స్త్రీలందరికీ వర్తిస్తుంది.  గృహహింస అని దేన్ని అంటారు? సెక్షన్ 498 – ఎ వరకట్నం వేధింపును, ఆత్మహత్యకు దారితీయగల శారీరక, మానసిక వేధింపును నేరంగా గుర్తించింది. అయితే కొత్త చట్టంలో గృహహింసకు మరింత విశాలమైన అర్థం కల్పించారు. శరీరానికైనా, మనసుకైనా, ఆరోగ్యానికైనా, సంక్షేమానికైనా హాని కలిగించే భౌతిక, మానసిక, లైంగిక, ఆర్థిక చర్యగానీ, నోటి మాటకేగానీ గృహ హింస కిందికీ వస్తుంది. బాధితురాలినే కాక ఆమెకు సంబంధించిన వారెవ్వరినైనా ఇటువంటి హింసాత్మక చర్య ద్వారా బెదిరించడం కూడా గృహహింస కిందికి వస్తుంది. ఈ హింసాత్మక చర్యల జాబితాలో ‘ఆర్థిక చర్య’ అనే దానిని చేర్చడం విశేషం. ఆమె హక్కయిన ఆర్థిక వనరులను ఆమెకు దూరం చేయడం, ఆమె మనుగడకు అవసరమైన ఆర్థిక వనరులు ఆమెకు లేకుండా చేయడం, ఆమెకు వాడుకునే హక్కు ఉన్న స్థిరాస్తినైనా, చరాస్తినైనా ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా అమ్మివేయడం, లేదా అటువంటి కుటుంబ వనరులను ఆమెకు దూరం చేయడం కూడా గృహహింసకు పాల్పడడం కిందికే వస్తుంది.  ఈ చట్టాన్ని వినియోగించుకోవాలంటే ఏం చేయాలి? ఇందుకు బాధితురాలు కోర్టులో కేసు వేయనక్కర లేదు. ఆమె చేయవలసిందల్లా ఏమిటంటే తాను ఎదుర్కొంటున్న సమస్యలను రాతపూర్వకంగా, ఫిర్యాదు రూపంలో ఇవ్వడమే. బాధితురాలే ఫిర్యాదు ఇవ్వాలని లేదు. ఆమె తరఫున ఆమె బంధువులు, పక్కింటివారు, సామాజిక కార్యకర్తలు ఎవరైనా ఇవ్వొచ్చు.  ఫిర్యాదు ఎవరికి సమర్పించాలి? ఈ చట్టాన్ని అమలుపర్చడానికి భద్రతాధికార్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు. తమ సమస్యలను వారికి నివేదిక రూపంలో సమర్పించాలి. ఫిర్యాదు స్వీకరించిన తర్వాత భద్రతాధికార్లు ఆ ఫిర్యాదుపైన గృహహింస నివేదిక (డిఐఆర్) నొకదాన్ని తయారుచేస్తారు. మామూలు కేసుల్లో ఎఫ్ఐఆర్‌లాగా. బాధితురాలు కోరుకుంటున్న ఉపశమనమేమిటి అనేది కూడా రాసుకుంటారు. వీటన్నిటినీ భద్రతాధికారి ఒకటవ తరగతి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్, మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు పెడతారు. అంటే బాధితురాలు నేరుగా కోర్టుని ఆశ్రయించే అవసరం లేకుండా ఆమెకు భద్రతాధికారి అండదండలు వుంటాయి. ఒకే అధికారిపై ఇంతటి అపార నమ్మకం పెట్టుకుంటే ఆ అధికారి సాయం చేయకుండా అడ్డం తిరిగితే పరిస్థితి ఏమిటి? అనే సందేహం వస్తుందేమో. బాధితురాలి నివేదికను ఖాతరు చేయని భద్రతాధికారికి ఏడాది జైలు శిక్ష, రూ. 20,000 జరిమానా విధించవచ్చు. వేధింపులకు గురయ్యే స్త్రీలకు పోలీసుల రక్షణ అవసరం కావచ్చు. లేక ఇతరత్రా సహాయ సహకారాలు అవసరం కావచ్చు. అందుకోసమే భద్రతాధికారి గృహహింస నివేదిక కాపీలను పోలీసులకు, సర్వీసు ప్రొవైడర్స్ కు కూడా పంపాలి. సర్వీసు ప్రొవైడర్స్ అంటే స్వచ్ఛంద సేవాసంస్థల కార్యకర్తలు.  మన రాష్ట్రంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్లను భద్రతాధికారులుగా నియమించారు. తమకు ఇతర బాధ్యతలు వుండడం వల్ల ఈ అభ్యర్థనల్ని పట్టించుకోలేమని వారు తప్పించుకోడానికి వీలు లేదనీ, తప్పకుండా స్వీకరించి తీరవలసిందేననీ చట్టం చెప్పినా ఈ నియామకం చట్టం లక్ష్యాన్ని సాధించడానికి సరిపోదు. కనీసం మండల స్థాయిలో పూర్తికాలం భద్రతాధికారులను నియమించడం అవసరం. వాళ్ళకు పనిలేకుండా పోతుందేమోనన్న ఆందోళన అవసరం లేదు. ఈ చట్టాన్ని స్త్రీలు అర్థం చేసుకొని ఉపయోగించడం నేర్చుకోవాలే గానీ భద్రతాధికారులకు పనికి కొదువ వుండదు.  కోర్టులో విచారణ ఎలా జరుగుతుంది? బాధితురాలు నేరుగా కోర్టులో ఫిర్యాదు చేసినా, ఆమె తరఫున వేరే ఎవరైనా చేసినా లేదా ఆమె దగ్గర ఫిర్యాదు స్వీకరించిన భద్రతాధికారి దానిని ఆధారం చేసుకొని కోర్టులో ఫిర్యాదు చేసినా, కోర్టు దానిపైన విచారణ చేపడుతుంది. కౌన్సిలింగ్‌ అవసరమనుకుంటే కౌన్సిలింగ్‌ చేపడుతుంది. లేదా ప్రతివాదికి నోటీసు జారీచేసి విచారణ చేపడుతుంది.  ఉపశమనాలేమిటి? ఈ చట్టం కింద రకరకాల సమస్యలకు తగిన పరిష్కారాలను కల్పించే ప్రయత్నం జరిగింది. ఇది ఈ చట్టంలోని అత్యంత ఉపయోగకరమైన అంశం. బాధితురాలిపై ప్రతివాది హింసకు పాల్పడకుండా నిషేధిస్తూ భద్రతా ఆదేశాలు (ప్రొటెక్షన్ ఆర్డర్) జారీ చేయడానికి మేజిస్ట్రేటుకు అధికారాలు ఉన్నాయి. ఇంట్లోనే కాదు బైట కూడా ఆమెను వేధించకుండా ప్రతివాది కదలికలపై ఆంక్షలు విధించవచ్చు. నోటితోనే కాదు రాత పూర్వకంగా గాని, ఫోన్ చేసిగాని ఆమెను వేధించకూడదని మేజిస్ట్రేట్ ఆదేశించవచ్చు. ఉమ్మడి ఆస్తులను అమ్మడానికి వీలులేకుండా ఉత్తర్వులు పొందవచ్చు. ఉమ్మడిగా ఉన్న బ్యాంక్ ఖాతాలు, లాకర్ల వినియోగాన్ని కూడా అరికట్టవచ్చు. బాధితురాలికి అండగా నిలిచిన వారిపై అతను ఎటువంటి దాడికి పూనుకోకూడదు. ఆ రకంగా భద్రతా ఆదేశాలు పొందవచ్చు.  ఇవికాకుండా తాను వుంటున్న ఇంట్లో బాధితురాలికి నివాసహక్కు వుందని కూడా ఈ చట్టం చెబుతుంది. చెప్పడమే కాక ఆ నివాసహక్కు అనుభవించడానికి అవసరమైన ఆదేశాలు జారీచేసే అధికారం మేజిస్ట్రేట్‌కు ఈ చట్టం ఇచ్చింది. ఆ ఇంటిపై యాజమాన్య హక్కు లేకపోయినా సరే ఆమెను ఆ ఇంట్లో నుంచి గెంటెయ్యడానికి ఎవరికీ అధికారం లేదు. ఇంట్లో నుంచి తరిమేయబడ్డ ఆడవాళ్ళకు తల దాచుకోవడం ఒక పెద్ద సమస్య. ఒక్కోసారి కన్న తల్లిదండ్రులే ముఖం చాటేస్తుంటారు. అటువంటి ఆడవారికి భద్రతాధికార్లు షెల్టర్ హోమ్స్‌లో ఆశ్రయం కల్పించాలి. మేజిస్ట్రేట్ కూడా ఈ విషయంలో అవసరానికి తగిన ఆదేశాలు జారీ చేయవచ్చు. ఆమె కావాలంటే తమ కుటుంబముంటున్న ఇంట్లోనే వుండొచ్చు. ఆ ఇంట్లోనే ఒక వాటాను ఆమెకు కేటాయించవచ్చు. వేరే ఇంట్లో వుంచడం మంచిదైతే అద్దె తదితర ఖర్చులు ప్రతివాది భరించాలి. ఈ విధమైన ఆదేశాలు జారీ చేసే అధికారం మేజిస్ట్రేట్‌కి వుంది. ప్రతివాది వేధింపుల వల్ల బాధితురాలు ఆర్థికంగా నష్టపోతే దాన్ని పూరించాల్సిన బాధ్యత ప్రతివాదిదే. ఈ వేధింపులవల్ల ఆమె ఆరోగ్యం చెడితే వైద్యానికయ్యే ఖర్చు ప్రతివాది భరించాలి. ఆమె ఆస్తిపాస్తుల్ని ధ్వంసం చేస్తే అందుకైన నష్టాన్ని ప్రతివాదే భరించాలి. బాధితురాలు ఈ చట్టం ద్వారా కూడా మనోవర్తి పొందవచ్చు. మనోవర్తి ఇంతివ్వాలి, అంతివ్వాలని పరిమితులేమీ ఈ చట్టంలో లేవు. ఈ ఉపశమనాలతో పాటు మేజిస్ట్రేట్ అవసరమైతే ప్రతివాదిని నష్టపరిహారం చెల్లించమని చెప్పొచ్చు. వేధింపులవల్ల మానసిక చిత్రవధకు, ఒత్తిళ్ళకు గురైనందుకు ఆమెకు అతను నష్టపరిహారం ఇవ్వాల్సి వుంటుంది. బాధితురాలే ఆదేశాలు వెనక్కి తీసుకోమని అడిగేవరకు కోర్టు ఆదేశాలు అమల్లో వుంటాయి. పరిస్థితుల్లో మార్పులను బట్టి కోర్టు తన ఆదేశాలను సవరిస్తూ వుంటుంది.  ప్రతివాదికి శిక్ష ఎప్పుడు? ఈ చట్టం కింద ఉపశమనాలన్నీ సివిల్ స్వభావం గలవి. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే ప్రతివాదికి ఏడాది జైలు శిక్ష, రూ. 20,000 జరిమానా విధిస్తారు. ఒక హక్కుకి శాసన రూపం కల్పించడమే ఒక భగీరథ ప్రయత్నం. దాన్ని స్త్రీలు సాధించారు. పోలీసుల, న్యాయవాదుల తలుపులు తట్టేబదులు ఇప్పుడు స్త్రీలు భద్రతాధికార్ల తలుపులు తట్టాలి. గట్టిగా తట్టాలి! న్యాయం జరగాలంటే అందరికీ వినబడేంత గట్టిగా తట్టాలి!  మనమేం చేయాలి? సామాజికంగా అణగారిన వర్గాలకు హక్కులు కల్పించే చట్టాలు మన పాలకులు అప్పుడప్పుడు చేస్తుంటారు. అయితే ఆ వర్గాల ప్రతినిధులకు వాటి రూపకల్పనలో స్థానం ఉన్నప్పుడు తప్ప అవి సమగ్రంగా వుండవు. గృహహింస చట్టాన్ని రూపొందించిన క్రమంలో మహిళా ఉద్యమకారులు చురుగ్గా పాల్గొన్నారు కాబట్టి ఈ చట్టం బాగుంది. అయితే సామాజిక వ్యవస్థ పోకడకు వ్యతిరేక దిశలో ఉన్న చట్టాలు వాటంతటవి అమలు కావు. పూనుకొని అమలు చేయించుకుంటేనే అమలవుతాయి. మహిళా సంఘాలు, ప్రజాతంత్ర ఉద్యమ శక్తులు ఆ కర్తవ్యాన్ని మీద వేసుకుంటాయని ఆశిద్దాం. లేకపోతే ఇది కరడు గట్టిన న్యాయవ్యవస్థ యథాస్థితివాద సంస్కృతికి బలయ్యే ప్రమాదం వుంది.

Read Full Post »

(కృపాకర్ మాదిగ)

రిజర్వేషన్లపై చర్చ, రిజర్వేషన్ల వర్గీకరణ మీద చర్చ ఇప్పుడు ఆసక్తిదాయకంగా జరుగుతోంది. మహిళలకోసం ప్రవేశపెట్టిన 33 శాతం రిజర్వేషన్ల బిల్లులో ఆయా సామాజిక వర్గాల మహిళలకు కోటాలు విధించిన అనంతరమే పార్లమెంటు ఆమోదించాలని మాయావతి, ములాయం సింగ్‌ తదితరులు డిమాండు చేస్తున్నారు. దళిత, ఆదివాసీ, ఓబీసి, మైనారిటీ మహిళల హక్కుల్ని గౌరవించేవారు ఈ డిమాండును బలపరుస్తున్నారు. మగ, కుల దురహంకార పార్టీలు మహిళా బిల్లును ప్రహసనం క్రింద మార్చేశాయి. వెనకబడిన తరగతుల వారి ఆందోళనల ఫలితంగా ఉన్నత విద్యా సంస్థల్లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇంతకాలానికి ఇటీవలె కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చట్టం చేసింది. దీనికి వ్యతిరేకంగా అగ్రకులాల విద్యార్థులు, డాక్టర్లు అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌) వేదికగా చేసిన నానా యాగీని వర్ణ మీడియా బహు వర్ణాల్లో ప్రదర్శించింది. ఆదివాసి రిజర్వేషన్ల మొత్తాన్ని లంబాడి, ఎరుకల వంటి మైదాన ప్రాంతాలకు చెందిన కొన్ని ఆదివాసీ తెగలే అధికభాగం పొందుతున్నారని, ఇలా కాకుండా అడవుల్లో, కొండకోనల్లో, మారుమూల ప్రాంతాల్లో నివశిస్తున్న గిరిజన జాతులన్నింటికీ జనాభా నిష్పత్తి ప్రకారం అందేవిధంగా యస్టీ రిజర్వేషన్లను గ్రూపులుగా వర్గీకరించాలని కోయ, చెంచు మొదలైన జాతులవారు ఆదివాసి తుడుందెబ్బ ఉద్యమం చేస్తున్నారు. కొద్దిమంది లంబాడీ, ఎరుకల తెగలవారు యస్టీ రిజర్వేషన్ల వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారు. యస్టీ రిజర్వేషన్లు వర్గీకరించటానికి, యస్టీల్లో క్రీమీలేయర్ విధానం పెట్టడానికి సంబంధించిన ముసాయిదా బిల్లును పార్లమెంటు స్థాయీ సంఘం తయారు చేసిందని గత పార్లమెంటు సమావేశాల సందర్భంగా జాతీయ మీడియాలో వార్తలు రావడం ముదావహం. కరువు ప్రాంతాలను, మారుమూల ప్రాంతాలను, వెనకబడిన ప్రాంతాలను గుర్తించాలని పెద్ద జిల్లాలను చిన్న జిల్లాలుగా, పెద్ద రాష్ట్రాలను చిన్న రాష్ట్రాలుగా ఏర్పాటు చెయ్యాలని జాతీయ స్థాయిలో ఆందోళనలు, ఉద్యమాలు జరుగుతున్నాయి. దక్షిణ భారతదేశం ఒక దేశంగా ఏర్పడితే, ఆంధ్రప్రదేశ్ నాలుగు చిన్న రాష్ట్రాలుగా ఏర్పడితే నష్టమేమిటో, తప్పేమిటో సమైక్యత, సమగ్రతావాదులు చెప్పలేకపోతున్నారు. పైన పేర్కొన్నవన్నీ కొన్ని రకాల వర్గీకరణలే. ఆకలైనవారు అన్నం తింటామంటే, రోగం వచ్చినవారు నయం చేసుకుంటామంటే ఎట్లా సరైనదో, అవకాశాల వర్గీకరణ, ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం కూడా అంతే ఆరోగ్యకరమైనది.  విద్య, ఉద్యోగ, రాజకీయ, సంక్షేమ రంగాల్లో దళితులకు రాజ్యాంగం ఇస్తున్న యస్సీ రిజర్వేషన్లలో సింహభాగాన్ని దళితుల్లో సాపేక్షికంగా అభివృద్ధి సాధించిన మైనారిటీ మాల కులస్తులే పొందుతున్నారు. అలా కాకుండా, దళితుల్లో అత్యధికంగా వెనకబడిన, మెజారిటీలైన మాదిగ, రెల్లి, అనుబంధ కులాల వారికి, అలాగే మాల, అనుబంధ కులాలకు, వారి వారి కులాల జనాభా నిష్పత్తి ప్రకారం ఎవరి వాటా రిజర్వేషన్లు వారు పొందేలాగ ఎస్ సి రిజర్వేషన్లను ఎబిసిడి గ్రూపులుగా వర్గీకరించాలని మాదిగలు ప్రభుత్వాన్ని డిమాండు చేస్తూ గత 20 ఏళ్ళుగా దండోరా ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు.  మతాధికారం, భూమి, వ్యాపారం, సంపద, రాజ్యాధికారాలపై పట్టు సంపాదించుకున్న ఆధిపత్య కులాల చేతుల్లో మెజారిటీ దేశ ప్రజలైన దళితులు, ఆదివాసులు, వెనకబడిన తరగతులవారు నిర్ణయాధికార శక్తిని కోల్పోయారు. తగిన ప్రాతినిధ్యాన్ని, ప్రాధాన్యతను కోల్పోయారు. బ్రాహ్మణీయ కుల వ్యవస్థ బ్రాహ్మణుల కింద క్షత్రియుల్ని, క్షత్రియుల క్రింద వైశ్యుల్ని, వైశ్యుల కింద శూద్రుల్ని , శూద్రుల కింద మాలల్ని, మాలల కింద మాదిగలను పేర్చింది. అంతస్తుల వారి సామాజిక చట్రంలో బిగించింది. పుట్టుకతోనే వ్యవస్థీకృత సంఘ బానిసలుగా మాదిగల చేసింది. మనువాదం ఏరెండు కులాలు / జాతులు/తెగలు/ తరగతులు సమానం కాదంది. కులాల మధ్య కంచం, మంచం పొత్తులు కూడదంది. కులంలో బాహ్య వివాహాలను నిషేధించింది. అంతర్వి వాహాలను తప్పనిసరి చేసింది. పై కులాన్ని చూసి ఈర్ష్య , కింది కులాన్ని చూసి ఊరట పొందే అనాగరిక మానవుల్ని కులం తయారు చేసింది. చివరకు బడిత ఉన్నోడిదే బర్రె, గుదప ఉన్నోడిదే గుర్రం సామెతలా కులబలం, ధనబలం ఉన్నోడిదే రాజ్యం అనే విలువకు కుల వ్యవస్థ పట్టం కట్టింది.  పుట్టుక, వృత్తి కారణాలుగా మాదిగ, రెల్లి అనుబంధ కులాలపై వేల సంవత్సరాలుగా అంతులేని కుల వివక్ష అమలు జరిగింది. వెట్టిచాకిరి, పాకి వృత్తి, జోగిని, బాణామతి, అంటరానితనం, పేదరికం, నిరక్షరాస్యత, అనైక్యత, అశక్తత తదితర అమానుష వ్యవస్థల్లో మాదిగ, రెల్లి అనుబంధ కులాలను కుల వ్యవస్థ బందీలను చేసింది. మనువాదం గుడి, బడి, భూమి, నీరు, అధికారాలలో మాదిగలకు ప్రవేశాన్ని నిరాకరించింది.  నాటి పరిస్థితులు కొంత మారాయి. సమాన గౌరవం, సమాన పౌరసత్వం, ప్రాథమిక హక్కులు, విద్య, ఉద్యోగాలలో, శాసన సభల్లో ప్రాతినిధ్యం, ప్రత్యేక సదుపాయాలు, రక్షణ కావాలని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ నాయకత్వంలో నిమ్న జాతుల వారు (దళితులు, ఆదివాసులు, వెనకబడిన తరగతులు) పోరాడారు. నిమ్న జాతుల హక్కులకోసం 1930, 31,32 సంవత్సరాల్లో లండన్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాల్లో బ్రిటీష్ ప్రభుత్వ ప్రతినిధుల ముందు డాక్టర్ అంబేడ్కర్ ప్రాతినిధ్యం వహించారు. దళితుల సమస్యలు కేవలం మతపరమైనవేనని, అవి సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమస్యలు కావని దళితుల సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్ అగ్రకుల నాయకత్వంతో నాటి దళిత నాయకత్వం పోరాడింది. దళితులు హిందువుల్లో భాగమే. వారికి ప్రత్యేక హక్కులు ఎందుకన్న గాంధీజీ అభిప్రాయాలతో అంబేడ్కర్ సంఘర్షించాడు. స్వాతంత్య్రం, సమానత్వం, సౌభ్రాతృత్వాలకు వ్యతిరేకమైందే కుల వ్యవస్థ అని అంబేడ్కర్ అన్నారు. స్వాతంత్య్రానంతరం సమానత్వం, న్యాయం, సహోదరత్వాలు పునాదిగా కలిగిన నవభారత రాజ్యాంగం ద్వారా విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగాల్లో ప్రత్యేక సదుపాయాలను (రిజర్వేషన్లు), రక్షణను నిమ్నజాతుల వారు అంబేడ్కర్ నాయకత్వంలో సాధించుకున్నారు.  నిమ్నజాతులు పోరాడి సాధించుకున్న రిజర్వేషన్లను సంపూర్ణంగా అమలు చెయ్యటంలో స్వాతంత్య్రానంతర ప్రభుత్వాలు ఏనాడూ చిత్త శుద్ధిని ప్రదర్శించలేదు. ప్రతిఘటన ఎదురౌతుందనుకున్నప్పుడే కొద్దిమేరకైనా రిజర్వేషన్లను అమలు జరిపాయి. నిమ్నజాతులు హక్కుగా సాధించుకున్న రిజర్వేషన్లను అగ్ర కుల ప్రభుత్వాలు భిక్షం స్థాయికి దిగజార్చాయి. రిజర్వేషన్ల ద్వారా లభించిన ప్రాతినిధ్యాన్ని స్వతంత్రమైనదిగా వుండనీయక, చెంచాగిరి స్థాయికో లేదంటే తమపై ఆధారపడే స్థాయికో అగ్రకుల రాజకీయ పార్టీలు మార్చివేశాయి.  రిజర్వేషన్లు అందుకోవడంలో ఆదియాంధ్రులతో మాలలు, మాలలతో మాదిగలు, మాదిగలతో రెల్లి, మెహతార్లు పోటీ పడలేకపోయారు. మాదిగల డిమాండు మేరకు 1996 లో రాష్ట్ర ప్రభుత్వం యస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం పరిశీలనకోసం నియమించిన జస్టీస్ రామచంద్రరాజు కమీషన్ ఇదే విషయాన్ని నిర్ధారించింది. ఆయా కులాల జనాభా నిష్పత్తుల ప్రకారం రిజర్వేషన్లను ఎబిసిడి గ్రూపులుగా విభజించడంతో పాటు అత్యంత వెనకబడిన షెడ్యూల్డు కులాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ఎవరి వాటా రిజర్వేషన్లు వారికి అందించే విధంగా ప్రభుత్వం చట్టం చెయ్యాలని జస్టీస్ రామచంద్రరాజు కమీషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో సిఫారసు చేసింది. నాటి ప్రభుత్వం కమీషన్ నివేదికను ఆమోదించింది. అఖిల పక్ష పార్టీలన్నీ ఆమోదించాయి. షెడ్యూల్డు కులాల వర్గీకరణ విధానాన్ని బలపరుస్తూ 1998 ఏప్రిల్ 22 న శాసనసభ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. 2000 ఏప్రిల్ ఒకటినాడు రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా యస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టాన్ని చేసింది. మాదిగ, రెల్లి, మాల, ఆదియాంధ్ర కులాలు వారి వారి వాటా రిజర్వేషన్లను ఈ చట్టం అమలుతో ఐదేళ్ళపాటు పొందారు. మాదిగ, రెల్లి కులాల వారికి కొంతమేర న్యాయం జరిగింది.  వర్గీకరణ చట్టం వలన మాలలు, ఆదియాంధ్రులకు వారు పొందవలసిన వాటా రిజర్వేషన్లు వారికి అందాయి. ఐతే, అప్పటివరకు యాభై ఏళ్ళు పొందిన అదనపు రిజర్వేషన్లు రాకుండా ఆగిపోయాయి. దీనిని కొందరు మాలలు, ఆదియాంధ్ర మాలలు అంగీకరించలేకపోయారు. మాదిగ- మాలల్ని చీల్చి, అగ్రకుల రాజకీయ పార్టీల చేతుల్లో కీలుబొమ్మలుగా మారారని మాదిగ నాయకుల్ని నిందించారు. మాదిగ నాయకులు అనవసర సమస్యలు సృష్టిస్తున్నారని, చిన్న సమస్యని పెద్దది చేశారన్నారు. మాల నాయకులు కొందరు యస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశాన్ని ప్రాధాన్యతలేని విషయంగా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది మాలపెద్దలు మాదిగ నాయకులతో ముందు మరిన్ని అవకాశాలు పెంచుకుందాం, తర్వాత పంచుకుందాం అన్నారు. మరికొంతమంది మాల పెద్దలు రిజర్వేషన్లు దళితులకు అగ్రవర్ణాల వారు వేస్తున్న భిక్షమని, భిక్షం పంపకం కోసం గొడవమాని భూమికోసం, రాజ్యాధికారం కోసం ఉమ్మడిగా పోరాడుదాం కలిసి రండని మాదిగ నాయకులకు ప్రతిపాదించారు. ఉన్న రిజర్వేషన్లను పంచుకుందాం ముందుకు రండని మాదిగలు ప్రతిపాదిస్తే, ‘ఉన్నవా? ఎక్కడున్నాయి? ఉన్నవి మావే! ఏమిటి పంచుకునేది? మీకు దిక్కున్నచోట చెప్పుకోండి, పొండి’ అనే అన్యాయమైన అహంభావ ధోరణిని మాల నాయకులు ప్రదర్శించారు.  వర్గీకరణ చట్టానికి వ్యతిరేకంగా మాల నాయకులు హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు వెళ్ళారు. రాజ్యాంగం ప్రకారం యస్సీ రిజర్వేషన్లను వర్గీకరించే అధికారం రాష్ట్ర అసెంబ్లీకి లేదని స్పష్టం చేస్తూ, 2004 నవంబర్ 5 నాడు సుప్రీంకోర్టు వర్గీకరణ చట్టాన్ని రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. మాల మనువులు ఇంతటితో ఆగిపోలేదు. ఐదేళ్ళుగా వర్గీకరణ ప్రకారం జరిగిన అడ్మిషన్లు, ఉద్యోగ నియామకాలు, ప్రమోషన్లను రద్దు చెయ్యాలని మళ్ళీ సుప్రీంకోర్టులో కేసు వేశారు. వర్గీకరణ చట్టం రద్దుకాక మునుపు జరిగిన ఉద్యోగ నియామకాలు, ప్రమోషన్లు, అడ్మిషన్లు, కారుణ్యదృష్టితో యధావిధిగా వుంటాయని, వర్గీకరణ చట్టం రద్దు తర్వాత జరిగినవి మాత్రమే రద్దవుతాయని సుప్రీంకోర్టు 2006 సెప్టెంబర్ 25 న ఇచ్చిన తీర్పులో పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పులతో 80 లక్షలమంది మాదిగలు నిరాశపడలేదు. మరింత పట్టుదలని పెంచుకున్నారు. ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. ఎస్.సి రిజర్వేషన్ల వర్గీకరణ కోసం పార్లమెంటులో చట్టం చేయించడానికి పూనుకోవాలని డిమాండు చేస్తూ 2004 డిసెంబర్ 10 నాడు వేలాదిమంది మాదిగలు ఛలో అసెంబ్లీ నిర్వహించారు. అదేరోజు యస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకోసం పార్లమెంటులో అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తూ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. మాదిగలు పార్లమెంటు ముందు దండోరా వేశారు. ప్లీనరీని నిర్వహించారు. దీనితో కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. కేంద్ర ప్రభుత్వం వర్గీకరణకోసం 25-9-2006 న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టీస్ దొరై స్వామిరాజు కమీషన్ నియమించింది. ఈ కమీషన్ విచారణా కాలవ్యవధిని ఏడాది నుంచి 3 నెలలకు కుదించి, విచారణను త్వరితగతిన పూర్తి చేయించాలి. పార్లమెంటులో సత్వరమే వర్గీకరణ చట్టం చేయించుకోవడం ద్వారా రానున్న విద్యా సంవత్సరంలోనైనా వర్గీకరణ ఫలితాలు తమ విద్యార్థినీ విద్యార్థులు, నిరుద్యోగ యువతకు అందించాలని మాదిగ, రెల్లి అనుబంధ కులాల ప్రజలు ఆశతో ఉద్యమిస్తున్నారు.  రిజర్వేషన్లు లేకుండా, తమ వాటాకు మించిన అవకాశాలు పొందకుండ కేవలం ప్రతిభ ద్వారానే మాలలు 24 మంది సిట్టింగ్‌ యమ్మెల్యేలు, 5 మంది సిట్టింగ్‌ యంపీలు, కేంద్రంలో, రాష్ట్రంలో మంత్రులు, వందమంది ఐఎయష్లు, ఐపియష్లు వందలాదిమంది అధికారులు, లక్షలాదిమంది ఉద్యోగులు కాగలిగేవారా? ఇంత ప్రతిభే వారికుంటే రిజర్వేషన్లు తీసుకోవడం ఎందుకు? బహిరంగ పోటీలోకి వెళ్ళవచ్చుకదా? యస్సీ రిజర్వేషన్లలో సింహభాగం అనుభవించినందుకు షెడ్యూల్డు జాబితానుంచి మాలకులస్తులను తొలగించా లని 1965 లో రిజర్వేషన్ల అధ్యయనంపై కేంద్ర ప్రభుత్వం నియమించిన బి.యన్.లో కూర్ కమిటి చేసిన సిఫారసును అమలు కానీయకుండా మాల నాయకులు అడ్డుకోవడం ఎందుకు? దశాబ్దాల క్రితమే రాష్ట్రంలో ప్రభుత్వం బిసి రిజర్వేషన్లను ఎబిసిడి గ్రూపులుగా వర్గీకరించింది. ఇందువలన బీసీల మధ్య స్పర్థలు తొలగిపోయాయి, సుహృద్భావం, సంఘీభావం బలపడింది. కాదా? అలాగే యస్సీ రిజర్వేషన్లను ఎబిసిడి గ్రూపులుగా వర్గీకరిస్తే మాలలకు ఎటువంటి నష్టం రాదు. జనాభా నిష్పత్తి ప్రకారం వారికి రావలసిన వాటా రిజర్వేషన్లు వారికి తప్పక అందుతాయి. మార్టిన్ లూథర్ కింగ్‌ నడిపిన మానవహక్కుల ఉద్యమం ఫలితంగా నల్లజాతీయులకు, ఇతర సామాజిక వివక్షల నెదుర్కొంటున్న వారికి పదిశాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 1964 లో అమెరికాలో పౌరహక్కుల చట్టం వచ్చింది. అణగారిన వర్గాలకు అమెరికాలోనూ రిజర్వేషన్లు అమలవుతున్నాయి. మాలలతో, మాదిగ, రెల్లి అనుబంధ కులాలవారు పోటీ పడలేకపోతున్నపుడు వారి వారి వాటాల ప్రకారం రిజర్వేషన్లు విడదీసి ఇవ్వమని అడగటం తప్పెలా అవుతుంది. మాలల్లో ఎంతోమంది నాయకులు, విద్యావేత్తలు, తత్వవేత్తలు, కవులు, రచయితలు, గాయకులు, వక్తలు, పాత్రికేయులు, కార్యకర్తలు, మేధావులు, పెద్దమనుషులు న్నారు. వీరిలో చాలామంది బుద్దుడు, జీసస్, అంబేడ్కర్, మావో వారసులమని చెప్పుకుంటుంటారు. సామాజిక న్యాయం, విప్లవం కావాలని మాట్లాడుతుంటారు. రిజర్వేషన్లలో పంపిణీ న్యాయం కావాలని మాదిగ, రెల్లివారు చారిత్రక ఉద్యమం చేస్తుంటే, మాదిగలు – మాలల మధ్య ఇంత పెద్ద కులయుద్దం జరుగుతుంటే వారంతా ఏమయ్యారు? మాల శక్తులే అడుగడుగునా వర్గీకరణకు అడ్డుపడ్డారు. ఐనా, మాదిగ నాయకులు మాల నాయకుల్ని శతృవులుగా ప్రకటించలేదు. మాదిగలు ప్రభుత్వం పైననే పోరాడుతున్నారు. మాల మేధావులు న్యాయం కోరుతున్న రెల్లి, మాదిగల వైపులేరు. తమ్ముడు తనవాడైనంత మాత్రాన ధర్మం మాట్లాడకుండ ఎన్నాళ్ళిలా నోళ్ళు కట్టేసుకుంటారు. మాల మహానాడు నాడులూ, శక్తులా వీరు? కారా? న్యాయం తీర్చి పెద్దరికాన్ని నిలుపుకోలేరా? కాదన్నా, జాంబవంతుని వారసులు చూస్తూ ఊరుకోరు. దీర్ఘశాంతం, పట్టుదల, శక్తి కలిగిన మాదిగలు తమకు జరిగిన సామాజిక అన్యాయాన్ని, అసమానతలను గూటందెబ్బతో సరిచేస్తారు. పార్లమెంటులో వర్గీకరణ చట్టాన్ని సాధించుకుంటారు.  కుల వ్యవస్థ దేశంలో అన్ని అసమానతలకు, సామాజిక అన్యాయాలకు కారణమైంది. దీని కారణంగా వేలాది షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలు, వెనకబడిన వర్గాల వారికి దేశాభివృద్ధి నుంచి తిరిగి పొందటంలో తగిన ప్రవేశం, ప్రాతినిధ్యం లేకుండా పోయింది. దేశ సంపద, విద్య, ఉద్యోగ, రాజకీయ, సంక్షేమ రంగాల్లో నేటికీ తగిన ప్రాతినిధ్యం, ప్రవేశం లేని రెల్లి, మాదిగ వంటి మరెన్నో దళిత కులాలకు, కోయ, చెంచు, యానాది వంటి ఇంకెన్నో ఆదివాసీ జాతులకు తగిన ప్రవేశం, ప్రాతినిధ్యం కల్పించడం ద్వారానే సృజనాత్మకత, వైవిధ్యాలతో మన ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. సామాజిక అన్యాయాలను, అసమానతలను సరిదిద్దవలసిన సామాజిక బాధ్యత పౌరులందరిది. అంతేకాదు, ఈ బాధ్యత సంస్థాగతమైనది, వ్యవస్థాగతమైనది, యాజమాన్యపరమైనది, ప్రభుత్వపరమైనది, సాటివారిపరమైనది.

(వ్యాస రచయిత, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు)

Read Full Post »

Older Posts »