Feeds:
టపాలు
వ్యాఖ్యలు

Archive for అక్టోబర్ 10th, 2008

హైదరాబాద్‌: తెలంగాణకు సానుకూలంగా తన నిర్ణయాన్ని ప్రకటించిన తెలుగుదేశం రాష్ట్ర రాజకీయ సమీకరణలను ఒక్కసారిగా మార్చివేసింది. ఈ నిర్ణయం అధికార కాంగ్రెస్లో గుబులుపుట్టిస్తోందనే చెప్పాలి.

తెలంగాణపై ఇప్పటివరకు “ఆచి తూచి” అడుగులు వేస్తూ వచ్చిన తెలుగుదేశం పార్టీ రథసారథి నారా చంద్రబాబు నాయుడు “తెలంగాణకు జై” కొట్టడంతో అందరికంటె ఎక్కువగా హర్షించే వ్యక్తి టి.ఆర్‌.ఎస్‌. అధినేత కె.సి.ఆర్‌. కాగా ఏ “తెలంగాణ” కోసమైతే తెలుగుదేశం పార్టీ అధినాయకత్వంతో పోరాడి, చివరికి బయటకు వచ్చిన దేవేందర్‌గౌడ్‌ మాత్రం ఏమంత “గట్టిగా” హర్షం వ్యక్తం చేయలేదు. తెలుగుదేశంపార్టీ “జై తెలంగాణ” అనడం బాగానే ఉన్నా, తెలంగాణ ప్రజలను నమ్మించాలని తెలుగుదేశం పార్టీ చూస్తున్నదని, ఇది తెలంగాణ వాదులు అప్రమత్తంగా వ్యవహరించవలసిన అవసరాన్ని సూచిస్తున్నదని దేవేందర్‌గౌడ్‌ ఆచి తూచి స్పందించారు.

తెలుగుదేశం పార్టీకి తామంతా రాజీనామా చేసినందువల్లే ఒత్తిడికి లోనై తెలుగుదేశం పార్టీ చివరికి “జై తెలంగాణ” అన్న నినాదాన్ని అందిపుచ్చుకున్నదని దేవేందర్‌గౌడ్‌, పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. 2004లో సమైక్య వాదంతో తెలుగుదేశం పార్టీ ఎన్నికల బరిలోకి దిగగా, అప్పుడు “తెలంగాణ” వాదాన్ని అక్కున చేర్చుకున్న కాంగ్రెస్‌ పాత్రనే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పోషించదల్చినట్లు కనిపిస్తోందని దేవేందర్‌గౌడ్‌ అన్నారు.

ఏది ఏమైనా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు “జై తెలంగాణ” అని నినదించిన దృష్ట్యా త్వరలో జరగబోయే రౌండ్‌టేబుల్‌ సమావేశానికి తెలుగుదేశం పార్టీని కూడా ఆహ్వానిస్తామని దేవేందర్‌ గౌడ్‌ చెప్పారు.

తెలుగుదేశం పార్టీ నిర్ణయాన్ని చంద్రబాబు ప్రకటించిన అనంతరం వేణుగోపాలాచారి, గుత్తా సుఖేందర్‌ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి అభినందించారు.

Read Full Post »

శ్రీకాకుళం: రాష్ట్రంలోని రైతాంగానికి నిరంతరాయంగా నాణ్యమైన ఉచిత విద్యుత్‌ ఇవ్వాలన్నది తమ పార్టీ విధానమని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి స్పష్టం చేశారు. నాణ్యమైన విద్యుత్‌, కల్తీ లేని విత్తనాలు, కొరత లేని ఎరువులు ఇవ్వడమన్నది ప్రభుత్వ కనీస ధర్మమని గుర్తు చేశారు. వంద మంది కంప్యూటర్‌ నిపుణులతో అద్భుతాలు సృష్టించవచ్చు కానీ, ఒక్క అన్నం ముద్ద తయారు చేయించగలరా? ౖ ప్రశ్నించారు.

తమకు అవకాశం వచ్చిన రోజున అన్ని రకాలుగా రైతాంగాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తన తొలిరోజు ప్రజా అంకిత యాత్రలో ఆయన రైతులు,యువతపై వాగ్దానాల వర్షం కురిపించారు. పల్లెలు పచ్చగా కనిపిస్తున్నాయి తప్ప వారి జీవితాల్లో పచ్చదనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులకు చిత్తశుద్ధి లేనందువల్లే ఎరువుల కొరత నెలకొన్నదని ధ్వజమెత్తారు. రైతులకు నాణ్యమైన విత్తనాలతో పాటు అధునాతన యంత్ర పరికరాలను అందుబాటులోకి తేవాలన్నారు.

ఇక యువత గురించి మాట్లాడుతూ, రాష్ట్రంలో లక్షల మంది యువత ఉపాధిలేక కొట్టుమిట్టాడుతున్నారని, దీనికి పాలకుల నిర్లక్ష్యమే కారణమని దుయ్యబట్టారు. ప్రజారాజ్యం అధికారంలోకి వస్తే వారి కోసం కొత్త కోర్సులు రూపొందిస్తుందని పేర్కొన్నారు. చదువు పూర్తయి బయటకు రాగానే ఉపాధి లభించే విధంగా ఆ కోర్సులు ఉంటాయని తెలిపారు. పల్లెల్లో పర్యటించే సమయంలో పదేపదే గ్రామ స్వరాజ్యాన్ని ప్రస్తావించారు.

హైదరాబాదులో పాలకులు నిధులు విడుదల చేయకపోవడంతో స్థానిక పాలకులు అభివృద్ధి చేసుకోలేక చేతులు కట్టేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సమస్యలు గ్రామస్థులకు తెలుస్తాయి తప్ప రాజధానిలో ఉన్న వారికేంతెలుస్తాయంటూ ప్రశ్నించారు. పీఆర్‌పీ అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామ పంచాయతీలకు అందాల్సిన నిధులు, విధులు, అధికారాలు అన్ని విధాలుగా సమకూరే విధంగా చర్యలు తీసుకుంటామని, అదే అసలైన ప్రజారాజ్యమని పేర్కొన్నారు.

Read Full Post »

జై చిరంజీవ…!

శ్రీకాకుళం: ప్రజారాజ్యం అధినేత చిరంజీవి జిల్లా నుంచి ప్రారంభించిన ‘ప్రజా అంకితం’ యాత్రకు జనం నీరాజనం పలుకుతున్నారు. గురు, శుక్రవారాలలో నిర్వహించిన పర్యటనకు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. గురువారం సాయంత్రం అరసవల్లి సూర్యదేవాలయంలో పూజలు నిర్వహించి యాత్ర ప్రారంభించిన చిరంజీవికి జనం నుంచి విశేష స్పందన లభించింది.

గురువారం లాంఛన ప్రాయంగా ప్రారంభమైన యాత్ర శుక్రవారం ఉదయం 9.45 గంటలకు పూర్తిస్థాయిలో ప్రారంభమైంది. శ్రీకాకుళం పట్టణంలో వీ«థులన్నీ జనంతో పోటెత్తాయి. రోడుకు ఇరువైపులా జనంతో కిక్కిరిసి పోయాయి. ఇరువైపులా ఉన్న భవనాలు, ఇతర కట్టడాలు జనంతో నిడిపోయాయి. వయస్సుతో సంబంధం లేకుండా చిరంజీవిని చూసేందుకు ప్రజలు ఆసక్తిగా తరలివచ్చారు. ముఖ్యంగా యువత, మహిళల నుంచి ఆయనకు విశేష స్పందన లభించింది.

చంకలో చంటి పిల్లలతో సహా కొందరు మహిళలు తరలి వచ్చారు. పట్టణంలో పలు చోట్ల మహిళలు చిరంజీవికి మంగళ హారతులు పట్టారు. దీంతో శ్రీకాకుళం పట్టణంలోనే దాదాపు మూడు గంటల పాటు యాత్ర సాగింది. శ్రీకాకుళం నుంచి పలాస వరకు సాగిన యాత్రలో అనేక గ్రామాల్లో పూల వర్షం కురిపించారు. అభిమానులు లారీలలో ఆయన కాన్వాయన్‌ను అనుసరించారు. శ్రీకాకుళం పట్టణ, నర్సన్నపేట, టెక్కలిల్లో జనం ప్రభంజనం సృష్టించారు.

అభిమానులైతే చిరును చూసి పూనకం వచ్చినట్టుగా ఊగిపోయారు. పార్టీ స్థాపన తర్వాత తొలి సారిగా పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వచ్చిన చిరంజీవి వారి నుంచి వచ్చిన స్పందనతో పులకించిపోయారు. ప్రజారాజ్యం చారిత్ర అవసరాన్ని వివరిస్తూ, పాలకులపై విమర్శలకు పదును పెట్టారు. అదే సమయంలో అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్న దానిపై హామీలకు గేట్లెత్తారు. చిరంజీవి ప్రసంగం ఆద్యాంతం పార్టీ స్థాపనకు గల కారణాలు, పాలకులపై విమర్శనాస్త్రాలు, తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తాం అన్న దానిపైనే సాగింది. గద్దెనెక్కి గద్దాల్లా మారారంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

నాలుగేళ్ల క్రితం నాలుగెకరాలు ఉన్న వారు నేడు వందల ఎకరాలకు యజమానులయ్యారంటూ అవినీతి విశృంకలత్వంపై విరుచుకుపడ్డారు. ప్రజల ఆస్తులకు ధర్మకర్తలుగా ఉండాల్సిన వారు దోచుకుతింటున్నారంటూ మండిపడ్డారు. స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ వలసలపై ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని వనరులుండీ ఇంతే గతంటూ పాలకుల తీరును ప్రశ్నించారు. తనకు రాజకీయ అనుభవం లేదన్న విమర్శలకు ఘాటైన సమాధానం ఇచ్చారు.

రాజకీయం నేర్చుకోవాలంటే యూనివర్సిటీలలో చదవాల్సిన అవసరం లేదని, అదే బ్రహ్మ విద్య కాదని, పట్టాపుచ్చుకోవాల్సిన అవసరం అంతకంటే లేదంటూ చిరంజీవి ఇచ్చిన సమాధానానికి జనం నుంచి మంచి స్పందన వచ్చింది. యువత, రైతులు, మహిళలను ప్రధానంగా తన ప్రసంగంలో పదేపదే ప్రస్తావించడం ద్వారా ఆయా వర్గాలలో చెరగని ముద్ర వేసే ప్రయత్నం చేశారు. రాజకీయాలంటే వ్యాపారం కాదని, బాధ్యత అని గుర్తు చేశారు. పల్లెల్లో పర్యటించే సమయంలో గ్రామ స్వరాజ్యాన్ని తెస్తామంటూ పదే పదే ప్రకటించారు.

ప్రసంగం పూర్తయిన ప్రతి చోట ప్రజారాజ్యానికి ప్రజల చేత జై కొట్టించారు. ఇక చిరంజీవి పార్టీ పట్ల యువత నుంచి విశేష స్పందన వ్యక్తమైంది. అదే సమయంలో మధ్య, ఆపై వయస్సు వారిలో కూడా ఒక ఛాన్స్‌ ఇవ్వాలన్న ధోరణి కనిపించింది. ఇప్పటి వరకు కాంగ్రెస్‌, టీడీపీలకు వేశాం ఈ సారి అన్నయ్య వచ్చాడు కదా అన్నది యువత సమాధానమైతే. ఆ రెండు పార్టీలు చూశాం.. ఈ సారి ఈయన్ను చూద్దాం అన్న భావన మధ్య, వయస్సు మళ్లిన వర్గాల్లో ప్రధానంగా కనిపించింది.

Read Full Post »

న్యూఢిల్లీ: నానో ప్రాజెక్టును గుజరాత్‌కు తరలించి, బీజేపీకి సహకరించేందుకు తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ ఆందోళన చేశారని సీపీఎం విరుచుకుపడింది. బీజేపీకి అత్యంత విశ్వాసపాత్రురాలైన ఆమె నరేంద్ర మోడీకి సహకరించేందుకు బెంగాల్‌ నుంచి నానో ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టారని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి దుయ్యబట్టారు.

పార్టీ అధికార పత్రిక ‘పీపుల్స్‌ డెమొక్రసీ’ సంపాదకీయంలో మమతా బెనర్జీపై ఆయన నిప్పులు కక్కారు. నానో తరలింఫునకు మమత ఎటువంటి రాజకీయాలు చేశారో రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు కూడా అటువంటి రాజకీయాలు అవసరమని అన్నారు. నానో ప్రాజెక్టుకు అవసరమైన రక్షణ కల్పించినప్పటికీ టాటాలు బెంగాల్‌ నుంచి తరలి వెళ్లడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇదిలా ఉంటే టాటా కంపెనీ తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని కోరుతూ ‘నానో బచావో కమిటీ’ పేరుతో సింగూర్‌లో శుక్రవారం ధర్నా నిర్వహించారు.

నానోను సింగూర్‌ నుంచి తరలించాలనే ప్రతిపాదనను టాటాలు పునః సమీక్షించుకుంటారనే ఆశతోనే ఈ ధర్నా చేస్తున్నట్లు కమిటీ ప్రతినిధి ఒకరు తెలిపారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ భయానక పరిస్థితులు సృష్టించడం వల్లే ఇంతకు ముందు ఆందోళన చేయలేకపోయామని, 90 శాతం పనులు పూర్తయ్యాక టాటాలు ఇటువంటి నిర్ణయం తీసుకుంటారని అనుకోలేదని ఆ ప్రతినిధి పేర్కొన్నారు.

Read Full Post »

న్యూఢిల్లీ: ఓటుబ్యాంకు రాజకీయాలతో యూపీఏ ప్రభుత్వం దేశాన్ని తప్పుదారి పట్టిస్తోందని బీజేపీ ప్రధాని అభ్యర్థి ఎల్‌కే అద్వానీ విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం సకారాత్మక పునర్నిర్మాణ వైఖరి స్థానంలో తప్పుడు దారిలో పయనించడం దురదృష్టకరమని ఆయన అభివర్ణించారు. ఈశాన్య భారతంలో బంగ్లాదేశీయుల వలసలు, ఒరిస్సా, కర్ణాటకల్లో క్రైస్తవులపై దాడులకు సంబంధించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

బంగ్లాదేశ్‌ అక్రమ వలసలపై, ఈ అంశాన్ని పరిష్కరించడంలో ప్రభుత్వ వైఖరిపై సుప్రీంకోర్టు కూడా తీవ్రంగా స్పందించిందని, అయినా ఆర్టికల్‌ 355 కింద అంతర్గత సమస్యలు, బయటి దాడి నుంచి రాష్ట్రాల్ని కాపాడడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. “ఓటుబ్యాంకు రాజకీయాల కారణంగా మనల్ని మనమే వంచించుకుంటున్నాం. స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకుని ఈ వంచనపై మనమెందుకు చర్యలు తీసుకోవడం లేదు. మనల్ని మనమే మోసగించుకోవడం ప్రస్తుతం ఓ విధానంగా, హ్యాబిట్‌గా మారిందా?” అని ఆయన ప్రశ్నించారు.

యూపీఏ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఇండియా ఫస్ట్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. లౌకిక, బహుతా వాదాలను హిందూ మతం ఆమోదిస్తుందని, మతతత్వ పాలనను తిరస్కరిస్తుందని, అందుకే భారత్‌ విజయవంతమైన ప్రజాస్వామ్యంగా ఆవిర్భవించిందని చెప్పారు.

అమర్‌సింగ్‌ నియామకంపై అభ్యంతరం జాతీయ సమగ్రతా మండలి (ఎన్‌ఐసీ) సభ్యుడిగా ఎస్పీ నేత అమర్‌సింగ్‌ను నియమించడంపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తన అనాలోచిత చర్యల ద్వారా సమాజ విచ్ఛిన్నానికి, దేశంలో అశాంతికి కారణమవుతున్న వ్యక్తిని ఎన్‌ఐసీ సభ్యుడిగా ప్రధాని నియమించడం దురదృష్టకరమని ఆ పార్టీ అధికార ప్రతినిది ప్రకాశ్‌ జవదేకర్‌ అన్నారు.

Read Full Post »

హైదరాబాద్‌: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి కొణిజేటి రోశయ్యతో శ్రీలంక పర్యాటక శాఖ మంత్రి మిలిందా మరగూడ, ఆ దేశ హైకమిషనర్‌ సిీఆర్‌ జైసింగీ శుక్రవారం సచివాలయంలోని ఆయన ఛాంబర్‌లో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా ఇరు దేశాల రాజకీయ, సామాజిక అంశాలు వారి మధ్య చర్చకు వచ్చాయి.

సుమారు అరగంట సేపు ఇరు దేశాలకు సంబంధించిన వివిధ అంశాల గురించి చర్చించిన తర్వాత శ్రీలంక పర్యటనకు రావలసిందిగా మంత్రి రోశయ్యను వారు ఆహ్వానించారు. వారి ఆహ్వానం పట్ల రోశయ్య సుముఖత వ్యక్తం చేశారు. అనంతరం లంక మంత్రి, హై కమిషనర్‌ టీడీపీ అధ్యక్షులు నారా చంద్రాబాబు నాయుడును ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌లో కలిశారు.

Read Full Post »

విజయనగరం: పార్వతీపురం మండల సరిహద్దుకు సమీపంలోని ఒరిస్సాలో కోరాపుట్‌ జిల్లా బందుగాం బ్లాక్‌ ములిగుడ సమీపంలో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టు దళ సభ్యులు మృతి చెందారు. మృతి చెందిన వారిలో ఒకరు మహిళా మావోయిస్టు. కూంబింగ్‌కు వెళ్లిన ఒరిస్సా-ఆంధ్రా పోలీస్‌ పార్టీ సభ్యులకు మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో వీరు మరణించినట్లు పోలీసు వర్గాలు చెపుతున్నాయి.

ఈ కాల్పుల్లో వంద రౌండ్లు వినియోగించినట్లు తెలిసింది. మావోయిస్టులకు చెందిన తుపాకీ కూడా పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. మృతదేహాలను ట్రాక్టర్‌లో పోస్టుమార్టం నిర్వహించేందుకు తరలించారు. కోరాపుట్‌ దళ కమాండర్‌గా ఉన్న నిర్మలక్కను అలమండ వద్ద గతంలో ఎన్‌కౌంటర్‌ చేశారు. ఇదే దళానికి చెందిన ఇద్దరు సభ్యులను తాజాగా పోలీసులు మట్టుపెట్టారు. ఇది మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బగా పోలీసు వర్గాలు చెపుతున్నాయి.

Read Full Post »

హైదరాబాద్‌: తమతో కలిసి రావడానికి ప్రజారాజ్యం పార్టీకి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు డెడ్‌లైన్‌ పెట్టారు. అదీ కేవలం రెండు రోజులు మాత్రమే. ఈ నెల 12, 13 తేదీల్లో కోల్‌కతాలో తమ పార్టీ కేంద్ర కమిటీ సమావేశాలు జరగనున్నాయని..అంతకు ముందే పార్టీ విధానాలపైన ప్రజారాజ్యం స్పష్టమైన ప్రకటన చేయాలని అన్నారు. దాన్ని బట్టి కేంద్ర కమిటీ సమావేశాల్లో ఆ పార్టీతో సర్దుబాట్లపైన చర్చిస్తామని ప్రకటించారు.

పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్‌లో శుక్రవారంనాడు ఆయన విలేకరులతో మాట్లాడారు. బీజేపీ, అణుఒప్పందం తదితర అంశాలపై ఆ పార్టీ స్పష్టమైన వైఖరి వెల్లడించాలని గతంలో అనేక సందర్భాల్లో పేర్కొన్నామన్నారు. తమతో ఆ పార్టీ అధికార ప్రతినిధి మిత్రా కలిసినప్పుడూ అదే ప్రతిపాదన పెట్టామని చెప్పారు. దానిపై ఇంతవరకు వారు స్పందించలేదన్నారు.

రాష్ట్ర కమిటీ సమావేశాలకు పరిశీలకునిగా వచ్చిన తమ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కరత్‌ కోల్‌కతాలో జరిగే కేంద్ర కమిటీ సమావేశంలో సర్దుబాట్లపైన చర్చించి ఒక నిర్ణయానికి వస్తామని ప్రకటించిన సంగతి గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను ఓడించడమే తమ లక్ష్యమని, అందుకు కలిసి వచ్చే లౌకిక పార్టీలతో సహకరిస్తామని పునరుద్ఘాటించారు.

తీర్మానం అడ్డుకాదు
తెలంగాణపైన టీడీపీ తీర్మానం కాంగ్రెస్‌ను ఓడించాలనే లక్ష్యానికి అడ్డుకాబోదన్నారు. కాంగ్రెస్‌ను ఓడించడానికి తాము టీఆర్‌ఎస్‌తోనూ కలిసి వెళ్లాలనే ఆలోచనకు వచ్చిన సంగతి గుర్తు చేశారు. ప్రస్తుతం తెలంగాణ అంశాన్ని ద్వితీయ స్థానానికి దించి కాంగ్రెస్‌ను ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.

Read Full Post »

హైదరాబాద్‌: నవతెలంగాణ ప్రజా పార్టీ(ఎన్టీపీపీ) అడహాక్‌ కమిటీని ఆ పార్టీ వ్యవస్థాపకుడు తూళ్ల దేవేందర్‌గౌడ్‌ శుక్రవారం మధ్యాహ్నం ప్రకటించారు. తను అధ్యక్షుడుగా, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి కన్వీనర్‌గా 30 మందితో కమిటీని ప్రకిటించారు. పార్టీ అధికార ప్రతినిధులుగా వి.ప్రకాశ్‌, సి.విఠల్‌, నర్రా రవికుమార్‌, సలహా మండలి సభ్యులుగా దేశిని చిన మల్లయ్య, స్వామినాథం, వై.జైహింద్‌రెడ్డి, మేచినేని కిషన్‌రావులను నియమించారు.

ఎన్టీపీపీ రాష్ట్ర కమిటీ సభ్యులుగా మల్యాల రాజయ్య, పి.నిరూప్‌రెడ్డి, బండ్రు శోభారాణి, కటకం నర్సింగ్‌రావు, టి.రాజు, శంకర్‌ ముదిరాజ్‌, దాత్రిక్‌ విఠల్‌, ఎంఏ ఫహీమ్‌, ఊషన్న, జి.సదానందం, మాజీ ఎమ్మెల్యే బండి పుల్లయ్య, సీకే మహేశ్‌గౌడ్‌, టి.సారంగపాణి, చలకాని వెంకన్న యాదవ్‌, మతిన్‌ ముజాహిదీ, ఎండీ అల్తాఫ్‌ హుస్సేన్‌, ఎన్‌.తిరుపతిరావు, డి.అంజలీ గౌడ్‌, ఎన్‌.సత్యనారాయణ, రాజేశ్‌ నాయక్‌, శ్రీమతి అమరావతి, పి.అంజిబాబు, డి.పరమేశ్వర్‌రెడ్డి, ఎర్ర జాన్సన్‌, వి.విఠల్‌, సారబుడ్లె ప్రభాకర్‌రెడ్డి, డి.సుధాకర్‌, మరప లింగుబాబు ఉన్నారు.

కమిటీ తొలి సమావేశం ఆదివారం జరగనుంది. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సాధన, భవిష్యత్‌ కార్యాచరణ, ఇటీవల నిర్వహించిన తెలంగాణ ఆత్మగౌరవ యాత్ర తదితర అంశాలపై కూలంకషంగా చర్చించనున్నారు. తెలంగాణ శక్తుల ఏకీకరణపై శనివారం ఉదయం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి తెలంగాణ పార్టీలు, ఉద్యమ సంస్థలను ఆహ్వానించినట్టు దేవేందర్‌గౌడ్‌ చెప్పారు.

Read Full Post »

తిరుమల: కర్ణాటక రాష్ట్ర రెవెన్యూ మంత్రి గాలి కరుణాకరరెడ్డి తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వరునికి బంగారు పాదాలను సమర్పించారు. రూ.60 లక్షల విలువైన ఈ పాదాలు 3.6 కేజీల బంగారంతో తయారు చేశారు. తిరుమల ఆలయంలో గురువారం రాత్రి జరిగిన ఓ కార్యక్రమంలో ఈ స్వర్ణ పాదాలను మంత్రి దంపతులు టీటీడీ ఛైర్మన్‌ ఆదికేశవులునాయుడుకు అందజేశారు. వీటిని మూలవర్లకు అలంకరిస్తారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో రమణాచారి, స్పెషల్‌ ఆఫీసర్‌ ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read Full Post »

Older Posts »