Feeds:
టపాలు
వ్యాఖ్యలు

Archive for అక్టోబర్ 24th, 2008

వియాన్నా: అంతర్జాతీయంగా ముడి చమురుకు డిమాండ్‌ తగ్గడంతో ఉత్పత్తిని తగ్గించాలని శుక్రవారం చమురు ఎగుమతి దేశాల సమాఖ్య (ఒపెక్‌) నిర్ణయించింది. ఈ మేరకు నవంబర్‌ 1 నుంచి రోజుకు 1.5 మిలియన్‌ బ్యారళ్ళ ఉత్పత్తి తగ్గించాలని ఒపెక్‌ దేశాలు ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించాయి. అయితే 62 డాలర్లకు క్షీణించిన బ్యారల్‌ ధరల్లో మార్పులేవీ లేవని ఒపెక్‌ సమాఖ్య స్పష్టం చేసింది.  అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం కారణంగా చమురు ధరలు గణనీయంగా క్షీణించడంతో చమురు ఎగుమతి దేశాల సమాఖ్య (ఒపెక్‌) వియాన్నాలో అత్యవసరంగా సమావేశమైంది. మూడు నెలల క్రితం 147 డాలర్ల ఆల్‌ టైం హైకు చేరుకున్న చమురు ధరలు రెండేళ్ళ కనిష్ట స్థాయికి చేరుకోవడంతో ఉత్పత్తిని తగ్గించాలని సభ్య దేశాలు తీర్మానించాయి. ఈ పరిణామం స్టాక్‌మార్కెట్లపై మరింత ప్రభావం చూపే అవకాశమున్నది.

Read Full Post »

కౌలాలంపూర్‌: హిమాచల్‌ ప్రదేశ్‌లో నిర్మించనున్న హైడ్రో పవర్‌ ప్లాంట్‌కు ఆసియా అభివృద్ధి బ్యాంకు 800 బిలియన్‌ డాలర్ల రుణాన్ని మంజూరు చేసింది. 8 సంవత్సరాల కాలపరి మితి గల ఈ రుణంపై నామమాత్రపు వడ్డీ చెల్లిస్తే సరిపోతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నా యి. అయితే 808 మెగావాట్ల సామర్థ్యంతో నెలకొల్పనున్న ఈ పవర్‌ ప్లాంట్‌ ప్రాజెక్టులకు 1.5 బిలియన్‌ డాలర్ల వ్యయం అవుతుందని ప్రభుత్వం వివరిస్తోంది.  మిగిలిన అవసరమైన మొత్తంలో, 450 మిలియన్‌ డాలర్లను స్వయంగా ప్రభుత్వం కేటాయిస్తే, మరో 250 మిలియన్‌ డాలర్లను రుణాల ద్వారా సేకరిస్తారు. హిమాలయ పర్వత ప్రాంతాల్లో హైడ్రో పవర్‌ ప్లాంట్ల నిర్మాణం నెలకొల్పడం అంత సులభమైన విషయం కానప్పటికీ, దేశంలో 25 శాతం విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ప్లాంట్‌లు ఇక్కడ ఉన్నాయి. అయినా డెవలప్‌మెంట్‌ లేకపోవడంతో కనీస అవసరాలకు కూడా విద్యుత్‌ కరువవుతోంది.

Read Full Post »

మండపేట: తూర్పగోదావరి జిల్లా మండపేట మండలం కేశవరం-కడియం మధ్య శుక్రవారం జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. కేశవరం-ఆఫ్‌లైన్‌ ట్రాక్‌పై పట్టా విరిగడంతో విశాఖపట్నం నుంచి సికింద్రాబాదు వెళ్లే జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ను అరగంట పాటు ద్వారపూడి రైల్వేస్టేషన్‌లో నిలిపివేశారు. కడియం పేపరు మిల్లు సమీపంలో రైల్వే లైనుకు పట్టా విరిగి వుండటం గమనించిన కీ మేన్‌ కె.వెంకటమల్లయ్య రైల్వే అధికారులను అప్రమత్తం చేశాడు.  పట్టాల తనిఖీలో భాగంగా కడియం నుంచి కేశవరం స్టేషన్ల మధ్య వెంకట మల్లయ్య శుక్రవారం రైల్వేలైను పరిశీలి స్తుండగా పట్టా విరిగిన విషయాన్ని గుర్తించాడు. వెంటనే ద్వారపూడి స్టేషన్‌ మేనేజరుకు విషయాన్ని తెలియజేయటంతో అప్రమత్తమైన అధికారులు జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ను ద్వారపూడిలో నిలిపివేశారు. రైల్వే అధికారులు తమ సిబ్బందితో పట్టా విరిగిన ప్రదేశానికి చేరుకుని విరిగిన పట్టాలకు ఫిష్‌ ప్లేట్స్‌ వేసి రైల్వేలైన్‌ను పునరుద్ధరించారు.  ఉదయం గం.8.30లకు ద్వారపూడి చేరుకున్న జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ తొమ్మిది గంటలకు బయలు దేరింది. గ్యాంగ్‌మేన్‌ ముందుగా పట్టా విరిగిన విషయాన్ని గుర్తించకుంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని రైలు ప్రయాణికులు ఉత్కంఠకు లోనయ్యారు. నిత్యం రద్దీగా ఉండే రైల్వేలైనులో పట్టా విరగడంతో కొంతసేపు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.  పట్టా విరిగిన విషయాన్ని గుర్తించిన వెంకట మల్లయ్యను పలువురు అభినందించారు. ప్రమాదం నుంచి గట్టెక్కించిన మల్లయ్యను ప్రయాణికులు ప్రశంసించారు. శుక్రవారం ఉదయం విధి నిర్వహణలో ఉన్న తాను కడియం పేపరుమిల్లు వద్ద విరిగిన పట్టా విషయాన్ని గుర్తించి అధికారులను అప్రమత్తం చేశానని మల్లయ్య తెలిపాడు. ద్వారపూడి రైల్వే జె.ఇ. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సిబ్బంది ట్రాక్‌ను పునరుద్ధరించారు.

Read Full Post »

మహబూబ్‌నగర్‌‌: మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌లోని పంచాయతీరాజ్‌ ఎఇ కార్యాలయంపై శుక్రవారం ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు. ఇక్కడ పంచాయతీరాజ్‌ ఎఇగా పనిచేస్తున్న సుధాకర్‌కు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఫిర్యాదు మేరకు ఎసిబి ఏకకాలంలో హైద్రాబాద్‌లోని సరూర్‌నగర్‌లోగల ఆయన ఇంటిపై దాడులు నిర్వహించింది. దీంతోపాటు మెదక్‌ జిల్లాలోని జోగిపేటలో గల ఆయన స్వగృహంపై, మహబూబ్‌నగర్‌లోని ఆయన మామ ఇంటిపై, షాద్‌నగర్‌లోని పంచాయతీరాజ్‌ కార్యాలయంపై దాడులు నిర్వహించారు.  శుక్రవారం ఉదయమే ఎఇ ఇంటిపై ఎసిబి అధికారులు దాడులు నిర్వహిస్తున్నారన్న సమాచారం పట్టణంలో వ్యాపించింది. దీంతో కొందరు అధికారులు ఆందోళనపడ్డారు. అయితే ఎసిబి డిఎస్‌పి రాధాకృష్ణ నేతృత్వంలో ఎసిబి ఇన్‌స్పెక్టర్లు టి.ఎస్‌. వెంక టరమణ, ప్రసాద్‌రావుతో పాటు సిబ్బంది గోపాల్‌రావు, రఘు, బేగ్‌, మద్దిలేటి మండల పరిషత్‌ కార్యాలయంలోని పంచాయతీ రాజ్‌ ఎఇ సుధాకర్‌ చాంబర్‌లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. చాంబర్‌లోని బీరువాలను బద్దలు కొట్టి పలు ఫైళ్ళను పరిశీలించారు.  అనంతరం ఎసిబి ఇన్‌స్పెక్టర్‌ టిఎస్‌ వెంకటరమణ విలేకరులతో మాట్లాడుతూ పంచాయతీరాజ్‌ ఎఇ సుధాకర్‌పై ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని తమకు ఫిర్యాదు అందిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఏకకాలంలో నాలుగు చోట్ల దాడులు నిర్వహించామని తెలిపారు. హైద్రాబాద్‌లోని సరూర్‌నగర్‌లో గల ఆయన ఇంటిపై తమ శాఖకు చెందిన అధికారులు దాడులు నిర్వహించగా లక్షా 25వేల నగదు, 90 తులాల బంగారం లభ్యమైందని తెలిపారు. అలాగే బ్యాంకు లాకర్‌లో మరో 20 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.  అంతే కాకుండా పలు ప్రాంతాల్లో ప్లాట్లకు సంబంధించి కొన్ని డాక్యుమెంట్లు కూడా లభ్యమైనట్లు వివరించారు. హైద్రాబాద్‌ పరిసరాల్లో పది నుంచి 20 ఎకరాల భూమి ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. మహబూబ్‌నగర్‌లో నివాసముంటున్న సుధాకర్‌ మామ, న్యాయవాది ఉమాపతి ఇంటి లో కూడా సోదా చేసినట్లు తెలిపారు. ఆయన ఇంట్లో సుధాకర్‌కు సంబం«ధంలేని నాలుగు డాక్యుమెంట్లు లభించాయని వివరించారు. సుధాకర్‌ పనిచేసే షాద్‌నగర్‌ పంచాయతీరాజ్‌ ఎఇ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించగా ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని వివరించారు.  అయితే సుధాకర్‌కు ఆదాయాన్ని మించి ఆస్తులున్నాయన్న ఆరోపణతోనే ఈ దాడులు నిర్వహించినట్లు వెంకటరమణ వెల్లడించారు. ఎసిబి దాడులతో బెంబేలెత్తిన అధికారులు హైద్రాబాద్‌లో నివాసముంటున్న పంచాయతీరాజ్‌ ఎఇ సుధాకర్‌ ఇంటిపై ఎసిబి అధికారులు దాడులు నిర్వహిస్తున్నారన్న వార్త శుక్రవారం ఉదయం తెలియగానే స్థానిక పంచాయతీ రాజ్‌ ఎఇ కార్యాలయంలో సిబ్బందిలే క వెలవెలబోయింది. ఉదయం 10.00 గంటల ప్రాంతంలో ఏ ఒక్క అధికారి కూడా విధులకు హాజరుకాలేదు. కుర్చీలన్నీ ఖాళీగా కనిపించాయి.

Read Full Post »

గుంటూరు: గుంటూరులో నందమూరి అభిమానులు శుక్రవారం నిర్వహించిన ర్యాలీకి అనూహ్యస్పందన లభించింది. జిల్లా నలుమూలల నుంచి వేల సంఖ్యలో అభిమానులు స్వచ్చందంగా తరలి వచ్చారు. నాలుగు కిలోమీటర్లపాటు సాగిన ర్యాలీకి అడుగడుగునా అభిమానులు నీరాజనాలు పలికారు. నందమూరి తారకరత్నను చూసేందుకు అభిమానులతో పాటు ప్రజలు ఎగబడ్డారు. బస్టాండ్‌ దగ్గరలోని ఎన్టీఆర్‌ విగ్రహం నుంచి మాయాబజార్‌, జిన్నాటవర్‌, మార్కెట్‌ సెంటర్‌, ఏసి కళాశాల, శంకర్‌విలాస్‌, లక్ష్మీపురం మీదుగా బృందావన్‌ గార్డెన్స్‌ వరకు ర్యాలీ నాలుగు గంటల పాటు సాగింది.  ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బాణాసంచా కాలుస్తూ యువకులు కేరింతలు కొట్టారు. బాలకృష్ణ, ఎన్టీఆర్‌ల డూప్‌లు ర్యాలీ అగ్రభాగాన నిలిచారు. రోడ్లన్నీ కిక్కిరిసి పోయాయి. పెద్ద ఎత్తున ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఊహించని విధంగా అభిమానులు తరలిరావడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం తొణికిసలాడింది. ఈ ర్యాలీ మినీ యువగర్జనను తలపించింది.  ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంపై నిలిచిన తారకరత్న దారి పొడవునా అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. పెద్ద సంఖ్యలో మహిళలు రోడ్డుపక్కన బారులు తీరి ఆయనను చూసేందుకు ఉత్సాహం చూపారు. కార్యక్రమంలో నందమూరి అభిమాన సంఘాల ఐక్య వేదిక నాయకులు అన్నాబత్తుని శ్రావణకుమార్‌, పుల్లా సుందరం బాబు, మద్ది రామకృష్ణ, పులివర్తి అజార్‌, సుకవాసి శ్రీనివాస్‌, దారపనేని నరేంద్ర, నలబోలు విష్ణు, నార్నె శ్రీనివాసరావు, పులివర్తి కార్తీక్‌, ఉదారపు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.  తెలుగుయువత నేతతో అభిమానుల ఘర్షణ… జిల్లా తెలుగుయువత అధ్యక్షుడు బోనబోయిన శ్రీనివాస్‌తో నందమూరి అభిమానులు ఘర్షణకు దిగారు. ఆయనకు రెండవ సారి అవమానం జరిగింది. గతంలో ఓసారి అభిమానులు నిర్వహించిన ర్యాలీలో సంబంధం లేకపోయినా చివరలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేసి కార్యక్రమాన్ని హైజాక్‌ చేశారంటూ అభిమానులు గొడవ పడ్డారు. తాజాగా శుక్రవారం తారకరత్న ఎదుటే శ్రీనివాస్‌పై అభిమానులు విరుచుకు పడ్డారు.  ఓ దశలో అతనిపై చెయ్యి చేసుకున్నారు. దీంతో ఆయన కూడా అభిమానులను కొట్టారు. దీంతో ర్యాలీలో ఉధ్రిక్త వాతావరణం నెలకొంది. చివరకు అభిమాన సంఘాల నాయకులు జోక్యం చేసుకొని తారకరత్న వాహనంపై శ్రీనివాస్‌ను కూర్చోనివ్వడంతో వివాదం సద్దుమణిగింది. మొదటి నుంచి నందమూరి అభిమానులు, శ్రీనివాస్‌ను తమ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అయినా ఆయన కార్యక్రమాల్లో చొరవ తీసుకోవడం వివాదానికి దారి తీసింది.

Read Full Post »

తారకరత్న శుక్రవారం గుంటూరులో యువగర్జన సదస్సు ఏర్పాట్లను పరిశీలించారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌, మంగళగిరి ఇన్‌చార్జి మాదల రాజేంద్రలు తారకరత్నకు ఘన స్వాగతం పలికారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు మామయ్య చంద్రబాబు, బాబాయ్‌ బాలయ్య రెండు కళ్లలాంటి వారన్నారు. యువగర్జన సదస్సుకు జూనియర్‌ ఎన్టీఆర్‌ తప్పక హాజరవుతారన్నారు. కాబోయే సిఎం బాలకృష్ణ అని తాననలేదని, అదంతా మీడియా సృష్టేనన్నారు. భవిష్యత్తులో బాలయ్య సిఎం అవుతారన్నానని, ఆయన సిఎం కావడం ఖాయమని తారకరత్న స్పష్టం చేశారు.  యువగర్జన సదస్సుకు అనూహ్య స్పందన లభించనుందన్నారు. తెలుగుదేశం పార్టీ విజయం కోసం పార్టీ కార్యకర్తలు, నందమూరి అభిమానులు, యువకులు, ఆడపడుచులు బయటకు వస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ముందు నా కెరీర్‌ ముఖ్యమన్నారు. బాబాయ్‌ బాలకృష్ణ కోసమే రాష్ట్రంలో పర్యటిస్తున్నట్లు చెప్పారు. మా బాబాయ్‌పై అభిమానంతోనే కార్యక్రమాల్లో పాల్గొంటున్నానన్నారు.  నందమూరి కుటుంబమంతా ఆయన వెన్నంటే ఉంటుందన్నారు. బాబాయ్‌ బాలకృష్ణ గర్జన సదస్సు ఏర్పాట్లను పరిశీలించమని ఆదేశించడంతోనే తాను వచ్చానని చెప్పారు. గ్రౌండ్‌లో పనులు చేస్తున్న కూలీలను పలకరించారు. ఈ సందర్భంగా కూలీలు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి రావాలంటూ కోరారు. ఆయన వెంట టిడిపి నాయకులు కొల్లి లక్ష్మయ్య చౌదరి, మన్నవ సుబ్బారావు, అన్నాబత్తుని శ్రావణ్‌ కుమార్‌, సుందరరావు యాదవ్‌ తదితరులున్నారు.

Read Full Post »

కరీంనగర్: రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు లేవనెత్తిన డిమాండ్లు న్యాయ సమ్మతమేననీ, జాక్టో నాయకులను చర్చలకు ఆహ్వానించి సమస్యలు పరిష్కరించాలని ప్రజా యుద్ధ నౌక గద్దర్‌ ముఖ్యమంత్రిని డిమాండ్‌ చేశారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించగా, ఈ ధర్నాకు హాజరైన గద్దర్‌ మాట్లాడుతూ బడిలో పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన గురువులను బజారున పడేయడం ప్రభుత్వానికి తగదనన్నారు.  నాకు, ముఖ్యమంత్రికి చదువులు చెప్పిందే గురువులన్నారు. ఉపాధ్యాయులవి గొంతెమ్మ కోర్కెలు కావనీ, గతంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లిఖిత పూర్వకంగా అంగీకరించిన సమస్యలకు ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్‌ చేయడం అసంబద్ధం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రతిష్టకు పోకుండా సమస్యను చర్చల ద్వారా పరిష్కరించాలని గద్దర్‌ కోరారు. లేనిపక్షంలో గురువులే పాలకులకు తగిన గుణ పాఠం చెబుతారన్నారు.

Read Full Post »

ఆసుపత్రుల్లో అవినీతి.. డాక్టర్ల కరెన్సీ కక్కుర్తి.. ఈ మాటలు వినగానే ఎవరికైనా గుర్తుకు వచ్చేది చిరంజీవి కథానాయకుడిగా నటించిన ఠాగూర్‌ సినిమా… డెడ్‌బాడీకి ఆపరేషన్‌ డ్రామా ప్లే చేసి లక్షల్లో డబ్బు గుంజే కార్పోరేట్‌ మార్క్‌ వైద్యం కళ్లకు కట్టేలా చూపించారా సినిమాలో.. ఐతే మన ఉస్మానియా ధర్మాసుపత్రి వైద్యులేమో తామేం తక్కువ తినలేదన్నట్లు చనిపోయిన వాడికి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ ఇచ్చారు. వారి ఘనతపై ప్రత్యేక కధనం… పేషెంట్లంటే నిర్లక్ష్యం… ఆపరేషన్‌ సమయాల్లో కత్తెర్లు రోగి శరీరంలోనే వదిలివేయడం… ఇవన్నీ హైదరాబాద్‌ ఉస్మానియా ఆస్పత్రికి కొత్తేమీ కాదు. ఇక్కడ శవాలతో వ్యాపారం కూడా గుట్టుగా సాగిపోతోంది. పచ్చనోటు పడేస్తే చాలు శవానికి కూడా ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ ఇచ్చేస్తున్నారు. ఈ వ్యవహారం బయటపెట్టేందుకు టీవీఫైవ్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందం నిఘా పెట్టింది. ఇదే ఆస్పత్రి మార్చురీలో ఉన్న ఓ శవం పేరిట తేలిగ్గా ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ సంపాదించింది. డాక్టర్లు సంతకాలు చేసిన సర్టిఫికెట్‌ పత్రాలు కట్టలకొద్దీ కిందిస్థాయి సిబ్బంది దగ్గర ఉంటాయి. డబ్బులు పడేస్తే ఏ సర్టిఫికెట్‌ కావాలంటే అది చేతికందుతుంది.  ఎలాంటి విచారణ, పరీక్షలు లేకుండానే ద్రువీకరణపత్రాలు ఇచ్చేస్తారిక్కడ. కాకపోతే ప్రతి పనినీ డబ్బుతో లెక్కకడతారు. గౌలిగూడకు చెందిన మహమూద్‌ పేరిట మా బృందం ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ సంపాదించింది. ఇతను కొంతకాలం క్రితం మతిస్థిమితం కోల్పోవడంతో ఇంటివాళ్లు బయటకు గెంటేశారు. ఆ తర్వాత ఫుట్‌పాత్‌పైనే కాలం గడుపుతూ మృతిచెందాడు.  దీంతో అఫ్జల్‌గంజ్‌ పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం డెడ్‌బాడీని ఉస్మానియాకు తరలించారు. ఇవేమీ పట్టని ఉస్మానియా సిబ్బంది మహమూద్‌ ఆరోగ్యంగా ఉన్నట్లు ద్రువీకరించారు. ఆస్పత్రి బయట మా ప్రతినిధితో ఆసుపత్రిలో పనిచేసే ఇద్దరు సిబ్బంది మట్లాడారు. ఈ ఇద్దరిలో ఒకరు మెడికల్‌ రికార్డ్‌ సెక్షన్‌లో పనిచేసే మహ్మద్‌ సర్వర్‌.  మరో వ్యక్తి సత్తార్‌ అలీఖాన్‌. ఫోర్త్‌ క్లాస్‌ ఎంప్లాయ్‌. వీరే ఈ అక్రమాలకు సూత్రధారులు. పచ్చనోటు చూపించగానే వీళ్లు ఏ సర్టిఫికెటైనా ఇచ్చేస్తారు. అందులో డాక్టర్‌ సంతకం ఉంటుంది. ఇక వివరాలు మనమే నింపుకోవాలి. అధికారులేమో అబ్బే మా ఆఫీస్‌లో అలాంటి వాటికి ఛాన్సే లేదని ఢంకా బజాయించి చెబుతున్నారు. పాలకులారా.. చూశారా.. మనవారెంతటి ఘనులో. అన్‌నోన్‌ డెడ్‌బాడీస్‌ను ప్రైవేట్‌ ఆసుపత్రులకు అమ్ముకునే వ్యాపారమే కాదు. చనిపోయిన వారికి ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ ఇచ్చే కౌంటర్‌ను కూడా ఓపెన్‌ చేసి రెండు చేతులా సంపాదించుకుంటున్నారు. మరి ఇదంతా చూసి వైద్యో నారాయణో హరీ అనాలా.. వైద్యో వ్యాపారీ భలా.. అనాలా.

Read Full Post »

కర్నూలు: జిల్లాలో కొనసాగుతున్న మద్యం బెల్టుషాపులను ఎత్తి వేయకపోతే ఎక్సైజ్‌ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మార్కెటింగ్‌, గిడ్డంగుల శాఖా మంత్రి మూలింటి మారెప్ప హెచ్చరించారు. శుక్రవారం కర్నూలు జిల్లా ఆస్పరి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  ఆర్‌ఎంఆర్‌పికన్నా అధిక ధరలకు మద్యం విక్రమాలు జోరుగా సాగుతున్నా ఎక్సైజ్‌ అధికారులు పట్టించుకోవడలేదన్నారు. నెలనెలా ఎక్సైజ్‌ అధికారులు లక్షల రూపాయల ముడుపులు తీసుకుంటున్నట్లు తన దృష్టికి వచ్చిందని వీరిపై నివేదిక తయారుచేసి ముఖ్యమంత్రికి అందజేస్తామన్నారు. రాష్ట్ర సరిహద్దుల వద్ద విజిలెన్స్‌ అధికారుల దాడులు సక్రమంగా లేకపోవడంతో బియ్యం యథేచ్ఛగా అక్రమ రవాణా అవుతుండడంతో ధరలు విపరీతంగా పెరిగాయన్నారు.  టమోటా, కూరగాయల ధరలు తగ్గుముఖం పడుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే శాశ్వత అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టామన్నారు. సమావేశంలో ఆస్పరి జడ్పీటిసి సభ్యుడు మూలింటి బాలక్రిష్ణ, జగన్‌యూత్‌ మండల అధ్యక్షులు రాఘవేంద్ర, గ్రామ సర్పంచ్‌ నారాయణ, ఎంపిటిసి మునెప్ప పాల్గొన్నారు.

Read Full Post »

మాతృభాషతో పాటు హిందీ భాషను నేర్చుకోవాలని పద్మశ్రీ డాక్టర్ ఎం.మోహన్ బాబు విద్యార్థులకు పిలుపునిచ్చారు. సిబిఎస్ఇ అంతర్ పాఠశాలల బాస్కెట్‌బాల్‌ ఛాంపియన్ షిప్ పోటీలను ఆయన తిరుపతిలో ప్రారంభించారు. శ్రీవిద్యానికేతన్ ఇంటర్ నేషనల్ స్కూలు ప్రాంగణంలో పోటీలు ఈనెల 26 వరకు జరుగుతాయి. పదహారు బాలుర, ఐదు బాలికల జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. విజేతలకు జిల్లా ఎస్పీలక్ష్మారెడ్డి బహుమతులను అందచేస్తారని నిర్వాహకులు తెలిపారు.

Read Full Post »

Older Posts »