Feeds:
టపాలు
వ్యాఖ్యలు

Archive for అక్టోబర్ 18th, 2008

భూమి కోసం

హైదరాబాద్: ఈ భూమి కోసమే చరిత్ర నెత్తురోడింది. ఈ భూమి కోసమే మహా యుద్ధాలు జరిగాయి. ఈ భూమి కోసమే భారత రైతాంగం విముక్తి పోరాటాలు నడుపు తున్నది. భూమి చుట్టూ బతుకున్నది. పోరాటమున్నది. చరిత్ర మరిచిపోతే ఇప్పటి ఏలికలనూ ఈ భూమి చుట్టుకునే అవకాశమూ ఉన్నది.

బెంగటిల్లి చచ్చిపోయిండు శంకరయ్య. ఒక మామూలు రైతు. శంకరయ్య పోలేపల్లి బాధితుడు. మళ్ళీ పోలేపల్లి గురించే మాట్లాడాల్సి వస్తున్నది. ఉత్తమాటలే. ఏమీ జరగడం లేదన్నది పోలేపల్లి బాధితుల ఫిర్యాదు. నిజమే ఏమి జరుగుతుంది. చిరంజీవి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు కనుక ఆయనకు సిరిసిల్లలో చే’నేతన్న’లు ఆత్మహత్య చేసుకోవడమూ, పోలేపల్లిలో అన్యాయంగా రైతులను బేదఖలు చేయడం అబ్బురమైపోతున్నది. ఒక సమస్యగానైనా కనబడ్తున్నవి. ఆయన తాజాగా ఉన్నారు కనుక ఇది మాట్లాడ్తున్నారు. కానీ, ఆత్మహత్యలు, నిర్వాసితులు, నేలను తలకిందు చేసి సబ్బండ వర్ణాలకు, కోటొక్క పరిసెకూ బువ్వ పంచిపెట్టే రైతన్నల బలవన్మరణాలు పట్టించుకునేంత పెద్ద సమస్యలు కాదు.

తోలు మందం పెరిగిన రాజకీయవేత్తలు ఎవరి ఊహాస్వర్గాల్లో వాళ్లు తేలియాడుతున్నారు. ఎవరితో పొత్తుపెట్టుకుంటే ఎన్ని సీట్లొస్తాయి. సీపీఐతో, సీపీఎం కలవాలా? చంద్రబాబు తో కామ్రేడ్స్ కత్తు కలపాలా! మధ్యలో టీఆర్ఎస్‌తో ప్రేమ విహారం చెయ్యాలా? బీజేపీ ఏం చెయ్యాలి! కాంగ్రెస్ ఒంటరియేనా! ఇదీ కదనకుతూహలం. ఇదీ పార్టీల ప్రాథమ్యం. సిరిసిల్ల ఉరిశాల అయితేనేమి? ఆకలి చావు చస్తేనేమి? ఆత్మహత్య చేసుకుంటేనేమి? ‘ఎవరి కి పుట్టినవే బిడ్డా అంటే అంగట్ల పుట్టిన అవ్వా’ అన్నట్టు… ఎవరు వాళ్లు. ఎవరి శవాలవి! చివరికి బొందపెట్టడానికి ఊరిలో ఆరుగజాల నేల కరువైందని కన్నీళ్లు పెట్టుకుంటున్న పోలేపల్లి సెజ్ బాధితులను అడుగు.

ఇప్పటికే గోడలు కట్టేసుకుని సెజ్‌లు ప్రారంభించిన చోట, ఉన్న ఎకరమూ కోల్పోయి, పాతికో, పరకో పరిహారంగా వస్తే ఖర్చయిపోయి, చేసేందుకు పనిలేక, సెజ్ లో ఉద్యోగం ఎండమావులై ఖాళీగా చేతులు ముడుచుకు కూర్చున్న సత్యవేడు ప్రాంతాల రైతులనడుగు. ఏమి మిగిలింది చివరకు కొన్ని కన్నీళ్లు… ఎంతకూ తీరని కొంత దుఃఖం. నిర్వాసితులవడం అంటే నీ ఇల్లు నువ్వు ఖాళీ చేయడం. నీ భూమి నుంచి నీ తల్లి వేరు నుంచి నువ్వు వేరుకావడం. నీ వాకిలినుంచి, వాకిలిలో తలలూపే చెట్లనుంచి, పచ్చిక బయళ్లనుంచి, ఒరంజెక్కి, ఒడ్డుపెట్టి, అడుగడుగూ కదం కలిపి, కుళ్లగించి, పెళ్లగించి, చదునుచేసి దున్ని, దోకి, విత్తులేసి, లేలేత మొక్కలొస్తే మురిసిపోయే రైతు జీవితపు అత్యంత అద్భుతమైన జీవన సౌందర్యాన్ని కోల్పోవడం.

సృష్టికర్తలకు భూమినుంచి బేదఖలు కావడానికన్నా పెద్దసమస్య ఉండబోదన్న సమస్య ఈ తైతక్కల, టక్కుటమారాల మాయామోహపు వలలుపన్నే మాటల మూటలు కట్టే రాజకీయ నాయకులకు ఎట్లా తెలుస్తాయి. నిజమే అడ్డపంచె ఎగేసి కట్టినంతమాత్రాన ఎవరైనా రైతు ఆత్మను ఎట్లా పొందగలరు. ప్యాంటు తొడుక్కున్న వాళ్లకు ఎలాగూ ఆ ఆత్మశూన్యము. ఒకవేళ నిజంగానే మన నేతలకు రైతు ఆత్మ ఉంటే ప్రాణంగా ప్రేమించే, ప్రాణంగా భావించే నేలతల్లి నుంచి రైతులను బేదఖలు చేసి, రసాయనాల కంపెనీ లు ఎందుకు పెడ్తారు. భూమి గుండె చప్పుడు వినగలిగిన శక్తి ఉన్నవాళ్లైతే, పర్యావరణ కాలుష్యాలకు విలవిలాడుతున్న నేలతల్లి ఆత్మఘోషను కనకుండా ఎలా ఉండగలరు.

దృశ్యం ఒక్కటే కానీ ఆత్మలు వేరు. పంచెధారి ఒకరు గొంగడిలో నడినగరంలో మీకు గిరిజనుడిలా, గిరిపుత్రుడిగా కనిపించవచ్చుగాక. కానీ ఆయన గిరిపుత్రుడు కాలేడు. ఆయనలో హెటరోడ్రగ్స్, టెట్రాడ్రగ్స్, సిమెంటు కంపెనీలు, స్టీల్ కంపెనీలు, ఓడరేవులు, ఇనుప ఖనిజపు అవశేషాలు, కంప్యూటర్ డబ్బాలు దాగున్నాయి. అంతరంగంలో ఆయనలో రైతాంగాన్ని నేల నుంచి వేరుచేసి హింసించే, బతుకుదెరువును ఊడలాక్కునే ఒక విధ్వంసకారుడు ఉన్నాడు. అమెరికా నుంచో ఆవలి సముద్రాల నుంచో తైతక్కలాడిస్తున్న ‘పెద్దన్న’లూ ఉన్నారు. అదీ సమస్య. అవునూ వచ్చేదా? చచ్చేదా; ఏమొస్తుంది వ్యవసాయంతో ఏమివ్వగలదు సేద్యం. అవునూ భూమిని నమ్ముకుంటే ఏమి వస్తుంది. ఏమీరాదు. పోదు. నిజమే నా? అలాంటి పనికిరాని భూమిని ఏలికలు ఎందుకు లాక్కుంటున్నట్టు. భూమి అంటే తెలుసా! అదొక సృష్టి. ఏమిచ్చినా ఇవ్వకున్నా అది చేతినిండా పనివ్వగలదు. ఏమిచ్చినా ఇవ్వకున్నా బతుకు భరోసా ఇవ్వగలదు.

నోట్లోకి రెండు మెతుకులు ఇవ్వగలదు. లోకానికంతటికీ కొచ్చెటి మెతుకులు ఇవ్వగలదు. ఆ నేలను నమ్ముకున్న రైతుల గురించి మళ్లీ మాట్లాడడం అవసరమే. పోలేపల్లి, సత్యవేడు, కాకినాడ, కడప ఏదీ మినహాయింపు. ఏలికల వి«ధ్వంస ప్రణాళికల విషపు కన్ను పడినమేరా రైతులకు బతుకుల్లో పరుచుకుంటున్న ఎడారులు. జీవం లేని కళ్లల్లో మొలుస్తున్న జిల్లే ళ్లు. అయ్యా! అందరూ వస్తున్నరు. చెబుతున్నం. పోతున్నరు. కానీ మాకు భూమికి బదులు భూమి రాలేదు. ఎట్లా బతకాలో చెప్పండి. అని అడుగుతున్న లంబాడీలకు ఎవరు మాత్రం ఏమివ్వగలరు. నిజమే. కోటి వరాలిచ్చినా వాళ్లభూమికి భూమివ్వడం కిందకు రాదు. చెట్టు ఒక జీవ సంబంధం. మనుషులను పశుపక్షాదులను, మనుషుల మధ్య సంబంధాలను నిర్మించే కూడలి చెట్టు. చెట్టుకింద పంచాయితీలు, చెట్టు చప్టామీద బాతాఖానీలు, దుఃఖాలు, ఊరడిం పులు, ఆవేశాలు, ఆరాటాలు, నవ్వులు, ప్రేమలు, మమకారాలు, ఒక పల్లెకు చెట్టొక జీవన సూత్రం. నిండు బతుకుకు సూచిక. అలాంటి చెట్టూ లేని ఊరిలో ఎక్కడ ఉండమంటారు.

ఏలికలు. సెజ్‌లు పెట్టే చిచ్చు గురించి ఎట్లా చెప్పేది ఈ ఇనుప గుండెల మనుషులకు. కరడుగట్టిపోయి లోహం మాదిరి గడ్డకట్టిపోయిన మనుషులకు చెట్టు, పుట్ట, నేల, ఆవరణం, జీవం నిలపడానికి, నిండు జీవనం తొణికిసలాడడానికి, పల్లె నిర్మాణానికి ఉనికికీ, మనుగడకూ అవసరాలన్న విషయం ఎవరు చెప్పగలగాలి! భూమి అంటే ఏమిటి? అదొక ఎడతెగని బంధం. పుట్టుక నుంచి చావుదాకా మనిషితో వచ్చే బంధం. ఈ భూమి కోసమే చరిత్ర నెత్తురోడింది. ఈ భూమి కోసమే మహా యుద్ధాలు జరిగాయి. ఈ భూమి కోసమే భారత రైతాంగం విముక్తి పోరాటాలు నడుపుతున్నది. భూమి చుట్టూ బతుకున్నది. పోరాటమున్నది. చరిత్ర మరిచిపోతే ఇప్పటి ఏలికలనూ ఈ భూమి చుట్టుకునే అవకాశమూ ఉన్నది. ఇక్కడొక కథ గుర్తుకొస్తున్నది.

ఒక ఇరాక్ రైతు భూమిని తీసుకున్నది ప్రభుత్వం. కోర్టులో కేసు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు, కొండపొడుగు చర్చలూ విన్న రైతు అమాయకంగా ఒక ప్రశ్న అడిగాడు ‘అవునూ నాకు ప్రభుత్వమనే ఒక ‘దాయాది’ ఉన్నట్టు తెలియదే’ అని. ఇప్పుడు పోలేపల్లి బాధితులు అడుగుతున్నారీ ప్రశ్న. వారి భూమిలో ఆ డ్రగ్స్, ఈ డ్రగ్స్ పెట్టుకోవడానికి, ఆ రెడ్డో, ఈ రెడ్డో, ఆ రావో, ఈ రావో మాకేమన్నా ‘దాయాదులా’ అని అడిగేరోజొకటి రాక తప్పుతుందా! ఏలికా! బహుపరాక్.

– అల్లం నారాయణ

Read Full Post »

హైదరాబాద్: పోలేపల్లి సెజ్ పేరిట పేదల నుంచి ప్రభుత్వం లాక్కున్న భూములను తిరిగి వారికి అప్పగించే వరకు తాము పోరాటాన్ని కొనసాగి స్తామని ప్రజాగాయకుడు గద్ధర్ ప్రకటించారు. తాము చనిపోయినా తమ వారసులకు ఈపోరాటాన్ని అప్పగిస్తామని, ముఖ్యమంత్రి వై.ఎస్ స్వయంగా వచ్చి పేదలకు తిరిగి భూములను అప్పగిస్తున్నట్లు ప్రకటించే వరకు ఎవరు అడొడచ్చినా తమ పోరాటాన్ని మాత్రం ఆపలేరని ఆయన పేర్కొన్నారు.

జడ్చర్ల మండలంలోని పోలేపల్లి ఫార్మాసెజ్ బాధితులు నిర్వహిస్తున్న సత్యగ్రహ శిబిరాన్ని గద్ధర్ మంగళవారం సందర్శించారు. బాధితులతో కలిసి సెజ్‌కోసం ప్రభుత్వం తీసుకున్న పచ్చటి భూములు, అందులోని తోటలను పరిశీలించారు. అనంతరం ఫార్మా సెజ్‌లోని అరబిందో ఫార్మా పరిశ్రమ ముంగిట సెజ్ బాధితులతో కలిసి పోలేపల్లి ఫార్మాసెజ్‌కు వ్యతిరేకంగా పాటలు పాడుతూ తనదైన రీతిలో నృత్యాన్ని చేశారు. ఒకవైపు పోలేపల్లి సెజ్ బాధి తుల బాధలను, మరోవైపు భూములను లాక్కోవడంలో ప్రభుత్వం, రాజకీయ నాయకులు చేసిన కుట్రలను ఆయన ఎండగట్టారు. ఈ సందర్బంగానే గద్ధర్ మాట్లాడుతూ పేదలకు ఉండే భూముల్లో వారు సాగుచేసి పంటలు పండిస్తారని, అదే ఫార్మాసెజ్‌లో అరబిందో లాంటి ఫ్యాక్టరీలు విషాన్ని పండిస్తాయని చెప్పారు. భూములు పంటలు పండించడానికి ఇస్తారా? విషాన్ని పండించడానికి ఇస్తారా? అని గద్ధర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. విషం పండించే ఫ్యాక్టరీలకోసం పంటల్ని పండించే పచ్చని పొలాలను నాశనం చేయడం మాన వత్వం అనిపించుకోదని, ఇంతకంటే దుర్మార్గం మరొకటి ఉండదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఫార్మాసెజ్ పేరిట బడుగు వర్గాలకు చెందిన భూములను మాత్రమే ప్రభుత్వం తీసుకుందని, ఇది కావాలని చేసిన పనేనని వ్యాఖ్యానించారు. సెజ్‌లు ఏర్పాటు చేయ డానికి పేదల భూములే తప్పా పెద్దల పొలాలు ఎక్కడా దొరకడం లేదా అని ఎద్దేవా చేశారు. ఎస్సీ, ఎస్టీ, బి.సి, మైనార్టీలకు గతంలో ప్రభుత్వం వారికి జీవనాధారంగా భీడు భూములను ఇచ్చిందని, పేదలు తరతరాలుగా ఆభూముల్లో పంటలు సాగుచేస్తూ ఆ భీడు భూములను తమ శేదంతో తడిపి పచ్చటి పొలాలుగా మార్చుకుంటే వాటిపై కన్నేసి పేదలను అణచివేసే ఉద్దేశ్యంతోనే ఆ భూములను లాక్కున్నారని ఆరోపించారు. ఫార్మాసెజ్ కోసం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూములను తీసుకొని ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్‌కు అప్పగించారని, బాబు సలహాతోనే వై.ఎస్ రాజశేఖరరెడ్డి ఫార్మాసెజ్‌ను ఏర్పాటు చేశారని, ఈ వ్యవహారంలో చంద్రబాబు, వై.ఎస్‌లు కూడబలుకొని ఫార్మాసెజ్ పేరిట పేదరైతుల బతుకుల్లో నిప్పులు పోశారని ఆరోపించారు. ఈభూములను తిరిగి సాధించే వరకు తాము పోరాటాన్ని సాగిస్తామని గద్ధర్ ప్రకటించారు.

తెలంగాణ ప్రాంతానికి చెందిన రచయితలు, కవులు, కళాకారులు, విద్యా ర్థులతో పోలేపల్లి ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. ముఖ్యమంత్రి వై.ఎస్ స్వయంగా వచ్చి పోలేపల్లి పేదలకు భూమి పట్టాలు మళ్ళీ ఇచ్చే వరకు తమపోరు ఆగే ప్రస క్తేలేదని స్పష్టం చేశారు. ‘’ఈ పోరు ఎన్ని వందల ఏళ్ళయినా చేస్తాం.. మేము చచ్చిపోతూ మా పిల్లలకు కూడా ఈపోరు సాగించమని చెబుతా.. మా పిల్లలు, వారి పిల్లలు కూడా ఈపోరు సాగించేలా చూస్తాం.. అనుకున్నది సాధించే వరకు ఎంతకాలమైనా పోలేపల్లి పోరును ఆపే ప్రసక్తే లేదు..’’ అని గద్ధర్ ఈ సందర్బంగా పునరుద్ఘాటించారు. పోలేపల్లి సెజ్ ఉద్యమాన్ని మొదలు పెట్టిన పేదలను ఆయన అభినందిస్తూ వారు మొదలు పెట్టిన ఈ ఉద్యమం తప్పక విజయవంతమవుతుందని, వారి భూములు వారికి వస్తాయని ధైర్యం చెప్పారు. సెజ్ బాధితులు చేస్తున్న సత్యాగ్రహానికి గద్ధర్ సంఫీభావాన్ని ప్రకటించారు. అంతకుముందుగా సెజ్ బాధితులతో కలిసి సత్యాగ్రహ శిబిరంలోనే భోంచేసిన గద్ధర్ అరబిందో ఫ్యాక్టరీ ఎదుట గంటకుపైగా పాటలు పాడుతూ బాధితులతో కలిసి నృత్యం చేస్తూ తమ నిరసనను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో గద్ధర్ తోపాటుగా తెలంగాణ జర్నలిస్టు ఫోరం అధ్యక్షులు పాషం యాదగిరి, తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి నాయకులు ఆకుల భూమయ్య, పోలేపల్లి సెజ్ వ్యతిరేక పోరాట కమిటి నాయకులు మధుకాగుల,సూరేపల్లి సుజాత,తదితరులు పాల్గొన్నారు.

Read Full Post »

(డాక్టర్ దార్ల వెంకటేశ్వరరావు)

గతంలో తెలంగాణా ప్రాంతం నుండి వచ్చిన దళిత కవుల్లో కూడా అంబేద్కర్ భావజాలం కంటే, మార్క్సిస్టు భావాల పట్లే ఎక్కువ మమేకత్వం కనపడేది. కానీ, ఈ మధ్య కాలంలో ఆ ధోరణి కొంచెం కొంచెంగా తగ్గుముఖం పడుతుంది. అంబేద్కరిజమ్పై ఆసక్తి పెరుగుతుంది. స్థానీయతను ఆకాంక్షిస్తూనే, దళితుల ఆత్మగౌరవం అంబేద్కరిజమ్లోనే అంతర్భూతంగా ఉందనే సంగతిని గుర్తిస్తున్నారు.

ఈ నేపథ్యంతో పరిశీలిస్తే, చాలామంది తెలంగాణా దళిత కవులు పరిణామం ఈ దిశగా కొనసాగుతుందని స్పష్టమవుతుంది. ఇటీవల పొన్నాల బాలయ్య ‘ఎగిలి వారంగ’ పేరుతో తన కవితలన్నీ ఒక సంపుటిగా తెచ్చాడు. ‘పొద్దు పొడవాల’నేది ఆ కవితా సంపుటికి పెట్టిన పేరులోని అర్థం. దళిత సమస్యలెలా పరిష్కరించబడాలో, తెలంగాణా సమస్యనెలా పరిష్కరించుకోవాలో, వర్గీకరణ సమస్యనెలా అర్థం చేసుకోవాలో, మార్క్సిస్టు పోరాటాల్ని, ఆ పోరాటాల్లో బలైపోతున్న దళితుల జీవితాన్ని ఎలా బాగుచేసుకోవాలో, ప్రపంచీకరణ నుండి ఎలా రక్షించుకోవాలో, అన్నింటికీ మించి సంస్కృతినెలా కాపాడుకోవాలో వివరించే దిశగా ఆలోచించి ఒక కొత్త ‘పొద్దు పొడవాల’నే ఆకాంక్షను కవి ‘ఎగిలి వారంగ’ లో వ్యక్తం చేశాడు.

శక్తివంతమైన భావాన్ని, అంతేశక్తివంతంగా అందించగలగడమే కవిత్వం చేయడంలో కనిపించే శిల్పం. పొన్నాల బాలయ్య దాన్నింకా సాధన చేయవలసి ఉన్నా, తెలంగాణా పట్ల, ఆ ప్రాంతంలోని దళితుల పట్ల, మొత్తంగా ప్రజల ఆశల పట్ల స్పష్టమైన భావాలున్న కవి. వృత్తిరీత్యా హిందీ పండితుడైనా, తెలుగులో కవిత్వం రాస్తున్నందుకు ముందుగా ఆయన్ని అభినందించాలి. అలాగే, ఆ తెలుగులో కలిసిపోయిన మణి ప్రవాళ భాష గురించీ ఆలోచించమనాలి.

‘ఎగిలి వారంగ’ లో చిన్నప్పుడే చనిపోయిన తండ్రి స్మృతితో కవిత్వం ప్రారంభమౌతుంది. తన బాల్యమెంత విషాదకరంగా సాగిందో ‘ఎగిలివారంగ’ కవిత అనేక దృశ్య చిత్రాలతో చూపిస్తుంది. కవిత అంతా విడివిడిగా పదాలున్నట్లు ఉంటుంది. ఒకదానితో మరొక దానికి సంబంధం లేనట్లుంటుంది. తన బాల్యం కూడా ఒక పద్ధతి ప్రకారం కొనసాగలేదనీ, తనలాంటి వాళ్ళ బాల్యం కూడా అలాగే ఉందని కవి శిల్ప నైపుణ్యంతో చెప్తున్నాడు. ఒక అస్తవ్యస్థత ఆ కవిత నిండా ఉన్నట్లు ఉంటుంది. ఆయన రాసుకున్న జీవిత నేపథ్యం చదివితే, ఆ కవిత బాగా అర్థమవుతుంది. బహుశా దాన్ని అలా చెప్తేనే బాగుంటుందనుకున్నాడేమో!

“అయ్య కొట్టిన తంగెడు కట్ట
సోయి తప్పిన అవ్వ
ఆనిగపు బుర్ర నీళ్ళు….” ఇలా సాగిపోతుందీ కవిత.
తెలంగాణాకే ప్రత్యేకతను తెచ్చే పండగల్లో ఒకటి “బతుకమ్మ”. దీన్నితెలంగాణాలోని కొన్ని ప్రాంతాల్లో దళితులు ఆడడానికి లేదు. ఆ పండగల్లో భాగస్వామ్యం కాలేని అలాంటి తెలంగాణా దళిత బాల్యాన్ని వర్ణిస్తూ…

“అందరు పండుగ మోజులవుంటే
నేను పశుల గాస్తుంటే
డప్పుల చప్పుళ్ళతో
బతుకమ్మను తెచ్చి ఆడుతావుంటే
ఆవలుండి చూసుటే తప్ప
పండుగ జరుపుకున్న పాపాన పోలేదు” (పుట: 20) అని ఆనాడు అందుకోలేని అందమైన బాల్యాన్ని, చేజారిన సంతోషాన్ని గుర్తు చేసుకుంటున్నాడు కవి.

మొదట్లో దళితుల్ని గుర్తించిందీ, చైతన్యం నింపిందీ ఖచ్చితంగా మార్క్సిస్టు సాహిత్యమే. నేటికీ దానిలో అదే మౌలిక భావన ఉంది. అయితే అది పీడిత వర్గదృక్పథంతో చూస్తుంది తప్ప, కుల స్పృహను ప్రధానంగా గుర్తించదు. కానీ, భారతదేశంలో కులమే ప్రధానమవుతుందని దళిత మేథావులు భావిస్తున్నారు. అదే అనేక సమస్యలకికారణమవుతుందని దళిత మేధావుల వాదన. ఆ పునాదిని గుర్తించకుండా కులాన్ని ఉపరితల అంశంగానే వర్గవాదులు గుర్తించడం జరుగుతోంది. మొదట్లో పీడిత వర్గ చైతన్యంతోనే తెలంగాణాలోనూ దళితులు ఆ భావజాల పార్టీల్లో పనిచేశారు. తర్వాత కాలంలో అంబేద్కర్ భావజాలంపై అవగాహన కొస్తున్నారు. దాన్ని కవి వర్ణిస్తూ…

“పగలనక రాత్రనక పశులుగాసి
ప్రపంచానికీ దూరంగా పస్తులుండి
కారడవిలో వింత పశువునై
అడవే నాకు అవ్వ – అయ్య
ఆత్మీయతతో అడవితల్లి ఆదరించింద’నీ గుర్తు చేసుకుంటాడు. అయితే, తర్వాత కాలంలో జరిగిన మోసాన్ని కూడా గుర్తించమంటున్నాడు కవి.
“చెమట చుక్కలతో చెలకదున్నిన
ఎగిలి వారంగ యాతం బోసిన
అలసట ఎరగక అన్ని పండించిన
…………………………………
ఊరు బయటనే అంటరానోన్ని జేసిండ్రు” అని అక్కడ కులాన్ని ఆధారం చేసుకుంటున్నారని, అంతర్గతంగా మార్క్సిస్టుల విధానాన్ని ప్రశ్నిస్తున్నాడు. దళితులకు నాయకత్వాన్ని అందనివ్వని స్థితిని గుర్తు చేస్తున్నాడు. అక్కడా హిందూ భావజాలమే మార్క్సిస్టుల్లో అంతర్భూతంగా పనిచేస్తుందంటాడు. అందుకే దళితులకు
“కనులు తెరిపించే కాంతొకటి వచ్చింది
అంబేద్కరే ఆ కాంతి ” ( పుట: 34) అని స్పష్టంగా అంబేద్కరిజాన్ని ఎలుగెత్తి చాటుతున్నాడు కవి. భూములిప్పిస్తామంటూ పోరాటాలు చేస్తుంటే, పోలిసులు జరిపే కాల్పుల్లో దళితులే ఎందుకు బలవుతున్నారో, ఆ పోరాటానికి నాయకత్వం వహించే వాళ్ళనెందుకు ఆ తూటాలు తాకలేక పోతున్నాయో గుర్తించగలిగామని కూడా స్పష్టంగా ప్రకటిస్తున్నాడు కవి…
“ఎగేసుడు, సగేసుడు ఎనుకనే నిల్చుండుడు
ముందుండి… ముదిగొండలో
అసువులు బాసింది…. అణగారిన వారే” (పుట: 29) అని ముదిగొండలో దళితుల్నే ఎందుకు కాల్చారో, ఆ పోరాటానికి నాయకత్వం వహించిన వారెలా తప్పించుకోగలిగారో చెప్తున్నాడు.

తాను పుట్టి పెరిగిన తెలంగాణా ప్రాంతాన్ని ఒక ప్రత్యేక రాష్ట్రంగా చేసుకుంటే తప్ప, నిజమైన పరిష్కారాలు లభించవనీ, అందుకే అందరూ కలిసికట్టుగా పోరాడమంటూ ప్రత్యేక రాష్ట్రం, ‘తల్లి తెలంగాణా’ కవితల్లో తెలంగాణాలో పాలకుల నిర్లక్ష్యం, స్వార్ధం వల్ల నిస్సారమై పోయిన స్థితిని వర్ణించాడు. “చావు తప్పి లొట్టబోయిన సంస్కృతిని, అస్తి పంజరంలా తయారైన గ్రామాల్ని నేపధ్యంగా చెప్పి, తేనెటీగల్లా కదిలి తెలంగాణా సాధించుకోవాలంటున్నాడు… ‘తెలంగాణ’ కవితలో! “వలస పిట్టలు వాలకుండా/ వడిశెలందుకుందాం/ పర పాలకులు పొలిమేర పారంగ/ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుందాం” అంటున్న పొన్నాల బాలయ్య తన నేలమీద నిలబడి, తన నిజమైన గొంతుతో, ఎలాంటి అస్పష్టతా లేకుండా కవిత్వం రాస్తున్నందుకు అభినందించవలసిందే!

Read Full Post »

(డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్)

ఆకాశంలో ఉండే స్వర్గం గురించీ, కాళ్ళ కింద ఉండే నరకం గురించీ అనాదిగా కాకమ్మ కబుర్లు వింటునే ఉన్నాం. విజ్ఞానం వికసించని యుగంలోమనవాళ్ళు గంధర్వ, ఖేచర, కిన్నెర, కింపురుషుల గురించి చెప్పినట్టే (వీరిలోమానవమాత్రులు కానివారెవరో ఇప్పుడు సరిగా తెలియదు) ప్రపంచ నాగరికత లన్నిటిలోనూ అపోహలుండేవి.

జీవాలంటే ఏమిటో, అవి ఎన్ని రూపాలు ధరించి అంతరించిపోయాయో, ఏయే పరిస్థితుల్లో ఎటువంటి శరీరలక్షణాలు కలిగి ఉంటాయో ఊహించగలిగినది ఆధునిక విజ్ఞానశాస్త్రం ఒక్కటే. కాబట్టి ఇటువంటి చర్చలో బూజుపట్టిన భావనలకు స్థానం ఉండదు.

జీవపరిణామం భూగ్రహం మీద ఎలా జరిగి ఉంటుందో తమకు తెలిసినంత మేరకు అర్థం చేసుకోవడానికి ఆధునిక మానవులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. భూమి రూపొందిన తొలి 100 కోట్ల సంవత్సరాల కాలంలో ఆకాశంనుంచి వచ్చి పడే ఉల్కలూ, భూగోళం లోపల రగులుతున్న మేగ్మా, లావాల వేడిమీ వగైరాల ఉత్పాతాల కారణంగా జీవరాశి ఆవిర్భవించగలిగిన పరిస్థితులు ఏర్పడలేదు. ఆ తరవాత జరిగిన సంఘటనల గురించి శాస్త్రవేత్తలు ఊహించగలిగారు. నిర్జీవ పదార్థానికీ, సేంద్రియ (ఆర్గానిక్‌) పదార్థానికీ తేడా ఉంటుందనీ, తొలి జీవకణాలనేవి పునరుత్పత్తి సాధించగలిగిన జీవరసాయనిక కణాల కలయిక వల్లనే ఏర్పడ్డాయనీ, ఆ విధంగా మొదటగా తయారైన జీవకణాల “సూప్‌” ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎదుర్కుంటూ గత 300 కోట్ల సంవత్సరాలకు పైగా కొనసాగుతూ వస్తోందనీ మనకు తెలుసు. ఇటువంటి కణాలు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో భూమిమీద రూపొంది ఉంటాయని శాస్త్రవేత్తలు ప్రతిపాదిస్తారు.

అలా కాకుండా ఇవి ఆకాశం నుంచి ఉల్కలూ, తోకచుక్కల రూపంలో వచ్చిపడ్డాయనే సిద్ధాంతం కూడా ఉంది. దీన్ని ఫ్రెడ్‌ హోయ్‌ల్‌ అనే బ్రిటిష్‌ శాస్త్రవేత్తా, విక్రమసింఘ అనే సింహళ పరిశోధకుడూ ప్రతిపాదించారు. (మన దేశానికి చెందిన ఖగోళవేత్త జయంత్‌ నారళీకర్‌కు ఫ్రెడ్‌ హోయ్‌ల్‌ గురువు). విశ్వాంతరాళంలో కొన్ని రకాల జీవరసాయనిక కణాలు తేలుతూ ఉంటాయనీ, అవి గడిచిపోయిన యుగాల్లో తక్కిన గ్రహాలమీద రాలినట్టే మన వాతావరణంలోకి ప్రవేశించగా అనుకూల పరిస్థితులవల్ల ఇక్కడ నిలదొక్కుకో గలిగాయనీ వీరి ఉద్దేశం. ఏది ఏమైనా ఒక్కటి మాత్రం నిజం. మన సౌరకుటుంబంలో మరెక్కడా జీవరాశి ఉన్న దాఖలాలు లేవు. భూగ్రహం అనేది మన పాలిట ఒక స్పేస్‌షిప్‌ వంటిది. మనం ఏకాకులం.

మనకన్నా సూర్యుడికి సమీపంలో ఉన్న శుక్రగ్రహం మీద ప్రాణులు ఉండవచ్చని మొదట్లో అనుకునేవారు. అది అసాధ్యమనీ, విషప్రాయమైన కార్బన్‌ డయాక్సైడ్‌ అక్కడి వాతావరణంలో వేడిమి బైటకు రాకుండా భయంకరమైన పరిస్థితులని సృష్టించిందనీ ఆధునిక పరిశోధనవల్ల తెలిసింది. సూర్యుడి సరసనే ఉన్న బుధగ్రహం తన చుట్టూ తాను తిరగదు కనక దాని మీద ప్రాణులు బతికే అవకాశం లేదు. ఎందుకంటే వాతావరణం మాట ఎలా ఉన్నా, ఒక వైపు భరించరాని వేడిమీ, రెండో వైపు విపరీతమైన చలీ ఉంటాయి. శాస్త్రవేత్తలు ఎంతో నమ్మకం పెట్టుకున్న అంగారకుడి మీద కూడా నిరాశే ఎదురయింది. ఎన్ని అంతరిక్ష నౌకలను పంపి అక్కడి మట్టిని పరిశీలించినా ఏమీ లాభం లేకపోయింది. అక్కడి గురుత్వాకర్షణ బలహీనంగా ఉండడంతో వాతావరణం పలచబడిందనీ, ధ్రువప్రాంతాల్లోనూ, నేల కిందా మంచూ, నీరూ ఉన్నప్పటికీ ఉపరితలం మీద మాత్రం, బాక్టీరియా, నాచు మొదలైనవి ఉన్న దాఖలాలు ఏవీ ఇంతవరకూ కనబడలేదు.

అంగారకుడికన్నా సూర్యుడికి దూరంగా ఉన్న గురు, శని గ్రహాలు వాయువుల కుప్పల వంటివి కనక అక్కడ ఉపరితలం అనేదే లేకపోవచ్చు. కానీ బ్రహ్మాండమైన సైజులో ఉన్న ఈ పెద్ద గ్రహాల గురుత్వాకర్షణకు లోబడి వాటి చుట్టూ పరిభ్రమించే అనేక ఉపగ్రహాలున్నాయి. గురుగ్రహానికి అతి పెద్ద ఉపగ్రహమైన గనీమీడ్‌ ఒక మంచుముద్ద వంటిది. సౌరకుటుంబంలో దీనికన్నా పెద్ద ఉపగ్రహం లేదు. దాని చుట్టూ 75 కిలోమీటర్ల మందాన మంచు పేరుకుని ఉంటుంది. మరొక పెద్ద ఉపగ్రహమైన కేలిస్టో కూడా అంతే. ఇంకొక ఉపగ్రహం యూరోపా మీద గడ్డకట్టిన పల్చని ఆక్సిజన్‌ పొర ఉందనీ, మంచు అడుగున నీటి సముద్రాలున్నాయనీ శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారు.

శని చుట్టూ తిరిగే టైటన్‌ కూడా పెద్దదే. నారింజ రంగు మేఘాలు కమ్మి ఉండే ఈ వింత లోకం గురించిన పూర్తి వివరాలు తెలియవు. దీని కేంద్రం సాంద్రమైన రాతితో తయారై ఉండవచ్చు. దానిమీద ఎక్కువ మోతాదులో నైట్రొజెన్‌, కాస్త తక్కువగా ఈథేన్‌, మెథేన్‌, హైడ్రొజెన్‌ సయనైడ్‌, కార్బన్‌ డయాక్సైడ్‌ మొదలైన వాయువులుంటాయనీ, భూమిమీద నీరు ప్రవహించినట్టుగా అక్కడ ఈథేన్‌, మెథేన్‌లు ద్రవరూపంలోనూ, మంచు రూపంలోనూ ఉంటాయనీ అంచనా. అవి ఆర్గానిక్‌ పదార్థాలే కనక విపరీతమైన చలికి తట్టుకోగలిగిన బాక్టీరియా ఏదైనా ఆక్సిజన్‌ బదులుగా వాటిని పీల్చి బతుకుతుందేమో. చెప్పుకోవటానికి ఇదంతా “మన” సారకుటుంబమే అయినా ఈ దూరాలు చాలా పెద్దవి. వాయేజర్‌ అనే కృత్రిమ ఉపగ్రహం సౌరకుటుంబం వెలపలి అంచులకు 27 ఏళ్ళ తరవాత, ఇప్పుడిప్పుడే చేరుకుంది. అది ఏనాటికైనా జీవరాశి ఉన్న సుదూర గ్రహాలకు చేరుకుంటే అక్కడివారికి అర్థం అయే పద్ధతిలో భూమి గురించీ, మనుషుల గురించీ కొంత సమాచారాన్ని సందేశాల రూపంలో అందులో భద్రపరిచి పంపారు.

సూర్యుడివంటి ఇతర గ్రహాలు మన పాలపుంత గేలక్సీలో లెక్కలేనన్ని ఉన్నాయి. వాటిలో కొన్నిటి చుట్టూ భూమిలాగే తగుమాత్రం దూరంలో పరిభ్రమించే గ్రహాలు ఉండే ఉంటాయనీ, వాటిలో కొన్నిటిమీదనైనా జీవరాశి పుట్టుకకు అనువైన వాతావరణం ఉండకపోదనీ శాస్త్రజ్ఞులకు తెలుసు. నిజానికి క్రీస్తుకు పూర్వం ఏడో శతాబ్దపు గ్రీక్‌ తత్వవేత్తలనాటినుంచీ ఇటువంటి ఊహపోహలు ఉంటూనే ఉన్నాయి. క్రీ.శ.1600 ప్రాంతాల ఇలాంటి భావనలను ప్రచారం చేసినందుకుగాను రోమన్‌ మతాధికారులు జియొర్దానో బ్రూనో అనే శాస్త్రవేత్తను సజీవదహనం కూడా చేశారు. ఇరవయ్యో శతాబ్దంలో ఫ్లయింగ్‌ సాసర్ల గురించిన హడావిడి కొంతవరకూ ఇటువంటి నమ్మకాల ఆధారంగానే జరిగింది. అంతరిక్షంనుంచి భూమిమీదికి నిత్యమూ ప్రసారం అవుతూ ఉండే రేడియో తరంగాల ఘోషలో “బుద్ధిజీవులు” బైటినుంచి పంపుతున్న సందేశాలేవైనా ఉన్నాయేమో ననే అన్వేషణ కూడా జరుగుతోంది.

జీవరాశి మాట ఎలా ఉన్నా భూమివంటి గ్రహాలేవైనా అంతరిక్షంలో కనబడుతున్నాయా అనే ప్రశ్నకు గత పదేళ్ళుగా అవుననే సమాధానం లభిస్తోంది. ఇన్ని శతాబ్దాలుగా మనుషులకు ఉన్న ఈ నమ్మకానికి ఇటీవలనే ప్రత్యక్షమైన సాక్ష్యాలు లభించడం మొదలయింది. గ్రహాలు నక్షత్రాల కన్నా బాగా చిన్నవి. అవి స్వయంగా వెలగవు. మహా అయితే నక్షత్ర కాంతిని ప్రతిఫలిస్తాయి. మనకూ ఆ నక్షత్రానికీ ఉన్న దూరంతో పోలిస్తే వాటి మధ్యనుండే దూరం బాగా తక్కువ. అందువల్ల నక్షత్రపు తీవ్రమైన వెలుగులో నిస్తేజమైన గ్రహాన్ని ఇంత దూరాన్నుంచి పసికట్టడం చాలా కష్టం. ఇటువంటి పరిశీలనల్లో మనకు కనబడేదల్లా నక్షత్రపు కదలికలోని కొద్దిపాటి తేడా. దీన్నర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ పనికొస్తుంది. ఒక బరువైన వస్తువుకు తాడు కట్టి ఎవరైనా గుండ్రంగా తిరగడం మొదలుపెడితే వస్తువు పెద్ద వలయాకారకక్ష్యలో తిరుగుతూ ఉంటుంది. వేగంగా తిరుగుతున్న వస్తువును గుంజుతూ తిరుగుతున్న మనిషి కూడా ఉన్నచోటే నిలకడగా నిలవలేక కొద్దిగా చిన్న వృత్తాకార పరిధిలో కదులుతూ ఉంటాడు. తిరుగుతున్న వస్తువుతో పోలిస్తే దానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువ బరువున్న మనిషిమీద వస్తువు ప్రభావం తక్కువగానైనా కనబడుతూనే ఉంటుంది. నక్షత్రం విషయంలో సరిగ్గా ఇలాగే జరుగుతుంది. దాని గురుత్వాకర్షణకు లోబడి గ్రహం ఒకవంక బ్రహ్మాండమైన కక్ష్యలో తిరుగుతూ ఉండగా నక్షత్రం కూడా చిన్నపాటి నాట్యం చేస్తూ ఉంటుంది. దూరం నుంచి చూస్తున్న మనకు ఆ నక్షత్రం కాసేపు చేరువవుతూ, కాసేపు దూరమవుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది. గ్రహం ఆచూకీని పరోక్షంగా పసికట్టేందుకు మనకున్న మార్గం ఇదే.

మనకేసి వస్తున్న రైలు వేస్తున్న కూత హెచ్చు శ్రుతిలోనూ, మనను దాటగానే తగ్గు శ్రుతిలోనూ వినబడడాన్ని డాప్లర్‌ ప్రభావం అంటారు. మనకేసి వస్తున్న రైలుబండి వేగం శబ్దవేగానికి తోడవడంతో ప్రతి సెకండుకూ మన చెవులను తాకే శబ్దతరంగాల సంఖ్య పెరిగినట్టనిపిస్తుంది. హెచ్చు శ్రుతికి కారణం అదే. దూరమవుతున్నప్పుడు రైలుబండి వేగం శబ్దతరంగాల ఫ్రీక్వెన్సీని తగ్గించినట్టవుతుంది. కాంతికిరణాల్లో తక్కువ ఫ్రీక్వెన్సీ గల తరంగాలు ఎర్రగానూ, ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్నవి నీలంగానూ కనబడతాయి. నక్షత్ర కాంతిని స్పెక్ర్టం రూపంలో విశ్లేషించినప్పుడు కనబడే ఈ రంగుల తేడాలవల్ల నక్షత్రం కదులుతోందని మనకు తెలుస్తుంది. ఇటువంటి విశ్లేషణల ద్వారా 250కు పైగా గ్రహాల గురించిన సమాచారం తెలిసింది. ఇవన్నీమన పాలపుంతలోని నక్షత్రాల చుట్టూ తిరుగుతున్నవే. ఇది భౌతికవాదులు నమ్మదగిన సమాచారం; కట్టుకథ కాదు.

Read Full Post »

హైదరాబాద్: సకల మానవ ప్రాకృతిక వనరులనూ పెట్టుబడికి దాసోహం చేయడమే పాలకుల అభివృద్ధి నమూనా. దీనికి ప్రత్యామ్నాయం లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రకృతిని ప్రజల జీవన వనరుగా గుర్తించి , వారి జీవన ప్రమాణాలను క్రమంగా మెరుగుపరిచే దిశగా వారి భాగస్వామ్యంతో దేశ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడం సాధ్యం కాదా?

ప్రైవేట్ పరిశ్రమల కోసం ప్రభుత్వం భూసేకరణ చేయకూడదనీ ఆ ప్రైవేట్ కంపెనీలే రైతుల దగ్గర కొనుక్కోవాలనీ ఒక అభిప్రాయం ప్రచారంలో ఉంది. ప్రభుత్వం తనకు భూసేకరణ చట్టం ఇచ్చిన బలవంతపు భూసేకరణ అధికారాన్ని వినియోగించడం వల్ల తలెత్తుతున్న నిరసన, ఆందోళనల నేపథ్యంలో బలవంతానికి తావులేని ప్రత్యామ్నాయంగా ఇది ముందుకొచ్చింది.

స్వచ్ఛందంగానే కొనుక్కునేటట్టయితే రైతులు అడిగినంత భూమీ ఎందుకు అమ్మేస్తారు? తమకు తెలిసిన ఏకైక జీవితమైన సేద్యాన్ని వదిలిపెట్టి ఎందుకు వెళ్లిపోతారు? కొనుక్కునే వాడికి ఆ భూమి చాలా లాభాల కు భూమిక కాబోతుందని వారికి తెలుసును కాబట్టి ఒకవేళ భూమిని వదిలిపెట్టడానికి సిద్ధపడినా చాలా పెద్దమొత్తం కోరుతారు. ఎక్కడికక్కడ తక్కువ ఖర్చుతో సాగించుకోవాలని చూసే కంపెనీలు దీనికి ఎందుకు సిద్ధపడతాయి? కాబట్టి ప్రభుత్వం ఎక్కడయినా ప్రైవేట్ కంపెనీలే రైతుల నుంచి భూమి కొనుక్కోవాలి-మేం సేకరించం అని ప్రకటిస్తే అక్కడే దో మర్మం దాగి ఉందని సందేహించడం సబబుగా ఉంటుంది. భారీగా పెట్టుబడులు పెట్టి ప్రకృతి వనరులను భారీగా కొల్లగొట్టి భారీగా లాభాల కోసం వేటాడే వ్యవహారంలో వారంతట వారు ఏ ప్రజాతం త్ర సూత్రాన్నయినా గౌరవిస్తారనుకోవడం భ్రమే అవుతుంది. ఈ మర్మం ఏమిటన్నది జార్ఖండ్ రాష్ట్రంలో చూడగలము.

జార్ఖండ్ అపారమైన ఖనిజ సంపద గల రాష్ట్రం. ఇనుము, బాక్సైట్, బొగ్గు, యురేనియంలతో మొదలుపెట్టి అనేక చిన్నతరహా ఖనిజాల దాకా అక్కడ విస్తారంగా దొరుకుతాయి. అయితే ఈ భూమి అధికంగా షెడ్యూల్డు ప్రాంతం. అంతేకాక తమ భూమి మీదికి వచ్చిన తెల్లవారిపైన పోరాటాలు చేసిన పూర్వీకులను ఇప్పటికీ జ్ఞాపకం చేసుకుంటున్న హో, ముండా, ఒరవాన్, సంథాల్ తెగలు అధికంగా నివసించే ప్రాంతం కూడ. అందువల్ల రాజ్యాంగం షెడ్యూల్డు ప్రాంతం లో భూబదలాయింపుల పైన పెట్టిన నియంత్రణనే కాక స్థాని క ఆదివాసుల ప్రతిఘటనను కూడ జార్ఖండ్ ప్రభుత్వం లెక్కలోకి తీసుకోకుండ పారిశ్రామికీకరణ వ్యూహాలు రచించజాల దు. కాగా, అన్ని ప్రాంతాల లాగ జార్ఖండ్‌లోనూ రాజకీయ నాయకులకూ బ్యూరోక్రాట్లకూ సకల బుద్ధిజీవులకూ ఈ ఖనిజ సంపద ‘వృధా’ కాకూడదన్న విశ్వాసం బలంగా ఉంది. దానినంతా వేగంగా వెలికితీసి భారీ పెట్టుబడులు జత చేసి పారిశ్రామికీకరణ త్వరత్వరగా చేపట్టడం వల్ల వచ్చే ‘అభివృ ద్ధి’ అభిలషణీయమని నిజంగా ఎంతగా నమ్ముతున్నారో చెప్పడం కష్టంగానీ ఈ క్రమంలో తమకు రాగల ప్రయోజనం కోసం తపిస్తున్నారన్నది మాత్రం నిజం.

కాబట్టి జార్ఖండ్ ప్రభుత్వం టాటా, జిందాల్, మిత్తల్ వంటి పారిశ్రామికవేత్తలతో చాలా ఒప్పందాలు చేసుకుంది. వారు వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెడతా రు, ఖనిజ పరిశ్రమలు, ఇనుము ఉక్కు బాక్సైట్ విద్యుత్ తదితర కర్మాగారాలూ నెలకొల్పుతారు. ప్రభుత్వం వారికి అన్నిరకాల సహాయ సహకారాలూ అందిస్తుంది. ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంటే ఇస్తుంది. అయితే రైతుల భూమి మాత్రం సేకరించి పెట్టదు. కంపెనీలు రైతులతో ప్రత్యక్షంగా ఒప్పందాలు చేసుకొని భూమి కొనుక్కోవడం అంటే ఏమిటో అక్కడి గ్రామాలలో చూడవ చ్చు. గ్రామాలలో దళారులను తయారు చేసుకోవడం, వారికి పైసలీయడం, తినబెట్టడం, తాగబోయడం, వారి గూండాయి జంతో ఇతర ప్రజలను లొంగదీసుకొని ఒప్పించాలని చూడ డం పెద్ద పెద్ద కంపెనీల కన్ను పడ్డ అన్ని గ్రామాలలోనూ కనిపించే చిత్రం. చివరికి రైతు ఎందుకొచ్చిన గొడవలెమ్మని అమ్మకానికి ఒప్పుకున్న నాడు అది స్వచ్ఛందమైన ‘సేల్ డీడ్’ రూపమే తీసుకుంటుంది. అతని చేత కొట్టి సంతకం చేయిస్తారనుకోనక్కరలేదు. అమ్మకాలకు అనుకూలమైన గుంపు గ్రామంలో తయారు చేయబడుతుంది. వారికి అకస్మాత్తుగా చేతి నిండా డబ్బులు, మోటార్ సైకిళ్లు లభిస్తాయి. వారు అమ్మకాన్ని వ్యతిరేకించేవారితో గొడవ పెట్టుకుంటారు.

ఆ వ్యతిరేకత సంఘటితమైన చోట వారి మీటింగ్‌లలో అల్లరి చేస్తారు. క్రిమినల్ కేసులవుతాయి. పోలీసులు ఏకపక్షంగా కేసులు పెడతారు. ఇదంతా జరుగుతుండగా మరో వైపు ఒప్పించే ప్రచారమూ జరుగుతుంటుంది. ఎకరానికి రెండు లక్షలిస్తారట, ఉద్యోగాలిస్తారట, భూమి ఇచ్చేస్తే ఏం అన్న చెవికొరుకుడు సాగుతుంటుంది. ఈ అశాంత పరిస్థితిని ఎక్కువ కాలం తట్టుకోవడానికి చాలా సంకల్పం కావాలి. ఆదివాసులు మాత్రమే నివసించే ప్రాంతాలలో నాగరిక సమాజపు బలహీనతలింకా పూర్తిగా ఒంట బట్ట లేదు కాబట్టి అక్కడ ఈ పాచిక ఎక్కువగా పార లేదు. మిశ్రమ గ్రామాల పరిస్థితి వేరే. అక్కడ దళారులు దొరుకుతున్నారు; ఆశపెట్టి, భయపెట్టి, విసిగించి లోబరచుకునే ప్రయోగమూ సాగుతున్నది. ఉదాహరణగా టాటాలనూ, జిందాల్‌నూ, మిత్తల్‌నూ కూడ తీసుకోవచ్చునుగానీ టాటా కంపెనీకి సంబంధించిన ఒక ఉదాహరణే చెప్పుకుందాం. ఎందుకంటే టాటా వారు మర్యాదస్తులనీ మురికి పనులు చేయరనీ ఒక అభిప్రాయం ప్రచారంలో ఉంది.

జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూం జిల్లానుంచి వేరు చేసి కొత్తగా ఏర్పరిచిన సరాయికేలా-ఖర్స్‌వాన్ జిల్లాలోని సుమారియా బ్లాక్‌లో టాటావారు సాలీనా 12 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేయగల కార్ఖానా నెలకొల్పుతామని రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. నాలుగు గ్రామ పంచాయితీలలోని 23 గ్రామాలలో భూమికోసం వేట మొదలుపెట్టా రు. ఆ గ్రామాలలో గట్టి ప్రతిఘటన ఎదురయింది. వ్యతిరేకించే రైతులు భూమిరక్షా గ్రామీణ ఏక్తా మంచ్ అనే వేదిక ఏర్పాటు చేసుకొని ఆందోళనకు దిగారు. టాటావారు చూసి చూసి ఆ వేదిక నాయకులనే లొంగదీసుకున్నారు. వారే టాటావారి ఏజెంట్లుగా మారారు.అయితే ఒకనాడు మంచ్ నాయకులు టాటావారు నెలకొల్పిన ఒక ఎన్‌జివోతో కలిసి ఆ గ్రామాలలో సర్వే మొదలు పెట్టే సరికి ప్రజలకు అనుమానం వచ్చింది.

ఎందుకోసం సర్వే చేస్తున్నారని అడిగితే రేషన్‌కార్డు లివ్వడం కోసం అని సమాధానం చెప్పారు గానీ వారు ప్రజలచేత నింపిస్తున్న ఫాంలో కేవలం ఆదాయం వివరాలేకాక సర్వే నెంబర్లు సరిహద్దుల యుక్తంగా భూముల వివరాలూ ఉన్నాయి. అసలు సంగతి గ్రహించిన గ్రామస్తులంతా ఒకటయి అప్పటిదాకా తమకు నాయకత్వం వహిస్తున్న మంచ్‌ను తొలగించి భూమిరక్షా గ్రామీణ ఆందోళన్ అభియాన్ అనే కొత్త వేదికను ఏర్పాటు చేసుకున్నారు. మంచ్‌కూ అభియాన్‌కూ మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. ఈ సంవత్సరం మే నెల 21వ తేదీన టాటావారు మంచ్ ప్రతినిధులతో కలిసి టెంటోపోసీ అనే గ్రామంలో టైలరింగ్ నేర్పించే పునరావాస కేంద్రాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేయగా అభియాన్ నాయకత్వంలో గ్రామస్తులు జనతా కర్ఫ్యూ విధించి ఆ ఊరికి వచ్చే దారిలో ఉన్న వంతెనకు అడ్డం గా నిలబడి టాటా వారిని గ్రామములోనికి రానియ్యలేదు. వంతెన దగ్గరే అభియాన్‌లో చురుకయిన కార్యకర్త అయిన హీరాలాల్ మహతోకూ, దళారులుగా తయారయిన మంచ్ నాయకులకూ తీవ్ర వాగ్వాదం జరిగింది.

ఈ చొరవకు హీరాలాల్ మూల్యం చెల్లించవలసివచ్చింది. సెప్టెంబర్ 12న అత ను మోటార్ సైకిల్ పై తన స్వగ్రామమయిన టిడింఘిపా నుంచి జిల్లా కేంద్రానికి పోవడానికి బయలుదేరగా ఊరిబయట మంచ్ నాయకులు అతనిపైన బాంబులు వేసి కాల్పులు జరిపి హత్య చేశారు. దీనితో అతని గ్రామంలో ఎంతటి భయ వాతావరణం ఏర్పడిందంటే ముగ్గురు పిల్లలున్న అతని భార్య మేనకను పరామర్శించడానికి కూడా అతని ఇంటికెవరూ పో యే పరిస్థితిలేదు. ఆ వాతావరణం ఇంకొక మూడు నాలుగు గ్రామాలలో తీసుకురాగలిగితే ఆ 23 గ్రామాలలో తమ 12 మిలియన్ టన్నుల ఉక్కు కర్మాగారానికి కావలసిన భూమి దొరికేస్తుందని టాటావారు భావిస్తుండవచ్చు.

కానీ అది జరగకూడదని అభియాన్ కార్యకర్తలు గట్టి సంకల్పంతో ఉన్నారు. నష్టపరిహారం, పునరావాసం దక్కుతాయి లెమ్మన్న ఆశ ఈ ప్రాంత ప్రజలలో కల్పించడం కష్టం. వారికి దగ్గరలోనే జాదుగూడ ఉంది. కొంచెం దూరంలో జంషెడ్‌పూర్ ఉంది. జాదుగూడలోని యురేనియం కార్పొరేషన్ వారి గనులకూ కర్మాగారానికీ భూములిచ్చిన వారు ‘ఇప్పుడు ఏ హోటల్‌లో ప్లేట్లు కడుగుతున్నారో ఏ బస్టాండులో మూటలు మోస్తున్నారో మాకు తెలీదా’ అంటారు. దేశ పారిశ్రామిక చరిత్రలో ప్రఖ్యాతి గాంచిన జంషెడ్‌పూర్ ఉక్కు కర్మాగారం గురించి కూడ వారి కి ఆసక్తికరమైన జ్ఞాపకాలున్నాయి.

తొలుత టాటావారు ఉక్కు కర్మాగారం నెలకొల్పినప్పుడు సాంకేతిక స్థాయి చాలా వెనుక బడివుండింది. విపరీతమైన వేడిలో చేతుల్తో ఎక్కువ పనిచేయవలసి ఉండింది. ఆ దశలో ఆ కర్మాగారం కోసం భూములిచ్చిన ఆదివాసులు ఆ కర్మాగారంలో ఆదివాసులు పెద్ద సంఖ్య లో పని చేశారు. అయితే కాలక్రమంలో యంత్రాల ఆధునికీకరణ పెరిగిన కొద్దీ ఆదివాసులు ఒక్కొక్కరుగా బయటకుపో యి ఆదివాసీయేతరులు చేరారు. భూమిపోయి నా పని దొరుకుతుంది అన్న వాదనకు జవాబుగా వారు మరొక అనుభవా న్ని కూడ చెప్తారు. సమీపంలోని రఖా అనే గ్రామం వద్ద 1967లో రాగిలోహపు ఖనిజం తవ్వితీసే గనులు ప్రారంభమయ్యాయి. దానికోసం భూమికోల్పోయిన వారిలో చాలామంది ఎప్పటిలాగే చెల్లాచెదురయిపోగా కొద్దిమందికి ఆ పరిశ్రమలోనే చిన్నవే అయినా పనులు దొరికాయి. వారు బాగుపడ్డారనే అందరూ అనుకున్నారు.

కానీ 30 సంవత్సరాలు గడచిన తరువాత ఆ గనులనుంచి ఖనిజం తీయడం ఇంక లాభదాయకం కాదని మూసివేశారు. ‘ఇప్పుడు వారికి భూమీ లేదు, ఉద్యోగమూ లేదు. కంపెనీ మూసివేసినప్పుడిచ్చిన పైసలు ఖర్చయిపోయిన తరువాత ఏమీ లేదు. వస్తుందో రాదో, వస్తే ఎన్నిరోజులుంటుందో తెలియని ఉద్యోగం కోసం భూములెందుకు ఇచ్చేయాలి?, అని వారు అడుగుతున్నారు.

నేలకింద ఉన్న ఖనిజాలు అలానే ఉండిపోవలసిందే నా అని ఆందోళన చెందే వారుంటారు. ఇది సులభంగా తెగే చర్చ కాదు కానీ, విస్థాపన గురించి బలవంతపు భూసేకరణ గురించి అమలుకాని పునరావాస ప్రక్రియ గురించి జరుగుతున్న వివాదం నిజానికి భిన్న అభివృద్ధి నమూనాల మధ్య వివాదం అని గుర్తించాలి. రాజకీయ పక్షాలు, టాటా జిందాల్ అంబానీలు, మీడియా ఏకైక అభివృద్ధి నమూనా ఉందని ఊదరగొడుతున్నాయి. భారీగా పెట్టుబడులు ఆహ్వానించి అత్యధిక వృద్ధి రేటు సాధించడం, సకల మానవ ప్రాకృతిక వనరులనూ దానికి దాసోహం చేయడం ఈ నమూనా.

ఇది కలిగించే విధ్వంసాన్ని వ్యతిరేకిస్తున్న ప్రజలు వేస్తున్న ప్రశ్న, దీనికి ప్రత్యామ్నాయాలు లేవా అని . ప్రకృతిని ప్రజల జీవన వనరుగా గుర్తించి, వారి జీవన ప్రమాణాలను క్రమంగా మెరుగుపరిచేదిశగా వారి భాగస్వామ్యంతో దేశ ఆర్థిక వ్యవస్థ ను అభివృద్ధి చేయడం సాధ్యం కాదా అన్నది పాలక అభివృద్ధి నమూనా నిరసనోద్యమాల నుంచి ఎదుర్కొంటున్న సవాలు. ఈ సంవాదంలో అన్ని ప్రశ్నలకూ సులభమైన జవాబులు లేకపోవచ్చు. కానీ ఇక్కడొక సంవాదమే లేనట్టు, చర్చించేదేమీ లేనట్టు, పాలకులు అభివృద్ధి అని పేరు పెడుతున్న దానిని వ్యతిరేకించే వారంతా అజ్ఞానులు, మూర్ఖులు, అవకాశవాదు లు అయినట్టు వ్యవహరించడం క్షంతవ్యం కాదు.

-కె.బాలగోపాల్

Read Full Post »

హైదరాబాద్: సిరిసిల్ల పవర్‌లూమ్ వస్త్రాల కొనుగోలుకు వివిధ ప్రభుత్వ విభాగాలను ఆదేశించి మార్కెట్ గ్యారంటీ కల్పించాలి. కార్మికులపై, సహకార సంఘాలపై ఉన్న ప్రభుత్వ బకాయిలను రద్దు చేయాలి. మైక్రోఫైనాన్స్ లాంటి ప్రైవేటు రుణాలకు ప్రభుత్వమే దఖలుపడాలి. షరతుల్లేకుండా రుణపరపతి కల్పించాలి.

చిరంజీవి గత నెల 20వ తేదీన ఏ కారణంతో సిరిసిల్ల పర్య టన చేపట్టినప్పటికీ, అక్కడి నేత కార్మికుల దుర్భర పరిస్థితుల్ని మరొకసారి లోకానికి చాటినట్టయింది. సిరిసిల్లలో నేత కార్మికుల దుస్థితికి ఎన్డీఏ, యూపీఏ -రెండూ బాధ్యత వహించాల్సిందే. అందు వల్ల సమస్య తీవ్రతను గుర్తించి దాని పరిష్కార మార్గాలు కనుక్కోవడానికి సిరిసిల్ల బాధిత ప్రజల మధ్యనే పీపుల్స్ రౌండ్ టేబుల్ సమావేశం జరగాలి. బాధిత ప్రజలను, నేత కార్మిక సంఘాలను చేనేత రంగ నిపుణులను సహకార సంఘాలను కూడగట్టి సమిష్టి పరిష్కారాన్ని కనుక్కునే బాధ్యతను తెలంగా ణవాదులు తమ భుజానికెత్తుకోవాలనేది నా అభిలాష.

మొదట ఆత్మహత్యలు అరికట్టడానికి తక్షణ ఉపశమన చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత. కార్మిక సంఘాలు, సామాజిక సంస్థలు, హక్కుల సంఘాలు నిలబడి తమకు చేతనైన సహాయం చేస్తూనే, బాధిత ప్రజల్లో విశ్వాసం పాదుకొల్పాలి. ఎల్లవేళలా పాలకవర్గాలు ఉత్పత్తి సంక్షోభాన్ని కేవలం మార్కెటు సమస్యగా చిత్రించి తమ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నిస్తాయి. ఆధునికత- అభివృద్ధి పేరిట అనుసరించిన సామ్రాజ్య వాద విధానాల వల్ల, అందులో భాగంగా రూపొందించిన నూతన జౌళి విధానం వల్ల సిరిసిల్లకు ఈ దుస్థితి పట్టింది. నూతన జౌళి విధానానికి స్వస్తి చెప్పి, నేత రంగంపై ఉన్న అప్పులన్నీ రద్దుచేసి, కార్మికులందరికి ఉపాధి కల్పించే దిశగా, అంతిమంగా దేశీయ వస్త్ర పరిశ్రమను కాపాడుకునే విధంగా ఆందోళన కొనసాగాల్సిన అవసరం ఉంది.

అతిపెద్ద ఉపాధిరంగంగా ప్రసిద్ధి గాంచిన చేనేతరంగాన్ని విడిగా అభివృద్ధి చేయకుండా పాలకవర్గాలు మిల్లురంగం, పవర్‌లూమ్ రంగాలను చేనేతతో కలిపి భారత జౌళిరంగ విధానాన్ని రూపొందించారు. కార్మికులు దీనిని వ్యతిరేకిస్తున్నప్పటికీ దీనిని 1985లో ప్రజలపై రుద్దారు. పైగా వ్యవస్థాగత సర్దుబాటు కార్య క్రమం పేరిట 1991లో సరళీకృత విధానాలు అమలు చేశారు. దీనివల్ల నూలు- రంగుల ధరలు విపరీతంగా పెరిగాయి. 2000 సంవత్సరంలోనే జౌళీ పార్కుల కోసం ఎన్‌డిఎ ప్రభుత్వం టెక్నికల్ అప్‌గ్రెడేషన్ ఫండ్ (టియుఎఫ్) పేర 25,000 కోట్ల రూపాయల నిధిని సమకూర్చింది. భారీ పెట్టుబడిదార్లకు ఆటోమైజేషన్ పేరుమీద భారీ సబ్సిడీలు ఇచ్చింది. ఆధునిక టెక్నాలజి పేరు మీద మరమగ్గాల దిగుమతులకు రాయితీలిచ్చింది.

20 శాతం పెట్టుబడి రాయితీలు, 100 శాతం మౌలిక వసతుల సబ్సిడీ, ఉచిత విద్యుత్, ఉచిత నీరుతోపాటు 5 శాతం వడ్డీ రాయితీ ఇవ్వడానికి అంగీకరించి ఎన్డీఏ ప్రభుత్వ జాతీయ జౌళీ విధానం బహుళ జాతి సంస్థలకు, బడా పెట్టుబడిదార్లకు ఎర్ర తివాచీలు పరిచింది. తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో జరిగిన ఆత్మహత్యలను అరికడతామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏ చర్యలు తీసుకోలేదు. పైగా ఆటోమైజే షన్‌తో కూడిన 14 జౌళీ పార్కుల నిర్మాణానికి రాష్ట్ర జౌళీ విధానం పేర భారీ ప్రణాళిక(2005-10)ను ప్రకటించింది. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరులో హైదరాబాద్ మెగా టెక్స్‌టైల్ పార్కుకు 300 ఎకరాల స్థలంలో 300 కోట్లతో ప్రారంభ సన్నాహాలు చేశారు. ఈ పార్కుల్లో కూడా జెట్‌లూమ్స్ (నాడీ లేకుండా వాయు వేగంతో నడిచే మరమగ్గాలు) ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ పథకం. సరిగ్గా తమిళనాడు, మహారాష్ట్ర తదితర పొరుగు రాష్ట్రాల్లో ఇదే రకం ఉత్పత్తి విధానంతో పోటీపడలేక సిరిసిల్ల పవర్‌లూమ్ రంగం కుప్పకూలిందని నేత కార్మి కులు ఆరోపిస్తున్నారు.

ప్రపంచీకరణతో పొరుగుదేశాల నుంచి వస్త్రాలు, పట్టునూలు దిగుమతి చేసుకోవడంతో వారణాసి మొదలుకుని పోచంపల్లి వరకు పట్టు వస్త్ర పరిశ్రమ వీధుల్లో పడ్డది. పోచంపల్లి టై అండ్ డై తోపాటు చేనేత నైపుణ్యంపై కార్మికులకు పేటెంట్ హక్కులిచ్చి, అప్పులన్నీ రద్దు చేయాల్సింది. ఇది చేయకపోగా, సిరిసిల్ల లాంటి పవర్‌లూమ్ వస్త్రపరిశ్రమను పరిరక్షించకుండా, ప్రతి మనిషి రోజుకు సగటున 960 గజాల వస్త్రం నేసే జెట్‌లూమ్‌ల కోసం జౌళీ పార్కుల విధానాన్ని ప్రకటించడం, సిరిసిల్లను మరింత వధ్యశాలపై నెట్టడానికే దారితీస్తుంది.

వస్త్ర పరిశ్రమను కొద్దిమంది బడా వ్యాపారుల కబంధ హస్తాల నుంచి విముక్తి చేయాలి. అలాగే సరళీకరణ-ప్రపంచీకరణలో భాగంగా గుత్తపెట్టుబడిదార్లకు అనుగుణంగా ఉన్న జాతీయ జౌళి విధానాన్ని, రాష్ట్ర ప్రభుత్వ జౌళి విధానాలను మార్చకుండా 414 కోట్లకు చేరిన చేనేత రంగ బకాయిలు, ప్రైవేటు అప్పులు చెల్లించకుండా నేత రంగంలో ఆత్మహత్యలను అరికట్టడం సాధ్యం కాదు. ఈ పరిస్థితిని మార్చడానికి బాధిత సిరిసిల్ల ప్రజలమధ్య ‘పీపుల్స్ రౌండ్ టేబుల్’ జరగాలని అభిలషిస్తూ, కొన్ని అంశాలు చర్చకు ప్రతిపాదిస్తున్నాను. 1997ను ప్రాతి పదికగా తీసుకుని, ఆత్మహత్యలు- ఆకలిచావులతోపాటు అనారోగ్యం తదితర కారణాలతో బలవన్మరణాలకు గురయిన వారికి 5 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషి యా ఇచ్చి, పిల్లలకు ఉచిత చదువుతో పాటు కుటుంబంలో ఒకరికయినా ఉపాధి కల్పించాలి.

పేరుకుపోయిన వస్త్రాలన్నీ ప్రభుత్వమే కొనుగోలు చేసి, తిరిగి ఉత్పత్తికి అవసరమయిన ముడిసరుకును, విద్యుత్‌ను సబ్సిడి రేట్లకు అందజేయాలి. సిరిసిల్ల పవర్‌లూం వస్త్రాల కొనుగోలుకు వివిధ ప్రభుత్వ విభాగాలను ఆదేశించి మార్కెట్ గ్యారంటీ కల్పించాలి. కార్మికులపై, సహకార సంఘాలపై ఉన్న ప్రభుత్వ బకాయిలను రద్దు చేయాలి. మైక్రోఫైనాన్స్ లాంటి ప్రైవేటు రుణాలకు ప్రభుత్వమే దఖలుపడాలి. షరతుల్లేకుండా రుణపరపతి కల్పించాలి.

అపెరల్ పార్కుల పేరిట భారీ రాయితీలతో సాగుతున్న గుత్తపెట్టుబడిదారు ల దోపిడికి అడ్డుకట్ట వేయాలి. ఉపాధి ప్రాతిపదికగా ప్రజామోదంతో సిరిసిల్లను టెక్స్‌టైల్ జోన్‌గా ప్రకటించాలి. కార్మికులందరికి ఉచిత ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలి. ప్రత్యేక వృద్ధాప్య పింఛనును 1,000 రూపాయలకు పెంచాలి. నేత కార్మికులకు కనీసవేతనాలు అమలు పరచాలి. నిత్యావసర సరుకులన్నీ సబ్సిడి రేట్లకు చౌక దుకాణాల ద్వారా అందించాలి. తక్షణ సహాయ చర్యలకోసం, రుణ విముక్తికోసం కార్పస్‌ఫండ్‌తో స్పెషల్ ప్యాకేజీని ప్రకటించాలి. చేనేత పరిశ్రమ పేటెంట్ హక్కులిచ్చి చారిత్రిక కళానైపుణ్యాలను పరిరక్షించాలి.

-అమర్ (జనశక్తి రాజకీయ ఖైదీ)

Read Full Post »

హైదరాబాద్: అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్టు, జార్జ్ బుష్ అమెరికా ప్రజల, ప్రవాసుల సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నాడు. అప్పులలో నిండా మునిగిన ‘బేర్ స్ట్రెన్స్’ను 29 బిలియన్లతో, ఫ్రెడీ మేక్ – ఫ్రెనీమే కంపెనీలను 200 బిలియన్లతో, ఎఐజి ఇన్యూస్సూరెన్స్ కంపెనీని 85 బిలియన్లతో కొన్నాడు.

అమెరికా ఆర్ధికరంగం పేకలమేడలా కుప్పకూలుతుంది. బ్యాంకులు, ఇన్యూసురెన్స్ కంపెనీలు, తాకట్టు కంపెనీలు ( మోర్టగేజ్ కంపెనీలు) నష్టాల ఊబిలో కూరుకుపోయి దివాళ తీస్తున్నాయి. పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభంలో చిక్కుకున్నది. మరి దీనిలో వెనకాల వున్న కారణలు ఏమిటి?

ఈ ఆర్ధిక సంక్షోభాన్ని అర్థం చేసుకోవడానికి కాస్తంత చారిత్రాత్మకంగా, అమెరికా ఆర్థిక విధానాలను గమనించాలి. అమెరికా లో రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, తాకట్ల కంపెనీలకు లాభం చేకూరే విధంగా అప్పటి ప్రభుత్వం 1938 లో ‘ఫెన్నీ మే’ 1970 లో ‘ఫ్రెడ్డీ మేక్’ అనే కంపెనీలను ప్రారంభించింది. యీ కంపెనీలు రియల్ ఎస్టేట్ బ్రోకర్ల, తాకట్టు కంపెనీలకు పరోక్షంగా ప్రభుత్వ సబ్సిడీలు ఇచ్చాయి.

ఆర్థిక స్థోమత్త లేని వాళ్ళకు విపరీతమైన అప్పులిచ్చి రియల్ ఎస్టేట్ మార్కెటులో ఒక కృతిమైన డిమాండ్ సృష్టించారు. ఇళ్ళ ధరలను వాస్తవ విలువ కంటే విపరీతంగా రియల్ఎస్టేట్ కంపెనీలు పెంచేసాయి. వడ్డీ వ్యాపారం రుచి మరిగిన బ్యాంకులు, వ్యాపార సంస్థలు ఎలాంటి నియమనిబంధనలు పాఠించకుండా, అప్పులు ఇచ్చారు. ఉద్యోగాలు కోల్పోయిన జనం, తీసుకున్న అప్పులను చెల్లించలేక పోయారు. వడ్డీ వ్యాపారంలో జూదమాడిన కంపెనీలు పేకలమేడలా కుప్ప కూలుతున్నాయి. తాము తీసుకున్న గోతి లో తామే పడ్డాయి. కారల్ మార్క్స్ అన్నట్టుగా “పెట్టుబడిదారులు తమ బొందను తామే తవ్వుకుంటారని” వాస్తవంగా జరుగుతుంది. అమెరికా లో పెట్టుబడి వ్యవస్థ పరాకాష్టకు చేరుకుంది. 1930 అమెరికా లో ‘గ్రేట్ డిప్రెషన్’ (ఆర్ధిక వినాశకం) పునారావృత్తం అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అమెరికా చరిత్రలో, ఎప్పుడు కనివిని ఎరగని రీతిలో, అమెరికా ప్రభుత్వం 700 బిలియన్ల డాలర్ల ప్రజల సొమ్ముని వాల్ స్ట్రీటు లో జూదమాడి నిండామునిగిన దళారులకు, తాకట్టు కంపెనీలకు ధారాదత్తం చేయాలని ప్రయత్నిస్తుంది. దీనిని అధికారంలో వున్న రిపబ్లికను పార్టీ, ప్రతిపక్షంలో వున్న డెమొక్రెటిక్ పార్టీ రెండూ సమర్ధిస్తున్నాయి.

ఈ సందర్భంగా ప్రభుత్వం, రాజకీయనాయకుల పాత్రను గమనించాలి. అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ , ఆర్ధికమంత్రి హెన్రీ పాల్సన్ ప్రభుత్వపరిపాలనలో పూర్తిగా విఫలమయ్యారు. బ్యాంకులు, తాకట్టు కంపెనీలు, వ్యాపారసంస్థలమీద ఎలాంటి ప్రభుత్వనియంత్రణ లేకుండా, తమ ఇష్టారాజ్యంగా నడిచాయి. వాల్ స్ట్రీటు జూదగాళ్ళ నష్టాలను సామాన్య జనం నెత్తిన రుద్దుదామని కొంతమంది రిపబ్లికన్లు, డెమోక్రెట్లు ప్రయత్నిస్తున్నారు. 700 బిలియన్ల ప్రభుత్వసొమ్ముని (అంటే అమెరికా ప్రజల సొమ్ముని) వాల్ స్ట్రీట్ షేర్ మార్కెటు దళారులకు ఇవ్వాలని ప్రత్నిస్తున్నారు. కొంతమంది అమెరికను కాంగ్రెసు సభ్యుల విజ్ఞత వల్ల “700 బిలియన్ల బెయిల్ అవుట్” బిల్లు ఓడిపోయింది.

అమెరికాలో అత్యంత ధనవంతమైన వ్యాపారసంస్థ జనరల్ ఎలక్ట్రిక్ చెందిన ఎన్.బి.సి, టైమ్ వార్నర్ చెందిన సి.ఎన్.ఎన్, అలాగే అత్యంత పెద్ద మీడియా కంపెనీ అయిన న్యూస్ కార్పొరేషన్ తమ స్వప్రయోజనాలకోసం యీ బిల్లును సమర్ధిస్తున్నాయి. “మీ ఉద్యోగాలు పోతాయి, మీకు జీతాలు రావు, ఎ.టి.యం కార్డులతో డబ్బు తీసుకోలేర”ని తప్పుడు ప్రచారంతో జనాన్ని బయపెట్టాలని ప్రయత్నిస్తున్నారు.

ఒకవైపు అమెరికాలో మెజార్టీ ప్రజలు “బెయిల్ అవుట్” బిల్లును వ్యతిరేకిస్తున్నా, మరొకవైపు ప్రభుత్వం-రాజకీయనాయకులు-బడా కంపెనీలు “బెయిల్ అవుట్” బిల్లును అమలు చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అమెరికా లో బిజినెస్ లాబీలు ప్రభుత్వం-రాజకీయనాయకులను నియంత్రిస్తాయి. ఒకమాటలో చెప్పాలంటే, అధ్యక్షపదవి పోటిపడుతున్న బారకా ఒబామా 400 మిలియన్లు, జాన్ మెకేయిన్ 300 మిలియన్లు ( రిపబ్లికను పార్టీ తోకలపి) వసూలు చేసారు. దీనిలో మెజార్టీ భాగం బిజినెస్ లాబీల దగ్గర నుండి వచ్చిందే. సెనేట్ లో రాత్రింబగళ్ళు కష్టపడి సెనేటర్లు యీ బిల్లును ఆమోదించి దివాళ తీసిన వ్యాపారసంస్థలకు లాభం చేకూర్చారు.

చివరికి ‘అమెరికను కాంగ్రెసు’ 700 బిలియన్ల బిల్లును సాగదీసి 840 బిలియన్లు చేసి ఆమోదించింది. వెంటనే జార్జ్ బుష్ సంతకంచేసి చట్టం చేసాడు. అమెరికా ప్రభుత్వం, రాజకీయనాయకులు, వ్యాపారవర్గాలు ఎంతగా లాలూచీ పడ్డారో, తమ స్వప్రయోజనాలకోసం దేశాన్ని ఎలా తాకట్టు పెడతారో స్పష్టమైంది. పెట్టుబడిదారీ వ్యవస్థ ఇంత దివాళకోరు స్థితికి చేరుకోవటం పరాకాష్ట. ఇదొక పట్టపగలి దొంగతనం; ప్రభుత్వం చట్టబద్దంగా జనాన్ని దోచుకున్న వైనం.

– సాజీ గోపాల్

Read Full Post »

The Minister of State for Defence Shri M.M. Pallam Raju delivering the valedictory address at the 3-day international seminar on "Latest Trends in Construction of Bridges", in New Delhi on October 18, 2008.

The Minister of State for Defence Shri M.M. Pallam Raju delivering the valedictory address at the 3-day international seminar on

Read Full Post »

The Minister of State for Commerce and Power, Shri Jairam Ramesh addressing at a ceremony for disbursement of lump sum to the 12 closed tea gardens of North Bengal in Jalpaiguri, West Bengal (PIB) on October 18, 2008.

The Minister of State for Commerce and Power, Shri Jairam Ramesh addressing at a ceremony for disbursement of lump sum to the 12 closed tea gardens of North Bengal in Jalpaiguri, West Bengal (PIB) on October 18, 2008.

Read Full Post »

Finbar Tearney from Newzeland won the Gold, Hendrik Coertzen from South Africa won Silver and Yuki Bhambri from India won Bronze medal in Tennis event at the 3rd Commonwealth Youth Games-2008, in Pune on October 18, 2008.

Finbar Tearney from Newzeland won the Gold, Hendrik Coertzen from South Africa won Silver and Yuki Bhambri from India won Bronze medal in Tennis event at the 3rd Commonwealth Youth Games-2008, in Pune on October 18, 2008.

Read Full Post »

Older Posts »