Feeds:
టపాలు
వ్యాఖ్యలు

Archive for నవంబర్ 7th, 2008

న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కం(గే సెక్స్‌)తో ఆరోగ్యానికి ఎటువంటి చేటు ఉండదని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. గేసెక్స్‌ వల్ల జననాంగాలకు హాని జరుగుతుందంటూ బీజేపీ సీనియర్‌ నేత బీపీ సింఘాల్‌ చేసిన వాదనతో కోర్టు ఏకీభవించలేదు. స్వలింగ సంపర్కంపై ఉన్న చట్టపరమైన ఆంక్షలను కొనసాగించాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. “పలు దేశాల్లో గే సెక్స్‌పై నిషేధం తొలగించారు. ఆ చర్య హానికరమని ఎవరూ చెప్పలేదు. స్వలింగ సంపర్కం మంచిది కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఎన్నడూ ప్రకటించలేదు” అని ప్రధాన న్యాయమూర్తి ఏపీ షా, న్యాయమూర్తి ఎస్‌.మురళీధర్‌తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. స్వలింగ సంపర్కుల హక్కుల కోసం ఉద్యమిస్తున్న కొందరు దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు విచారించింది. గే సెక్స్‌ నేరం కాదని ప్రకటించాలని వారు ఆ పిటిషన్లలో కోరారు. దీనిని బీజేపీ నేత సింఘాల్‌ వ్యతిరేకిస్తున్నారు.  ఓ వేళ పరస్పర అంగీ కారంపై ఇద్దరు గే సెక్స్‌కు సిద్ధపడినా.. వారిని అందుకు అనుమతించ రాదంటూ సింఘాల్‌ తరఫు న్యాయవాది హెచ్‌.వి.శర్మ చేసిన వాదనపై బెంచ్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. స్వలింగ సంపర్కం హానికరమని రుజువు చేసే సమాచారం ఏమైనా ఉందా? అని ప్రశ్నించింది. దీనికి సంబం«ధించి ఎటువంటి అధ్యయనమూ జరగలేదని శర్మ బదులిచ్చారు. గే సెక్స్‌తో లైంగిక వ్యాధులు ప్రబలే అవకాశాలు లేవనే వాదనను బలపరిచే రెండు అధ్యయనపత్రాలను గే హక్కుల ఉద్యమకారులు కోర్టు ముందుంచారు.

Read Full Post »

హైదరాబాద్‌ : దేశవ్యాప్తంగా వివిధ వార్తా పత్రికల పాఠకుల సంఖ్యను మదింపు వేసేందుకు మీడియా రీసెర్చ్‌ యూజర్‌ కౌన్సిల్‌ (ఎంఆర్‌యుసి) నిర్వహించే ఇండియన్‌ రీడర్‌షిప్‌ సర్వే (ఐఆర్‌ఎస్‌)లో తెలుగు ప్రజల అభిమానపత్రిక ఆంధ్రజ్యోతి రికార్డు సృష్టించింది. తెలుగుతో సహా దేశవ్యాప్తంగా దాదాపు అన్ని భాషాపత్రికల రీడర్‌ షిప్‌ తిరోగమనంలో ఉన్న సమయంలో ఆంధ్రజ్యోతి ఒక్కటే పాఠకుల సంఖ్యను గణనీయంగా పెంచుకున్నది.

ప్రాంతీయ భాషా పత్రికలకు సంబంధించి రీడర్‌షిప్‌ వృద్ధిలో దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలిచింది. వృద్ధి విషయంలో దక్షిణాదిలో మరే పత్రికా ఆంధ్రజ్యోతి దరిదాపుల్లో కూడా లేదు. వాస్తవానికి ఐఆర్‌ఎస్‌ 08- రౌండ్‌ 2 సర్వే వివరాల ప్రకారం తొలి రౌండ్‌తో పోలిస్తే దేశవ్యాప్తంగా పలు ప్రధాన దిన, వార, మాసపత్రికల పాఠకుల సంఖ్య భారీగా తగ్గింది. ప్రాంతీయ భాషా పత్రికల్లో ఈ ట్రెండ్‌ మరింత స్పష్టంగా ఉంది.

అయితే పాఠకుల మొక్కవోని అభిమానం కారణంగా ఆంధ్రజ్యోతి మాత్రం ఈ ట్రెండ్‌కు అతీతంగా నిలిచింది. నిర్బీతితో కూడిన వార్తా కథనాలు, నికార్సైన జర్నలిస్టు విలువలతో రాణిస్తున్న ఆంధ్రజ్యోతికి పాఠకులు పడుతున్న నీరాజనానికి ఇది తిరుగులేని రుజువు. తెలుగులో ఆంధ్రజ్యోతి ఆధిక్యతను, పెరుగుతున్న పాఠక జనాదరణను ఈ సర్వే స్పష్టంగా తెలియజేసింది.

ఐఆర్‌ఎస్‌ 08 తొలి రౌండ్‌తో పోలిస్తే రెండో రౌండ్‌ సర్వే ప్రకారం ఆంధ్రజ్యోతి పాఠకుల సంఖ్య 4,94,000 మేర పెరిగింది. తొలి రౌండ్‌లో 63,17,000 ఉన్న పాఠకుల సంఖ్య ఇప్పుడు 68,11,000 కు చేరింది. ఇదే సమయంలో తెలుగుతో సహా దేశవ్యాప్తంగా ప్రధాన ప్రాంతీయ భాషా పత్రికల రీడర్‌ షిప్‌ మాత్రం గణనీయంగా తగ్గింది.

ఐఆర్‌ఎస్‌-08 రౌండ్‌ 2 సర్వే వివరాలు

(పాఠకుల సంఖ్య లక్షల్లో )

పత్రికలు

ఐఆర్‌ఎస్‌ 08 రౌండ్‌ 1

ఐఆర్‌ఎస్‌ 08 రౌండ్‌ 2

పెరుగుదల/ తరుగుదల

ఆంధ్రజ్యోతి

63.17

68.11

+ 4.94

ఈనాడు

147.24

144.11

– 3.13

వార్త

66.48

63.46

– 3.02

ఆంధ్రభూమి

16.92

14.29

– 2.63

ఆంధ్రప్రభ

7.21

4.75

– 2.46

తెలుగులోనే మరో ప్రధాన పత్రిక ఈనాడు పాఠకుల సంఖ్య తొలి రౌండ్‌తో పోలిస్తే 3,13,000 మేర తగ్గింది. వార్త దినపత్రిక పాఠకుల సంఖ్య 3,02,000 తగ్గింది. హిందీ పత్రికలు దైనిక్‌ భాస్కర్‌, హిందుస్తాన్‌ను మినహాయిస్తే వివిధ భాషలకు చెందిన (ఇందులో కొన్ని హిందీ పత్రికలు కూడా ఉన్నాయి) 110 పత్రికల్లో కేవలం ఆంధ్రజ్యోతికి మాత్రమే గరిష్ఠ స్థాయిలో పాఠకుల సంఖ్య పెరిగింది.

ఈ 110 పత్రికల్లో అంతో ఇంతో రీడర్‌షిప్‌ పెరిగిన పత్రికలు కేవలం 20 మాత్రమే ఉన్నాయి. మిగితా 80 పత్రికలు తరుగుదలనే చవిచూశాయి. రీడర్‌ షిప్‌ పెరిగిన ఇరవై పత్రికల్లో నాలుగులక్షలపైబడి రీడర్‌షిప్‌ పెరిగిన పత్రికలు రెండే రెండు ఉన్నాయి. అందులో ఆంధ్రజ్యోతి అగ్రస్థానంలో ఉంది. మొత్తం 23 రాష్ట్రాల్లో 81 నగరాల్లో 2,54,913 మంది పాఠకులను ఈ ఐఆర్‌ఎస్‌ రౌండ్‌ 2 కోసం సర్వే చేసినట్టుగా మీడియా రీసెర్చ్‌ యూజర్‌ కౌన్సిల్‌ వెల్లడించింది.

Read Full Post »

హైదరాబాద్‌లోని ఓ ప్లాస్టిక్‌ గోడౌన్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. పాతబస్తీలోని బహదూర్‌పురాలో ఉన్న ప్లాస్టిక్‌ గోడౌన్‌లో అర్థరాత్రి ఒంటిగంట సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్లాస్టిక్‌ వస్తువులు కావటంతో మంటలు ఒక్కసారిగా పైకి లేచాయి. దీంతో గోడౌన్‌లోని స్టాకు పూర్తిగా కాలి బూడిదైంది. మూడు ఫైరింజన్ల సిబ్బంది గంటపాటు కష్టపడి మంటలను అదుపులోకి తెచ్చారు.

Read Full Post »

కడప: కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని మల్లేల మలుపు వద్ద ఓ సిమెంటులారీ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో తొండూరుకు చెందిన హరిశ్చంద్రారెడ్డి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ కింద ఇరుక్కుపోయిన క్లీనర్‌ను జేసీబీ ద్వారా బయటకు లాగి 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు.

Read Full Post »

హైదరాబాద్‌: బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపాలంటూ సీఎంను కోరేందుకు ఎర్రబెల్లి దయాకరరావు నాయకత్వంలో టీడీపీ ప్రతినిధి బృందం శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. ఆయనను కలిసేందుకు అనుమతి కోరగా ఆయనే వచ్చి మాట్లాడతారంటూ వారిని బయటే నించోబెట్టారు. ఆ తరువాత కొంతసేపటికి వారిని కలిసేందుకు సీఎం నిరాకరించారని సిబ్బంది తెలిపారు. దీనితో ఆగ్రహించిన టీడీపీ నేతలు క్యాంపు కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. సీఎం వచ్చి వినతిపత్రం తీసుకునేవరకు కదలమంటూ అక్కడే బైఠాయించారు. దీంతో పోలీసులు వచ్చి వారిని అరెస్టు చేశారు.

Read Full Post »

సిరీస్‌ను డిసైడ్‌ చేసే నాగపూర్‌ టెస్ట్‌లో టీమిండియా ఇన్నింగ్స్‌ భారీ స్కోరు దిశగా సాగుతోంది. సచిన్ సెంచరీ, లక్ష్మణ్‌, సెహ్వాగ్‌లు అర్థ సెంచరీలతో భారత్‌ తొలి రోజులో ఆసీస్‌ పై పూర్తి ఆధిక్యం ప్రదర్శించింది. తొలి టెస్ట్‌ ఆడుతున్న విజయ్‌తో కలసి డాషింగ్‌ ఓపెనర్ విరేంద్ర సెహ్వాగ్‌ భారత్‌కు శుభారంభం ఇచ్చాడు. అయితే ద్రవిడ్‌ ఫెల్యూర్‌తో వెంటవెంటనే మూడు వికెట్లు పడిపోవడంతో భారత్‌ ఒత్తిడిలో పడ్డట్టు కనిపించింది. అయితే వందో టెస్ట్‌ ఆడుతున్న లక్ష్మణ్‌, సచిన్‌లు బాధ్యతాయుతంగా ఆడి భారత్‌ను సురక్షిత స్థానంలో నిలిపారు. చివర్లో గంగూలీ, ధోనీలు ఆచితూచి ఆడారు. దీంతో తొలి రోజు ఆటముగిసే సమయానికి భారత్‌ 5 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. ఇక ఈ రోజు ఆటలో భారత్‌ సాధించే పరుగుల మీదే ఈ మ్యాచ్‌ భవితవ్యం ఆధారపడివుంది.

Read Full Post »

ప్రపంచ స్థాయిలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న యూనివర్సల్‌ స్టార్‌ కమల్‌హాసన్‌. నేటితో యాభై నాలుగు సంవత్సరాలు పూర్తిచేసుకొని యాభై ఐదవ సంవత్సరంలో అడుగుపెడుతున్నారు. ఇంత గుర్తింపు పొందిన అగ్ర కథానాయకుడు పెద్ద ఎత్తున జన్మదినోత్సవాలు జరుపుకుంటున్నారనుకోవడం షరామాములే, కానీ ఇందుకు పూర్తి భిన్నంగా ఆయన నేడు తన పుట్టినరోజును వేడుకను బహిష్కరించారు. శ్రీలంకలో యుద్ధ వాతావరణం నెలకొనడంతో అక్కడి ప్రజల జీవన స్థితిగతులు ఒక్కసారిగా అల్లకల్లోలం అయిన నేపథ్యంలో వారికి సానుభూతిగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. సంచనాలను సృష్టించడంలో ముందుండే కమలహాసన్‌ తీసుకున్న ఈ నిర్ణయం హార్షనీయం. సినీ జగత్తులో సకల కళా వల్లభుడైన కమల్‌హాసన్‌…పందొమ్మిది వందల యాభై నాలుగవ సంవత్సరం నవంబర్‌ ఏడున రాజ్యలక్ష్మి, శ్రీనివాసన్‌ దంపతులకు జన్మించారు. నాలుగవ ఏటనే చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా సినీ రంగ ప్రవేశం చేసిన ఆయనకు “కళత్తూరు కిన్నమ్మ”అనే తమిళ చిత్రం సినిమా కెరీర్‌కు పునాది. వైవిధ్యానికి పెద్ద పీట వేసే ఆయన సినీ ప్రస్థానంలో ఎన్నో మేలిమలుపులు, ఎత్తుపల్లాలను చూశారు. ఆయన నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆయన నటించిన ఎన్నో విలక్షణ చిత్రాలతో ట్రెండ్‌సెట్టర్‌గా ముద్రవేసుకున్నాయి. యాక్షన్‌, సెంటిమెంట్‌, క్లాస్‌, మాస్‌ సబ్జెక్టు ఏదైనా ఏ పాత్రలో నటించిన ఆ క్యారెక్టర్‌కు వంద శాతం న్యాయం చేయడం ఆయనకే చెల్లింది. “మరో చరిత్ర” చిత్రంతో చరిత్ర సృష్టించిన ఆయన “ఎర్ర గులాబీ”లో అత్యంత కౄరత్వాన్ని ప్రదర్శించి ఏ పాత్రకైనా తాను యాప్ట్ అవుతానని నిరూపించుకున్నారు. డిగ్లామర్‌ పాత్రలపై ఎంతో ఇష్టంగా చేసి వాటికి పరిపూర్ణతను చేకూర్చటానికి అహర్నిశలూ కృషి చేస్తుంటారు. కేవలం అభినయానికే పెద్దపీఠ వేసి టాకీ చిత్రాల యుగంలో కూడా ఆయన నటించిన పుష్పకవిమానం కమల్‌ కేరీర్‌లో ఓ డిఫరెంట్‌ మూవీ. కమల్‌ మూవీ “మిస్టరీ”లో సస్పెన్స్‌ థ్రిల్లర్స్‌ను కూడా కాదనలేదు. డిఫరెంట్‌ డిఫరెంట్‌ గెటఫ్స్‌తో “ఇంద్రుడు చంద్రుడు” సినిమాతో ప్రేక్షకులను అలరించిన కమల్‌ సినీ హిస్టరీలో “విచిత్ర సోదరులు”,”గురు”, “గుణ”, “నాయకుడు”, “స్వాతిముత్యం”, “సాగరసంగమం” వంటి ఎన్నో బ్లాక్‌బస్టర్‌ చిత్రాలు ఆయనను అగ్రస్థాయి నటుడుగా నిలబెట్టాయి. అప్పటి సామాజిక పరిస్థితులను కళ్లకుగట్టినట్లు చూపిన “ఆకలి రాజ్యం” మూవే ఆయనలో ఉన్న పూర్తిస్థాయి నటుడిని వెలికి తీసింది. సెన్సెషనల్‌ హిట్‌గా నిలిచి తెలుగు ప్రేక్షకులకు కమల్‌ ను మరింత చేరువ చేసిన “సాగరసంగమం”లో ఆయన నృత్యానికి ప్రేక్షకులు మంత్రముగ్దులయ్యారు. లేటెస్ట్‌గా రిలీజై హిట్‌ను సాధించిన “దశవాతారం”లో పదిపాత్రలు పోషించి అంతర్జాతీయ స్థాయిలో కీర్తిప్రతిష్టలు అందుకున్నారు. ఎన్నో సక్సెస్‌పుల్‌ మూవీలతో ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న కమల్‌కు లెక్కకు మించిన అవార్డులు రివార్డులు సొంతమయ్యాయి. నాలుగు పర్యాయాలు జాతీయ అవార్డులు గెలుచుకోవడంతోపాటు అనేక రాష్ర్టస్థాయి అవార్డులను కూడా దక్కించుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే పద్మశ్రీ అవార్డ్‌ సహితం ఆయనను వరించింది. తమిళనాడులోని “సత్యభామ” డీమ్డ్‌ యూనివర్సిటీ ఆయనను గౌరవ డాక్టరేట్‌ పురస్కారంతో సత్కరించింది. ఇన్ని బిరుదులందుకున్న కమల్‌ కేవలం నటుడు మాత్రమే కాదు… ప్లేబ్యాక్‌ సింగర్‌ కూడా కావడం విశేషం. అంతేనా రీసెంట్‌ మూవీలో కొరియోగ్రఫీ, లిరిక్స్‌, కథాకథనాలను అందించడంతోపాటు ప్రొడక్షన్‌ బాధ్యతలను కూడా నిర్వర్తించిన కమల్‌ బహుముఖ ప్రజ్ఞాశాలి అనిపించుకున్నారు.

Read Full Post »

నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్‌ విభేదాలు వీధికెక్కుతున్నాయి. నగర మేయర్‌ ను సొంత పార్టీ నేతలే బయటకు పంపించిన ఘటన మరువక ముందే రెండు వర్గాలు వీధిపోరాటానికి దిగాయి. రాళ్లు రువ్వుకొనే దాకా వెళ్లడంతో పార్టీ పెద్దలు రంగంలోకి దిగుతున్నారు. నెల్లూరు నగరంలో జరిగిన కాంగ్రెస్‌ పరిరక్షణ సమావేశంలో కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి వర్గంతో వేమిరెడ్డి పట్టాభిరెడ్డి, చేవూరు దేవకుమార్‌ రెడ్డి వర్గాలకు చెందిన వారు కలబడ్డారు. వాస్తవానికి ఇక్కడి కోవూరు నియోజకవర్గం హస్తం పార్టీకి కంచుకోట అనవచ్చు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ నుంచి వచ్చిన శ్రీనివాసుల రెడ్డికి టికెట్‌ లభించింది. దీంతో ఆయన ఎమ్మెల్యే కావటంతో ఆయన వర్గం బలపడుతోంది. ప్రత్యర్థులైన వేమిరెడ్డి పట్టాభిరెడ్డి, చేవూరు దేవకుమార్‌ కలసి కార్యకలాపాలు నడుపుతున్నారు. ఈ క్రమంలో పరిరక్షణ సమావేశం ఏర్పాటు చేయగాఎమ్మెల్యే వర్గానికి చెందిన కార్యకర్తలు రావటంతో గొడవ చెలరేగింది. చేయి చేసుకొనే దాకా పరిస్థితి వెళ్లింది. కాంగ్రెస్‌ పార్టీని పరిరక్షించుకొనేందుకు సమావేశం ఏర్పాటు చేసుకొంటే ఎమ్మెల్యే వర్గీయులు అనవసరపు రగడకు దిగారని ప్రత్యర్థులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం కావటంతో దీనికి హాజరయ్యామని ఎమ్మెల్యే వర్గీయులు అంటున్నారు. రెండు వర్గాలు రాళ్లు రువ్వుకోవటంతో పాత్రికేయులకు సైతం గాయాలయ్యాయి.

Read Full Post »

గతంలో “అందరూ దొంగలే” చిత్రాన్ని అందించిన జియో మీడియా ఆర్ట్స్ అధినేత హర్షారెడ్డి తాజాగా స్వీయ దర్శకత్వంలో ‘ఇందుమతి’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శివాజీ, శ్వేతాభరద్వాజ్, విజయ్, రఘుబాబు, హర్షవర్ధన్, శ్రీనివాస్ రెడ్డి, తులసి, గిరిబాబు, సత్యం రాజేష్, మేల్కొటి, కౌష తదితరులు నటిస్తున్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబర్ మాసాంతానికి ‘ఇందుమతి’ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు హర్షారెడ్డి వెల్లడించారు. కథ, కథనాలు పరంగానే కాకుండా టెక్నికల్‌గా హైస్టాండర్స్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగిందని హర్షారెడ్డి చెప్పారు. ముఖ్యంగా కెమెరామెన్ వాసు, ఎడిటర్ శంకర్, సంగీత దర్శకుడు ఆనంద్ అందించిన సహాయ సహకారాలు ఈ చిత్రానికి ఎంతో ఉపయోగపడ్డాయని హర్షారెడ్డి తెలిపారు. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచే సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘ఇందుమతి ఆడియో ఈ వారంలోనే ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేయనున్నట్లు దర్శక నిర్మాత హర్షారెడ్డి వెల్లడించారు. ఇంకా ఈ చిత్రానికి ఆర్ట్: నారాయణ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రఘునాథ రెడ్డి వారనాసి, కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకత్వం: హర్షారెడ్డి.

Read Full Post »

అభిప్రాయభేదాలను పక్కనబెట్టి కలిసికాపురం చేయడానికి వామపక్షాలు సిద్దమవుతున్నాయి. ప్రజారాజ్యం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోమంటూ చేసిన ప్రకటనను స్వాగతిస్తామని చెబుతున్న వామపక్షాలు వచ్చే ఎన్నికల్లో కలిసే పనిచేస్తామని చెబుతున్నాయి. బీజేపీతో పొత్తుపై ప్రజారాజ్యం మరింత స్పష్టత ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు సూచించారు. సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో సీపీఐ నేతలతో భేటీ అయిన రాఘవులు ఇప్పటివరకు పొత్తులపై తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. అయితే వామపక్షాలు వచ్చే ఎన్నికల్లో కలిసే పని చేస్తాయని ఆయన ప్రకటించారు. ప్రజాసమస్యలపై భావ సారూప్యం ఉన్న పార్టీలతో కలిసి పోరాటాలు చేస్తామని రాఘవులు వివరించారు. వామపక్షాల మధ్య ఎలాంటి అభిప్రాయభేదాలు లేవని సీపీఐ ఉప ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి స్పష్టం చేశారు. బీజేపీతో ఎలాంటి పొత్తు ఉండదని.. చిరంజీవి చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని ఆయన అన్నారు. పొత్తులపై చర్చిస్తున్నామని త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఆయన వివరించారు. ప్రస్తుతం ఉధ్యమాలపైనే దృష్టిపెడతామని చెబుతున్న ఈ పార్టీలు పోరాటాల తర్వాతే ఎన్నికల ఎత్తుగడలుంటాయంటున్నారు.

Read Full Post »

Older Posts »