Feeds:
టపాలు
వ్యాఖ్యలు

హైదరాబాద్‌: బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపాలంటూ సీఎంను కోరేందుకు ఎర్రబెల్లి దయాకరరావు నాయకత్వంలో టీడీపీ ప్రతినిధి బృందం శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. ఆయనను కలిసేందుకు అనుమతి కోరగా ఆయనే వచ్చి మాట్లాడతారంటూ వారిని బయటే నించోబెట్టారు. ఆ తరువాత కొంతసేపటికి వారిని కలిసేందుకు సీఎం నిరాకరించారని సిబ్బంది తెలిపారు. దీనితో ఆగ్రహించిన టీడీపీ నేతలు క్యాంపు కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. సీఎం వచ్చి వినతిపత్రం తీసుకునేవరకు కదలమంటూ అక్కడే బైఠాయించారు. దీంతో పోలీసులు వచ్చి వారిని అరెస్టు చేశారు.

సిరీస్‌ను డిసైడ్‌ చేసే నాగపూర్‌ టెస్ట్‌లో టీమిండియా ఇన్నింగ్స్‌ భారీ స్కోరు దిశగా సాగుతోంది. సచిన్ సెంచరీ, లక్ష్మణ్‌, సెహ్వాగ్‌లు అర్థ సెంచరీలతో భారత్‌ తొలి రోజులో ఆసీస్‌ పై పూర్తి ఆధిక్యం ప్రదర్శించింది. తొలి టెస్ట్‌ ఆడుతున్న విజయ్‌తో కలసి డాషింగ్‌ ఓపెనర్ విరేంద్ర సెహ్వాగ్‌ భారత్‌కు శుభారంభం ఇచ్చాడు. అయితే ద్రవిడ్‌ ఫెల్యూర్‌తో వెంటవెంటనే మూడు వికెట్లు పడిపోవడంతో భారత్‌ ఒత్తిడిలో పడ్డట్టు కనిపించింది. అయితే వందో టెస్ట్‌ ఆడుతున్న లక్ష్మణ్‌, సచిన్‌లు బాధ్యతాయుతంగా ఆడి భారత్‌ను సురక్షిత స్థానంలో నిలిపారు. చివర్లో గంగూలీ, ధోనీలు ఆచితూచి ఆడారు. దీంతో తొలి రోజు ఆటముగిసే సమయానికి భారత్‌ 5 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. ఇక ఈ రోజు ఆటలో భారత్‌ సాధించే పరుగుల మీదే ఈ మ్యాచ్‌ భవితవ్యం ఆధారపడివుంది.

ప్రపంచ స్థాయిలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న యూనివర్సల్‌ స్టార్‌ కమల్‌హాసన్‌. నేటితో యాభై నాలుగు సంవత్సరాలు పూర్తిచేసుకొని యాభై ఐదవ సంవత్సరంలో అడుగుపెడుతున్నారు. ఇంత గుర్తింపు పొందిన అగ్ర కథానాయకుడు పెద్ద ఎత్తున జన్మదినోత్సవాలు జరుపుకుంటున్నారనుకోవడం షరామాములే, కానీ ఇందుకు పూర్తి భిన్నంగా ఆయన నేడు తన పుట్టినరోజును వేడుకను బహిష్కరించారు. శ్రీలంకలో యుద్ధ వాతావరణం నెలకొనడంతో అక్కడి ప్రజల జీవన స్థితిగతులు ఒక్కసారిగా అల్లకల్లోలం అయిన నేపథ్యంలో వారికి సానుభూతిగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. సంచనాలను సృష్టించడంలో ముందుండే కమలహాసన్‌ తీసుకున్న ఈ నిర్ణయం హార్షనీయం. సినీ జగత్తులో సకల కళా వల్లభుడైన కమల్‌హాసన్‌…పందొమ్మిది వందల యాభై నాలుగవ సంవత్సరం నవంబర్‌ ఏడున రాజ్యలక్ష్మి, శ్రీనివాసన్‌ దంపతులకు జన్మించారు. నాలుగవ ఏటనే చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా సినీ రంగ ప్రవేశం చేసిన ఆయనకు “కళత్తూరు కిన్నమ్మ”అనే తమిళ చిత్రం సినిమా కెరీర్‌కు పునాది. వైవిధ్యానికి పెద్ద పీట వేసే ఆయన సినీ ప్రస్థానంలో ఎన్నో మేలిమలుపులు, ఎత్తుపల్లాలను చూశారు. ఆయన నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆయన నటించిన ఎన్నో విలక్షణ చిత్రాలతో ట్రెండ్‌సెట్టర్‌గా ముద్రవేసుకున్నాయి. యాక్షన్‌, సెంటిమెంట్‌, క్లాస్‌, మాస్‌ సబ్జెక్టు ఏదైనా ఏ పాత్రలో నటించిన ఆ క్యారెక్టర్‌కు వంద శాతం న్యాయం చేయడం ఆయనకే చెల్లింది. “మరో చరిత్ర” చిత్రంతో చరిత్ర సృష్టించిన ఆయన “ఎర్ర గులాబీ”లో అత్యంత కౄరత్వాన్ని ప్రదర్శించి ఏ పాత్రకైనా తాను యాప్ట్ అవుతానని నిరూపించుకున్నారు. డిగ్లామర్‌ పాత్రలపై ఎంతో ఇష్టంగా చేసి వాటికి పరిపూర్ణతను చేకూర్చటానికి అహర్నిశలూ కృషి చేస్తుంటారు. కేవలం అభినయానికే పెద్దపీఠ వేసి టాకీ చిత్రాల యుగంలో కూడా ఆయన నటించిన పుష్పకవిమానం కమల్‌ కేరీర్‌లో ఓ డిఫరెంట్‌ మూవీ. కమల్‌ మూవీ “మిస్టరీ”లో సస్పెన్స్‌ థ్రిల్లర్స్‌ను కూడా కాదనలేదు. డిఫరెంట్‌ డిఫరెంట్‌ గెటఫ్స్‌తో “ఇంద్రుడు చంద్రుడు” సినిమాతో ప్రేక్షకులను అలరించిన కమల్‌ సినీ హిస్టరీలో “విచిత్ర సోదరులు”,”గురు”, “గుణ”, “నాయకుడు”, “స్వాతిముత్యం”, “సాగరసంగమం” వంటి ఎన్నో బ్లాక్‌బస్టర్‌ చిత్రాలు ఆయనను అగ్రస్థాయి నటుడుగా నిలబెట్టాయి. అప్పటి సామాజిక పరిస్థితులను కళ్లకుగట్టినట్లు చూపిన “ఆకలి రాజ్యం” మూవే ఆయనలో ఉన్న పూర్తిస్థాయి నటుడిని వెలికి తీసింది. సెన్సెషనల్‌ హిట్‌గా నిలిచి తెలుగు ప్రేక్షకులకు కమల్‌ ను మరింత చేరువ చేసిన “సాగరసంగమం”లో ఆయన నృత్యానికి ప్రేక్షకులు మంత్రముగ్దులయ్యారు. లేటెస్ట్‌గా రిలీజై హిట్‌ను సాధించిన “దశవాతారం”లో పదిపాత్రలు పోషించి అంతర్జాతీయ స్థాయిలో కీర్తిప్రతిష్టలు అందుకున్నారు. ఎన్నో సక్సెస్‌పుల్‌ మూవీలతో ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న కమల్‌కు లెక్కకు మించిన అవార్డులు రివార్డులు సొంతమయ్యాయి. నాలుగు పర్యాయాలు జాతీయ అవార్డులు గెలుచుకోవడంతోపాటు అనేక రాష్ర్టస్థాయి అవార్డులను కూడా దక్కించుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే పద్మశ్రీ అవార్డ్‌ సహితం ఆయనను వరించింది. తమిళనాడులోని “సత్యభామ” డీమ్డ్‌ యూనివర్సిటీ ఆయనను గౌరవ డాక్టరేట్‌ పురస్కారంతో సత్కరించింది. ఇన్ని బిరుదులందుకున్న కమల్‌ కేవలం నటుడు మాత్రమే కాదు… ప్లేబ్యాక్‌ సింగర్‌ కూడా కావడం విశేషం. అంతేనా రీసెంట్‌ మూవీలో కొరియోగ్రఫీ, లిరిక్స్‌, కథాకథనాలను అందించడంతోపాటు ప్రొడక్షన్‌ బాధ్యతలను కూడా నిర్వర్తించిన కమల్‌ బహుముఖ ప్రజ్ఞాశాలి అనిపించుకున్నారు.

నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్‌ విభేదాలు వీధికెక్కుతున్నాయి. నగర మేయర్‌ ను సొంత పార్టీ నేతలే బయటకు పంపించిన ఘటన మరువక ముందే రెండు వర్గాలు వీధిపోరాటానికి దిగాయి. రాళ్లు రువ్వుకొనే దాకా వెళ్లడంతో పార్టీ పెద్దలు రంగంలోకి దిగుతున్నారు. నెల్లూరు నగరంలో జరిగిన కాంగ్రెస్‌ పరిరక్షణ సమావేశంలో కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి వర్గంతో వేమిరెడ్డి పట్టాభిరెడ్డి, చేవూరు దేవకుమార్‌ రెడ్డి వర్గాలకు చెందిన వారు కలబడ్డారు. వాస్తవానికి ఇక్కడి కోవూరు నియోజకవర్గం హస్తం పార్టీకి కంచుకోట అనవచ్చు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ నుంచి వచ్చిన శ్రీనివాసుల రెడ్డికి టికెట్‌ లభించింది. దీంతో ఆయన ఎమ్మెల్యే కావటంతో ఆయన వర్గం బలపడుతోంది. ప్రత్యర్థులైన వేమిరెడ్డి పట్టాభిరెడ్డి, చేవూరు దేవకుమార్‌ కలసి కార్యకలాపాలు నడుపుతున్నారు. ఈ క్రమంలో పరిరక్షణ సమావేశం ఏర్పాటు చేయగాఎమ్మెల్యే వర్గానికి చెందిన కార్యకర్తలు రావటంతో గొడవ చెలరేగింది. చేయి చేసుకొనే దాకా పరిస్థితి వెళ్లింది. కాంగ్రెస్‌ పార్టీని పరిరక్షించుకొనేందుకు సమావేశం ఏర్పాటు చేసుకొంటే ఎమ్మెల్యే వర్గీయులు అనవసరపు రగడకు దిగారని ప్రత్యర్థులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం కావటంతో దీనికి హాజరయ్యామని ఎమ్మెల్యే వర్గీయులు అంటున్నారు. రెండు వర్గాలు రాళ్లు రువ్వుకోవటంతో పాత్రికేయులకు సైతం గాయాలయ్యాయి.

గతంలో “అందరూ దొంగలే” చిత్రాన్ని అందించిన జియో మీడియా ఆర్ట్స్ అధినేత హర్షారెడ్డి తాజాగా స్వీయ దర్శకత్వంలో ‘ఇందుమతి’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శివాజీ, శ్వేతాభరద్వాజ్, విజయ్, రఘుబాబు, హర్షవర్ధన్, శ్రీనివాస్ రెడ్డి, తులసి, గిరిబాబు, సత్యం రాజేష్, మేల్కొటి, కౌష తదితరులు నటిస్తున్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబర్ మాసాంతానికి ‘ఇందుమతి’ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు హర్షారెడ్డి వెల్లడించారు. కథ, కథనాలు పరంగానే కాకుండా టెక్నికల్‌గా హైస్టాండర్స్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగిందని హర్షారెడ్డి చెప్పారు. ముఖ్యంగా కెమెరామెన్ వాసు, ఎడిటర్ శంకర్, సంగీత దర్శకుడు ఆనంద్ అందించిన సహాయ సహకారాలు ఈ చిత్రానికి ఎంతో ఉపయోగపడ్డాయని హర్షారెడ్డి తెలిపారు. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచే సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘ఇందుమతి ఆడియో ఈ వారంలోనే ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేయనున్నట్లు దర్శక నిర్మాత హర్షారెడ్డి వెల్లడించారు. ఇంకా ఈ చిత్రానికి ఆర్ట్: నారాయణ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రఘునాథ రెడ్డి వారనాసి, కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకత్వం: హర్షారెడ్డి.

అభిప్రాయభేదాలను పక్కనబెట్టి కలిసికాపురం చేయడానికి వామపక్షాలు సిద్దమవుతున్నాయి. ప్రజారాజ్యం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోమంటూ చేసిన ప్రకటనను స్వాగతిస్తామని చెబుతున్న వామపక్షాలు వచ్చే ఎన్నికల్లో కలిసే పనిచేస్తామని చెబుతున్నాయి. బీజేపీతో పొత్తుపై ప్రజారాజ్యం మరింత స్పష్టత ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు సూచించారు. సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో సీపీఐ నేతలతో భేటీ అయిన రాఘవులు ఇప్పటివరకు పొత్తులపై తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. అయితే వామపక్షాలు వచ్చే ఎన్నికల్లో కలిసే పని చేస్తాయని ఆయన ప్రకటించారు. ప్రజాసమస్యలపై భావ సారూప్యం ఉన్న పార్టీలతో కలిసి పోరాటాలు చేస్తామని రాఘవులు వివరించారు. వామపక్షాల మధ్య ఎలాంటి అభిప్రాయభేదాలు లేవని సీపీఐ ఉప ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి స్పష్టం చేశారు. బీజేపీతో ఎలాంటి పొత్తు ఉండదని.. చిరంజీవి చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని ఆయన అన్నారు. పొత్తులపై చర్చిస్తున్నామని త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఆయన వివరించారు. ప్రస్తుతం ఉధ్యమాలపైనే దృష్టిపెడతామని చెబుతున్న ఈ పార్టీలు పోరాటాల తర్వాతే ఎన్నికల ఎత్తుగడలుంటాయంటున్నారు.

వరుస హత్యలు, కిడ్నాప్‌లతో తిరుపతి మారుమ్రోగుతోంది. స్కూలుకు వెళ్ళిన పిల్లలు తిరిగి వచ్చే వరకు తల్లిదండ్రులకు టెన్షన్‌ తప్పడం లేదు. గత నవంబర్‌లో గురు శ్రీను అనే బాలుడ్ని కిడ్నాప్‌ చేసి కిరాతకంగా హత్య చేసిన ఘటన మరువక ముందే మరో చిన్నారి దారుణహత్యకు గురైంది. ప్రపంచంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న తిరుపతి నగరం ఇప్పుడు వరుస హత్యలతో మారుమోగుతోంది. ఇటీవల కాలంలో పెరుగుతున్న హత్యలతో ప్రజలు భయానికి లోనవుతున్నారు. ప్రధానంగా స్కూలు పిల్లలను టార్గెట్‌గా చేసుకొని జరుగుతున్న కిడ్నాప్‌లు, హత్యలతో తల్లిదండ్రులను భయానికి గురిచేస్తున్నాయి. గత సంవత్సరం నవంబర్‌లో గురు శ్రీను అనే బాలుడ్ని సమీప బంధువులే కిడ్నాప్‌ చేసి పది లక్షలు డిమాండ్‌ చేశారు. అయితే వారి కోసం పోలీసులు రంగంలోకి దిగడంతో భయపడిన కిడ్నాపర్లు అతికిరాతంగా గొంతుకోసి చెరువులో పడేశారు. అప్పట్లో ఈ హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇటీవల తిరుపతి భవానీనగర్‌లో టైలర్‌ విజయ్‌కుమార్‌ భార్య, ఇద్దరు చిన్నారులను సమీప బంధువే హత్య చేశారు. పనికోసం విజయకుమార్‌ బయటకు వెళ్ళిన సమయంలో అతని భార్య వనజాక్షి, పిల్లలు మోనీష్‌ శ్రావణిలను మనోహరే హత్య చేశాడు. అదే రోజు రాత్రి పిలతీర్థం దగ్గర ఓ యువతి దారుణ హత్యకు గురైంది. ఓ ప్రైవేటు కంపెనీలో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తోన్న రోహిణిపై కొందరు దుర్మార్గులు అత్యాచారం చేసి కిరాతకంగా హత్యచేసి ముళ్ళపొదల్లో పడేశారు. తెల్లవారేసరికి ఈ రెండు హత్యల విషయం బయటపడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఈ సంఘటనలు జరిగి పదిహేను రోజులు గడవకముందే చిన్నారి ఆయేషా హత్యోదంతం తెరపైకి వచ్చింది. చదువుకోసం, ఉద్యోగాల కోసం బయటకు వెళ్తున్న చిన్నారులు, యువతులకు రక్షణ లేకపోవడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలో రోజు రోజుకు మానవతా విలువలు మంటగలిసిపోతున్నాయి. వరుసగా జరుగుతున్న హత్యోదంతాలు తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగులుస్తున్నాయి.

తెలంగాణా జిల్లాల్లో ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ప్రజా అంకిత యాత్రకు విశేష స్పందన లభించింది. మూడు జిల్లాల్లో ఎనిమిది రోజుల పాటు సాగిన చిరు యాత్ర పిఆర్‌పి శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని కలిగించింది. వరంగల్‌లో చిన్నపాటి అపశృతులు చోటచేసుకున్నా మొత్తానికి యాత్ర సక్సెస్‌ అయ్యింది. ఉత్తరాంధ్ర పర్యటన అనంతరం గత నెల 30 నుంచి కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లలో ప్రారంభమైన చిరంజీవి ప్రజా అంకిత యాత్ర దాదాపు 650 కిలో మీటర్లు సాగి ఖమ్మం జిల్లా భద్రాచలంతో ముగిసింది. కాంగ్రెస్‌ ప్రభుత్వ అవినీతిపై విమర్శనాస్త్రాలు సందిస్తూ, ప్రజారాజ్యం పార్టీ లక్ష్యాలు వివరిస్తూ, చిరు ప్రసంగం కొనసాగించారు. పర్యటనలో స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ, అంతర్జాతీయ విషయాలకు టచప్‌ ఇస్తూ, చిరంజీవి చేసిన ప్రసంగానికి తెలంగాణాలో మంచి స్పందన వచ్చింది. తెలంగాణా మీద తమ వైఖరి మరింత స్పష్టంగా తెలపాలంటూ కొందరు నిరసనలు వ్యక్తం చేయటంతో పాటు కొందరు ఆకతాయిలు చిరంజీవిపై కోడిగుడ్లతో దాడి చేయటం ఆయనకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. చివరకు తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని చిరంజీవి ప్రకటించటం పిఆర్‌పి కార్యకర్తలతో పాటు తెలంగాణా ప్రాంత ప్రజల్లో ఆనందం వెల్లువిరిసింది. ఎస్‌.సి వర్గీకరణపై తమ పార్టీ చేస్తున్న అధ్యయనాన్ని త్వరలో వెల్లడిస్తామని చిరు అన్నారు. తెలంగాణాలో విజయవంతంగా ప్రజా అంకిత యాత్ర పూర్తి కావటంతో ఈ నెల 12 నుంచి రాయలసీమ జిల్లాలో యాత్రకు చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

తిరుపతిలో కిడ్నాప్‌కు గురైన చిన్నారి ఆయేషా శవమై తేలింది. ఓ ప్రైవేటు పాఠశాల్లో మూడో తరగతి చదువుతున్న ఆమెను డబ్బు కోసం కిడ్నాప్‌ చేసిన కొందరు దుర్మార్గులు గొంతు నులిమి చంపేశారు. తమ కుమార్తె తిరిగి వస్తుందని ఎదురు చూసిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తిరుపతి కోర్లగుంటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో మూడోతరగతి చదువుచున్న తొమ్మిదేళ్ళ ఆయేషా నిన్న సాయంత్రం స్కూల్‌ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా కొందరు వ్యక్తులు ఆమెను కిడ్నాప్‌ చేశారు. ఆయేషా తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి రెండు లక్షలు ఇస్తే వదిలేస్తామని లేదా చంపేస్తామని బెదిరించారు. దీంతో ఏమి చేయాలో పాలపోని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. అయితే ఒకవేళ డబ్బు ఇవ్వకపోతే తమ బిడ్డని చంపేస్తారని భయపడి డబ్బు కోసం ప్రయత్నించారు. అయితే ఈ కిడ్నాప్‌ విషయం అల్లరికావడంతో భయపడిన అగంతకులు చిన్నారి ఆయేషాను గొంతు నులిమి హత్య చేసి స్థానికంగా ఉన్న రామాలయం దగ్గర లారీ క్యాబిన్‌లో పడేశారు. ఆయేషా మరణవార్త తల్లిదండ్రులకు తెలియడంతో వారు శోకసముద్రంలో మునిగిపోయారు. అయితే ఈ కేసులో అనుమానితునిగా భావిస్తున్న మృతురాలి మేనమామ హబీబ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తిరుపతి కేవలం పేరుకే పుణ్యక్షేత్రంగా ఉందని పలువురు రాజకీయ నాయకులు వ్యాఖ్యానించారు. ప్రశాంతతకు మారుపేరుగా ఉండాల్సిన ఈ ప్రాంతం ఇప్పుడు హత్యలతో రక్తసిక్తమౌతోందన్నారు. చిన్నారి ఆయేషాను కిడ్నాప్‌ చేసి దారుణంగా హత్యచేసిన వారిని పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. గత కొంతకాలంగా తిరుపతిలో జరుగుతున్న చిన్నారుల కిడ్నాప్‌లతో తల్లిదండ్రులు భయానికి లోనవుతున్నారు.

తెలుగుదేశం పార్టీ అంత్యంత ప్రతిష్టాత్మక రీతిలో గుంటూరులో యువగర్జన నిర్వహించింది. ప్రజలు బ్రహ్మాండంగా తరలివచ్చారని తెలుగుదేశం నేతలు ఆనందంగా ఉన్నారు. ఇంతకుముందు ప్రజారాజ్యంపార్టీ తిరుపతిలో, కాంగ్రెస్ పార్టీ అనంతపురం, నెల్లూరులలో జరిపిన సభలను మించి జనసమీకరణ చేయాలన్న తమ లక్ష్యం నెరవేరిందని దేశం నేతలు ఉత్సాహంగా ఉన్నారు. జనం ఘనంగా వచ్చిన మాట వాస్తవమే. మిగిలిన పక్షాల నేతలు కూడా ఈ సభపై ఏ తరహా విశ్లేషణలు, వ్యాఖ్యలు చేసినా, జన అంచనాలను మాత్రం తక్కువ చేయడం లేదు. అంతవరకు బాగానే ఉంది. మరి ఇక తెలుగుదేశం పార్టీకి ఈ సభ నిర్వహణ ద్వారా ఎలాంటి ప్రయోజనాలు నెరవేరుతాయి? కచ్చితంగా తెలుగుదేశం శ్రేణులలో విశ్వాసం పెరుగుతుంది. అదికార కాంగ్రెస్ పార్టీ మీద, ప్రత్యేకించి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిపై పెద్దగా వ్యతిరేకత లేదని కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేస్తున్న సందర్భంలో, మరోపక్క చిరంజీవి సభలకు జనప్రవాహం వస్తుందని ప్రజారాజ్యంపార్టీ నేతలు సంభరపడుతున్న నేపధ్యంలో టిడిపి భారీ సభ నడపడం ద్వారా తన సత్తాను చాటుకుంది. తన క్యాడరు చెక్కు చెదరలేదని చెప్పడానికి టిడిపి ఈ ప్రయత్నాన్ని బాగానే వాడుకుంది. కాంగ్రెస్ కు తామే ప్రధాన ప్రత్యర్ధి అన్న భావన కల్పించడానికి, ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేఖత బాగానే ఉందని నిరూపించడానికి ఈ సభ ఉపకరిస్తుంది. అంతేకాదు తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు నాయకత్వ పటిమ మరోసారి రుజువు చేసుకున్నట్లయింది. కేవలం జన సమీకరణ ఒక్కటే విజయానికి సరిపోతుందా అన్నది ఓ ప్రశ్న. అన్ని పార్టీలు భారీ సభలు జరుపుతున్నాయి కదా అన్నసందేహం వెన్నంటే ఉంటుంది. సభల నిర్వహణ అయ్యే వ్యయప్రయాసల సంగతెలా ఉన్నా, వచ్చే ఎన్నికల రంగంలో ధీటుగా నిలబడి అధికారం చేపట్టడానికి సవాలు విసురగలిగిందన్న భావన అయితే వ్యక్తం అయింది. ఈ సభ ద్వారా ఇతర పక్షాలు అంటే టి.ఆర్.ఎస్., వామపక్షాలవారికి కూడా తెలుగుదేశం పార్టీ ఒక సంకేతాన్నిఇవ్వగలిగింది. తాను ఎంత బలంగా ఉన్నానో చెప్పగలిగింది. అంతేకాదు. ఎన్.టి.ఆర్.వారసులు తనతో ఉన్నారని చెప్పడం ద్వారా వారి, వారి అభిమానులను తనవైపు తిప్పుకోవడంలో టిడిపి సఫలమైనట్లే. అయితే ఇదే తరుణంలో కేంద్రమంత్రి ఎన్.టి.ఆర్.కుమార్తె పురంధరేశ్వరి బహిరంగ లేఖ రాయడం కాంగ్రెస్ ప్రతి వ్యూహంలో భాగమే. వీటన్నిటికి టిడిపి నేతలు జవాబు చెప్పారుగాని, ఎన్.టి.ఆర్ కుటుంబీకులంతా ఒకేవైపు లేరనడానికి ఆ లేఖ పనికివస్తుంది. ఇక ఉపన్యాసాలు చూస్తే బాలకృష్ణ ప్రసంగం ప్రజల్ని బాగానే ఆకట్టుకుందని చెప్పాలి. ప్రత్యేకించి తాను అన్ని కులాలవాడినని చెప్పడానికి చేసిన ప్రయత్నం బాగుంది. ఇంతవరకు సభ లక్ష్యం నెరవేరినట్లు కన్పించినా, ఇందులో కొన్ని బలహీనతలు కూడా బయటపడ్డాయని ఒప్పుకోకతప్పదు. ఒకప్పుడు ఒంటిచేత్తో పార్టీని, ప్రభుత్వాన్ని నడపగలరని పేరు తెచ్చుకున్న చంద్రబాబునాయుడు ఇప్పుడు హరికృష్ణ, బాలకృష్ణ, చివరికి జూనియర్ ఎన్.టి.ఆర్., కళ్యాణరామ్, తారకరత్న వంటి పిన్న వయస్కులపై ఆధారపడడానికి తాపత్రయపడ్డారన్న విమర్శకు ఆస్కారం ఇచ్చారు. ఇక హరికృష్ణ గతంలో చంద్రబాబుపై చేసిన విమర్శలను కూడా కాంగ్రెస్ పార్టీ విస్తారంగా ప్రచారం చేయడానికి సిద్దమైంది. వాటికి హరికృష్ణ జవాబు చెబుతారో లేదో తెలియదు. అంతేకాదు బాలకృష్ణ ఏ విమర్శపడితే ఆ విమర్శ చేయడానికి కుదరదు అన్నట్లుగా బాలకృష్ణ ఇంటిలో కొంతకాలం క్రితం జరిగిన కాల్పుల ఘటనను కాంగ్రెస్ విమర్శనాస్త్రంగా ఎక్కు పెట్టింది వారసత్వం వరంగా ఎక్కువకాలం చెల్లుబాటుకాదు. ప్రతిభ, సామర్ధ్యమే ఏ వ్యక్తికైనా గీటురాళ్ళు అని ఓ ప్రఖ్యాత రచయిత అంటారు. మరి ఈ కొటేషన్ మన రాజకీయాలకు వర్తిస్తుందా అన్నది ప్రశ్న.